Saturday, December 31, 2016

అందం

తులసిమొక్క ఇంటిముందు ఉంటేనే అందం
వాకిట్లో రంగవల్లి కంటేనే అందం

సౌందర్యం చిరునామా ఇంట్లోనే ఉందోయ్ 
తనువంతా పసుపు రాసుకుంటేనే అందం 

బూస్టులోన ఏముందో ఎఱుకలేదు సీక్రెట్ 
పొద్దున్నే చద్దన్నం తింటేనే అందం

పసిపిల్లల హాసంలో ఉంటుందోయ్ స్వర్గం 
చంటిపాపలెపుడు నవ్వుతుంటేనే అందం
   
పెద్దవారి మాట వింటె అదే గెలుపు మంత్రం 
ఇంటిలోన పెద్దదిక్కులుంటేనే అందం

వందమంది కొడుకులుండి ఏంలాభం తల్లికి 
రాముడంటి కొడుకునొకని కంటేనే అందం 

ఈడూరీ తెల్లదొరలు వెళ్ళిపోయిరెపుడో 
ఇండియాని భరతదేశమంటేనే అందం

Thursday, December 29, 2016

నమ్మకురోయ్

ఏటియెమ్ములొ డబ్బున్నట్టుగ కలలొస్తుంటె నమ్మకురోయ్
చక్కనిచుక్క తనకుతానుగ వలచొస్తుంటే నమ్మకురోయ్

లక్ష్మిదేవికి నీపైప్రేమ పెరిగనదేంటి అనుకోమాక
కోట్లకుకోట్లు గెలిచినట్టుగ మెయిలొస్తుంటే నమ్మకురోయ్

నల్లధనాన్ని దాచాలంటె మార్గాలెన్నొ వేలకువేలు
పక్కింటోడు లక్షల్లక్షలు పిలిచిస్తుంటె నమ్మకురోయ్

నేతలందరు గొప్పోళ్ళురా వారికినీకు పోలికలేదు
బీకాములో ఫిజిక్సు లెసను చదివానంటే నమ్మకురోయ్

కొత్తగ పెళ్ళి అయినవాడికి కోతిక్కొబ్బరి దొరికినట్టు 
భార్య చక్కగ చెప్పినవన్ని చేసేస్తుంటే నమ్మకురోయ్

Monday, November 28, 2016

నువ్వు లేకుంటే

ఈ వన్నెలు అంటేవా పొదరిళ్ళకి, నువ్వు లేకుంటే 
ఈ ముగ్గులు వుండేవా వాకిళ్ళకి, నువ్వు లేకుంటే

అందాలను పొందికగా ఏరికూర్చినట్టి రూపానివి  
ఈ విందులు అందేవా నాకళ్ళకి, నువ్వు లేకుంటే

ఊపిరాగిపోయేనా అనిపించే తీపి పరవశాలు 
ఈ బిగువులు దక్కేవా కౌగిళ్ళకి, నువ్వు లేకుంటే

మనకలయిక అతిమధురం శుభతరుణం ప్రేమ రాజ్యానికి  
ఈ పసుపులు తగిలేవా మావిళ్ళకి, నువ్వు లేకుంటే

వలపంతా రంగరించి నిధిలాగా పోత పోసినాను    
సిరిబిందెలు చేరేవా కావిళ్ళకి, నువ్వు లేకుంటే

Saturday, November 19, 2016

ఉంటావూ

చిగురించిన గజలులాగ వెంటాడుతు ఉంటావూ 
మనసులోని భావంలా మాటాడుతు ఉంటావూ  

అద్దంలో చూసుకుంటె నీలానే ఉంటున్నా  
అనుక్షణం నాలోనే తారాడుతు ఉంటావూ

సద్దులేని భాషలాగ మౌనంగా ఉంటూనే 
నీ ఉనికిని కోరుకుంటు పోరాడుతు ఉంటావూ

నిన్ను వదలి ఉండలేను అదినాకూ తెలుసునులే 
జ్ఞాపకాల గొలుసుపట్టి వేలాడుతు ఉంటావూ 

నీ చెంతలొ ఈడూరికి ఏచింతా ఉండదులే 
నీడలాగ వెన్నంటీ కాపాడుతు ఉంటావూ

బాల్యం

పుస్తకాల సంచిలోనె నాబాల్యం నలుగుతోంది
ఆరుబయట ఆడుకునే సౌకర్యం కరుగుతోంది

రంగు రంగు బట్టలతో పెరగాల్సిన వయసులోన
సర్కసులో జోకరులా ఆహార్యం మిగులుతోంది

వేలికొనల మీద నేడు ప్రపంచమే ఆడుతోంది
గదిగోడల మధ్యలోనె నామాన్యం వెలుగుతోంది

తల్లిదండ్రి కర్కశులై హాస్టల్లో పడవేస్తే
మమతలకే దూరంగా నారాజ్యం రగులుతోంది

పిల్లలంటె భూమి మీద దేవతలే ఈడూరీ
రానురాను పసివాళ్ళకి ఆ భాగ్యం తరుగుతోంది

Saturday, November 5, 2016

ముద్దొస్తావ్

గోరింటను పెట్టుకున్న చేతులతో ముద్దొస్తావ్
పసిపాపను తలపించే చేతలతో ముద్దొస్తావ్ 

పరుచుకున్న మౌనంతో ఏకాకిగ నేనుంటే 
ప్రేమలొలుకు నీతియ్యని మాటలతో ముద్దొస్తావ్ 

మధువులనే తాగేసిన మధుపమువే నీవేమో 
పెదవులు పంచే తేనెల ఊటలతో ముద్దొస్తావ్ 

చిగురాకులు తినిపెరిగిన కోయిలవే అనుకుంటా 
వసంతాలు కురిపించే పాటలతో ముద్దొస్తావ్

ఈడూరికి రసారణ్య కేసరివే భామినీ 
రాసలీల వినోదాల వేటలతో ముద్దొస్తావ్ 

ఇంకొక దీపావళి గజల్

చీకటితో వెలుగు చేయు పోరాటం దీపావళి
టపాసులే కాల్చుకునే ఆరాటం దీపావళి

బాంబులన్ని కాల్చేసీ కాలరెత్తి తిరగాలని
మరదలెదుట బావగారి ఉబలాటం దీపావళి

దొరికినన్ని టపాసులూ కొనితెచ్చుకోవాలాని
పిల్లకాయలందరికీ బులబాటం దీపావళి

కళ్లుచెదురు ధరలతోటి చిల్లులున్న జేబుతోటి
సగటు మనుషులెదుర్కొనే పితలాటం దీపావళి

ఆనందం ఎంతున్నా ఈడూరీ నిజానికీ
శివకాశీ శ్రామికులకు చెలగాటం దీపావళి

Saturday, October 29, 2016

దీపావళి

సత్యభామ శౌర్యానికి సాక్షమదియె దీపావళి
మంచిచెడుల పోరాటపు ఫలితమదియె దీపావళి

ఇంటింటా ఆనందం వెల్లివిరియు శుభతరుణం 
ఊరంతా ప్రసరించే వెలుగు నదియె దీపావళి

భూచక్రం మతాబులూ చిచ్చుబుడ్లు కాకరొత్తి
బాలలంత సంతసించు పండుగదియె దీపావళి

కార్పొరేట్లు వ్యాపారులు ఒకరేమిటి అందరూను
మిఠాయిలే పంచుకొనెడి పర్వమదియె దీపావళి

టపాకాయ పొగలతోటి గాలిలోని క్రిములన్నీ
తోకముడిచి పారిపోవు సమయమదియె దీపావళి

మార్వాడీ మారాజులు లక్ష్మిదేవి పూజ చేసి 
కొత్తపద్దు మొదలెట్టే వేడుకదియె దీపావళి

కానివారు గొంతెత్తీ కాలుష్యం అంటున్నా
ప్రజలంతా జరుపుకొనెడి పబ్బమదియె దీపావళి 

Thursday, October 20, 2016

వస్తావా

నిండు గోదారిలొ పండు వెన్నెలల్లె వస్తావా 
గుండె ఎడారిలో మంచు బిందువల్లె వస్తావా

రంగురంగు కలలెన్నో నా మదిలో నింపి నీవు  
మేఘాల్లో విరిసె ఇంద్ర చాపమల్లె వస్తావా 

గుండె గుడిలొ నీ చిత్రం పెట్టి పూజ చేస్తున్నా  
పరిమళాలు జల్లు అగరు ధూపమల్లె వస్తావా

చీకట్లను చెండాడే శక్తి కదా నీకున్నది    
ధగధగా మెరిసే చంద్రకాంతమల్లె వస్తావా

ఈడూరిలొ భావుకతే నీ రూపం దాల్చుతోంది     
గజల్లోన రాసుకున్న భావమల్లె వస్తావా

Wednesday, October 19, 2016

సరే సరే

నా తోడిక క్షణమైనా వద్దంటే సరే సరే 
చేసుకున్న బాసలన్ని రద్దంటే సరే సరే

గులాబీల పరిమళాలు మనకేమీ కొత్త కాదు 
పువ్వు కాదు కంటకమే ముద్దంటే సరే సరే 

ఎల్లలేవి లేకుండా ప్రేమవిందుకాశపడితె 
ఇకనుండీ ముళ్ళకంచె హద్దంటే సరే సరే 

కలిసివున్న కాలంలో అనుభూతులు ఎన్నెన్నో
కలలన్నీ తెల్లారని పొద్దంటే సరే సరే

ఈడూరికి ఈ కష్టం దాటడమే తెలియనిదా 
శనిదేవుడె మనపెళ్ళికి పెద్దంటే సరే సరే 

Tuesday, October 18, 2016

భార్యామణి

నన్నుకొట్టి నువ్వెందుకు నవ్వుతావె భార్యామణి
కయ్యానికి కాలెందుకు దువ్వుతావె భార్యామణి

చిలికిచిలికి గాలివాన చెయ్యబోకు ప్రతివిషయం 
కాలకూట విషమెందుకు చిమ్ముతావె భార్యామణి

తప్పునాది కాదన్నది తెలిసికూడ వాదిస్తావ్ 
నేతిబీర నెయ్యినెలా అమ్ముతావె భార్యామణి

మొదటిషోకి మొదలెడితే నైటుషోకి తెములుతావు
అద్దానికి నీళ్ళనెపుడు వదులుతావె భార్యామణి

అనుష్కతో పోలిస్తే పనిపిల్లకి అప్పిస్తావ్   
అందగత్తెవంటెచాలు పొంగుతావె భార్యామణి 

హిట్లరునే మరపిస్తూ నియమాలను నిలుపుతావు
కారాలను మిరియాలను నూరుతావె భార్యామణి  

అందంగా తయారయ్యి అటువైపుకి తిరుగుతావు 
ఆశపెట్టి నీళ్ళుజల్లి కులుకుతావె భార్యామణి 

Wednesday, October 5, 2016

తెలియలేదు

మొదటిసారి నిన్నుచూసి మనసునెలా జార్చానో తెలియలేదు
రాసుకున్న ప్రేమలేఖ నీదరికెలా చేర్చానొ తెలియలేదు

చినదానా ఉడుముపట్టు పట్టి నీవు బిగుసుకోని కూచుంటే 
ముగ్గులోకి లాగేందుకు ఏమి వండి వార్చానో తెలియలేదు

నువ్వు వచ్చి చేరాకా రాకెట్లా సాగుతోంది ఈ పయనం 
ప్రేమలోకి దిగినాకా ఏ గేరుని మార్చానో తెలియలేదు 

పరిమళించు మనసుతోటి పల్లవిలా చేరావే ఎదలోనికి 
పాడుకున్న ప్రేమగీతికేరాగం కూర్చానో తెలియలేదు
    
ఈడూరికి నీవులేక ఘడియైనా యుగమేలే ఈ జగాన 
గొంతుదాటి జారిపడని గరళమెలా ఓర్చానో తెలియలేదు

Monday, October 3, 2016

మామూలే

దసరా అంటే సరదా తీరుట మామూలే
జేబులనిండా చిల్లులు మిగులుట మామూలే

పంతులు గారికి అయిదే రూకలు కాదండీ 
పంచినకొద్దీ చేతులు చాచుట మామూలే  

పోస్టూ పేపరు కూరలు యిస్త్రి ఒక్కరేమిటి 
ఎన్నడు అగుపడనెవరో వచ్చుట మామూలే 

కటువుగ మాటలు వదిలే కరెంటు లైనుమ్యాన్  
చేతులు ముడుచుకు ఎదురుగ నిలుచుట మామూలే

కానిస్టేబుల్ కనకారావ్ కంటికి దొరకడు  
దసరా వస్తే పళ్ళికిలించుట మామూలే    

మున్సీపాలిటి ముడుపులు చాలవు అన్నట్టుగ  
ముంగిట చేరీ నీళ్ళను నములుట మామూలే 

టైముకి ఎపుడూ రానిది గ్యాసే కద బాసూ  
పండుగనాడే సిలిండరొచ్చుట మామూలే 

అందరికన్నీ యిస్తే మిగులు చేతికి చిప్ప 
అత్తారింటికి అల్లుడు వెళ్ళుట మామూలే

మామూళ్ళిస్తే నువ్వే హీరో ఈడూరీ 
లేదని అంటే చుక్కలు చూపుట మామూలే

Tuesday, September 27, 2016

బేఫికర్

నింగిలోన మనజెండా ఎగురుతుంటె బేఫికర్
సరిహద్దున మనజవాను నిలిచుంటే బేఫికర్ 

భూమాతకు పచ్చబొట్టు పెట్టి మురిసిపోవుచూ  
ఆరుగాలమన్నదాత  శ్రమిస్తుంటె బేఫికర్

కులమతాలు ఏవైనా కష్టాలెన్నెదురైన  
భరతమాత బిడ్డలంత కలిసుంటే బేఫికర్

పగలుదాటి పోయాకా రాతిరవక తప్పదులె 
ఆకసాన వెలుగుదివ్వె మెరుస్తుంటె బేఫికర్
   
గాయపడిన హృదయాలకు మందున్నది ఈడూరి  
మనసులోని తడి ఎపుడూ ఆరకుంటె బేఫికర్

Monday, September 19, 2016

మేఘం

ప్రియురాలీ ప్రేమలాగ కురిసిందొక మేఘం
పట్టుజరీ అంచులాగ మెరిసిందొక మేఘం

పచ్చచీర కట్టుకున్న పుడమిలాగ నవ్వుతు 
ప్రియునిగన్న ప్రియురాలై మురిసిందొక మేఘం 

ఆకసాన నక్షత్రపు సమూహాల సాక్షిగ 
వలపువిరుల జడివానలొ తడిసిందొక మేఘం

తాజుమహలు చూడగానె పెరుగునులే ప్రేమలు 
ప్రేమగాధ స్మారకమై వెలిసిందొక మేఘం

ఈడూరీ బరువెక్కిన హృదయంతో నేడూ   
విరహినిలా చెలికాడిని కసిరిందొక మేఘం

ఉన్నావే

శంకరాభరణంలోని తులసిలాగ ఉన్నావే
బాపుగారి సినిమాలో భామలాగ ఉన్నావే

బొడ్డుమీద పండుపడితె గమ్మత్తుగ కదులుతావు
రాఘవేంద్ర చిత్రంలో రంభలాగ ఉన్నావే

కస్సుమనీ బుస్సుమనీ కసురుతూనె ఉంటావూ
కృష్ణవంశి చక్రంలో ఛార్మిలాగ ఉన్నావే

రాంగోపాలుడికి రాని ఊహలేవొ వస్తున్నాయ్
క్షణక్షణం సినిమా శ్రీదేవిలాగ ఉన్నావే

గోరింటలు పెట్టావా ఎర్రబడెను కళ్ళుకూడ
సత్యభామ వేషంలో జమునలాగ ఉన్నావే

నోరుతెరవకుండానే కబుర్లెన్నొ చెబుతావూ
ఉత్తరాది సినిమాలో రేఖలాగ ఉన్నావే

అబ్బో నీ నాటకాలు ఈడూరికి తెలియనివా
సావిత్రిని తలదన్నే తారలాగ ఉన్నావే

Thursday, September 15, 2016

ఒక్కక్షణం

నీఅడుగుతొ నా అడుగులు కలపనివ్వు ఒక్కక్షణం  
నీకన్నుల ఊసులేవొ చదవనివ్వు ఒక్కక్షణం

నీరూపమె నిండివుంది అణువణువూ నామేనిలో    
నాగుండెల ప్రేమగంట మోగనివ్వు ఒక్కక్షణం

చకోరమై చూశానే నీకోసం ప్రతిక్షణమూ  
నీపెదవుల మకరందం తాగనివ్వు ఒక్కక్ష ణం 

పదహారూ అణాలెత్తు సౌందర్యం నీదేనులే  
అచ్చతెలుగు అందాలను మోయనివ్వు ఒక్కక్షణం  

ఈ కల యిక ఆగిపోవుననే భయం తొలుస్తున్నది  
నీవలపుల సుమగంధం కురవనివ్వు ఒక్కక్షణం

Saturday, September 10, 2016

పదేపదే

అదిగదిగో అదోలాగ చూడమాకు పదేపదే 
చూసికూడ చూడనట్టు తిరగమాకు పదేపదే

ఎవరెంతగ వలవేసిన పడ్డవాణ్ణి కాదు నేను
గాలమేసి నా మనసే లాగమాకు పదేపదే

ఓలమ్మీ ఓపలేను ఏదేదో అవుతోందే 
ఓరకంట చూసి మరీ నవ్వమాకు పదేపదే

ఏదోలా వెంటపడీ చేరినాను నీసరసకు
దొరికినట్టె దొరికినాక జారమాకు పదేపదే 

ఈడూరిని  వదిలిపెట్టి పోవద్దే చినదానా  
అలకచూపి పుట్టింటికి చేరమాకు పదేపదే 

Monday, September 5, 2016

గుర్తుందా

బడికిదారి చూపినట్టి కాలిబాట గుర్తుందా
చింతచెట్టు నీడలొన గోళీలాట గుర్తుందా 

పడిలేస్తూ ఎగబాకుతు కొండమీదికెక్కి మరీ 
పరవశాన చూసినట్టి రాతికోట గుర్తుందా 

వాగులోన ఆడుకుంటు డస్సిపోయి దప్పికయ్యి
యిసుకలోన తవ్వుకున్న చెలమ ఊట గుర్తుందా

మంటచూసి కొరివిదయ్యమనుకుంటూ భయపడ్డాం
ఊరిబయట కాలుతోన్న చెరుకుతోట గుర్తుందా 

నీవులేక నేను లేను అనుకుంటూ ఒకరినొకరు
హత్తుకుంటు పాడుకున్న చెలిమిపాట గుర్తుందా

క్లాసులోని రెండుజెళ్ళ సీత కన్ను కొట్టిందని
ఉబుసుపోక చెప్పుకున్న గాలిమాట గుర్తుందా

సినిమాకై పడిగాపులు ఆనందమె ఈడూరికి
మొదటి ఆట టికెట్టుకై తోపులాట గుర్తుందా

Friday, September 2, 2016

సఖియా

అమాసలో వెన్నెలలే తెచ్చావే నా సఖియా
వేసవిలో చల్లదనం యిచ్చావే నా సఖియా 

వేదనగా మిగిలిందే జీవితమే ఓ క్షణాన
ఎడారిలో ఒయాసిసై వచ్చావే నా సఖియా

మన్మధుడూ నీకు పోటి రాలేడనిపించేలా
వలపు శరము గుండెలలో గుచ్చావే నా సఖియా

అలుకలోన సత్యభామ పోలికేదొ అబ్బినట్టు
మనసుపొరల లోతులలో గిచ్చావే నా సఖియా 

ఏ జన్మదొ ఈబంధం దేవుడైన చెప్పలేడు  
చూడగానె ఈడూరికి నచ్చావే నా సఖియా

Saturday, August 27, 2016

తప్పేం కాదోయ్

అడపా దడపా అల్లరి చేయుట తప్పేం కాదోయ్
నీలో బాలుని బయటికి లాగుట తప్పేం కాదోయ్    

దైవం కన్నులు ఇచ్చినదెందుకు చూచుటకేగా 
అందం చూసీ లొట్టలు వేయుట తప్పేం కాదోయ్  

నిత్యం సైనిక పాలన అంటే కష్టం కాదా
నియమం సంకెల నిలువున తెంచుట తప్పేం కాదోయ్ 

పెద్దలు మాత్రం పిల్లలు కారా సరదాకైనా
పుల్లల ఐసును ఫుల్లుగ చీకుట తప్పేం కాదోయ్

సినిమాకెడితే చేతులు ముడుచుకు కూచుంటారా
ఐటెం సాంగుకు ఈలలు కొట్టుట తప్పేం కాదోయ్ 

బోడిగ గుండును చూస్తూ ఊరికె వదిలెయగలమా 
టోపీ లాగీ ఒక్కటి మొట్టుట తప్పేం కాదోయ్ 

నిజాలు పలికిన రాజుకి దక్కెను స్మశాన వాటిక
అవసరానికో అబధ్ధమాడుట తప్పేం కాదోయ్

Thursday, August 11, 2016

సులువుకదా!

ఆనులైను సదుపాయం తెలుసుకుంటె సులువుకదా 
పెళ్ళిళ్ళకు టెక్నాలజి వాడుకుంటె సులువుకదా

పెళ్ళికొరకు పేరయ్యల వెంటపడగ పనేలేదు   
మ్యాట్రిమొనీ సైటులనే నమ్ముకుంటె సులువుకదా

మిఠాయిలూ బూందీలతొ పెళ్ళిచూపులెందులకూ
స్కైపులోన ఇద్దరినీ చూపుకుంటె సులువుకదా 

ఇంటింటికి తిరుగుకుంటు పెళ్ళిపిలుపు పిలువనేల
వాట్సప్పులొ ఫొటోపెట్టి పిలుచుకుంటె సులువుకదా 

బోలెడంత డబ్బుపెట్టి బంధువులను పిలవాలా
వెబ్బుక్యాస్ట్ చేసి పెళ్ళి చూపుతుంటె సులువుకదా 

పెళ్ళిఫొటోల్దాచుకొనగ ఆల్బమ్ములు అవసరమా  
గూగులమ్మ డ్రైవులోన దాచుకుంటె సులువుకదా

హనీమూనుకెళ్ళేందుకు గాభరాలు పడనేలా
ప్యాకేజీ వెతుక్కునీ జారుకుంటె సులువుకదా  

Tuesday, August 9, 2016

ఉంటుంది

ఎదుట నిలిచి నవ్వుతుంటె అమ్మలాగ ఉంటుంది
చీర కట్టుకున్న బాపు బొమ్మలాగ ఉంటుంది

ఆ అందం ఆ రూపం ఏమంటూ పొగడాలి
కాళిదాసు కవితలున్న కమ్మలాగ ఉంటుంది

నూలు చీర పట్టు చీర ఏదైనా ఏముంది
విరబూసిన మల్లెపూల కొమ్మలాగ ఉంటుంది

సిగ్గులతో నునుపెక్కిన చెక్కిలిదే సోయగము
మంచు పడ్డ గులాబీల రెమ్మలాగ ఉంటుంది

సౌందర్యం చిరునామా ఈడూరికి దొరికింది
సొగసులో అప్సరల జేజమ్మలాగ ఉంటుంది

Thursday, July 21, 2016

ఎంత బాగ ఉంటుందీ

నెల మొత్తం వెన్నెలుంటె ఎంత బాగ ఉంటుందీ 
నేలంతా పచ్చగుంటె ఎంత బాగ ఉంటుందీ

గతుకులతో గోతులతో పయనమెటుల సాగాలీ
దారంతా పూలుంటే ఎంతబాగ ఉంటుందీ

పొలాలెండి గూడు చెదిరి రైతు రాజుల అవస్థలు 
చెరువుల్లో నీరుంటే ఎంతబాగ ఉంటుందీ

సమయానికి కురవనట్టి వర్షంతో లాభమేమి
ప్రతిరోజూ చినుకుంటే ఎంతబాగ ఉంటుందీ

కువకువలే లేకుండా తెల్లారితె ఏముందీ
చెట్టంతా పిట్టలుంటె ఎంతబాగ ఉంటుందీ

లక్షలనూ కోట్లనూ అడిగామా ఏమైనా
ఏ కష్టం రాకుంటే ఎంతబాగ ఉంటుందీ

మూగజీవినాదరించు మనసులేవి ఈడూరీ
ప్రతి జీవీ నవ్వుతుంటె ఎంత బాగ ఉంటుందీ

Thursday, June 2, 2016

నవ్విందీ

రాములోరు గుర్తొచ్చిన సీతలాగ నవ్విందీ 
నల్లనయ్య రూపుగన్న రాధలాగ నవ్విందీ 

పసితనాలు చిందించే అందమైన మోముతనది
చనుబాలను చవిచూసిన పాపలాగ నవ్విందీ

తిమిరాలను తరిమేసే చక్కనైన చూపుతనది
చీకటేల నింగిలోని చుక్కలాగ నవ్విందీ

నవ్వుతుంటె రతనాలే రాలినట్టు ఉంటుందీ   
జారుతున్న జలపాతపు హోరులాగ నవ్విందీ 

సందుజూసి సరసమాడ బోతుంటే జారుకునీ
పెద్దపులిని ఓడించిన జింకలాగ నవ్విందీ 

మనసుపడీ గెలుచుకున్న సఖునిజూసి నాచెలియే 
తనబిడ్డను చూసి మురియు తల్లిలాగ నవ్విందీ  

గమ్మత్తుగ మత్తులోకి లాగుతోంది ఈడూరిని 
శృంగారపు మరులు గొన్న రంభలాగ నవ్విందీ

నీ నవ్వులొ

మంచులోన తడిసినట్టి మల్లెపూవు కనబడింది నీ నవ్వులొ 
పైరగాలి పాడినట్టి రాగమేదొ వినబడింది నీ నవ్వులొ

పున్నమిలో చంద్రికలా నేలమీద విరబూసెను దరహాసము
ఓర్వలేని చందమామ అదేపనిగ తడబడింది నీ నవ్వులొ

బాపుగారు మనసుపడీ గీసుకున్న బొమ్మవేమొ అనుకున్నా 
కుంచెజారి వయ్యారం ఆందంగా అగుపడింది నీనవ్వులొ

పురివిప్పిన నెమలిలాగ సొంపులనే పరుచుకున్న పలువరుసలు 
నెమలినాట్యమందమనే వాదనకే తెరపడింది నీ నవ్వులొ

ఎందుకిలా కరుణించెనొ బాణమేసి మన్మధుడే ఈడూరిని 
ఈజన్మకి నామనసే మురిపెంగా ముడిపడింది నీ నవ్వులొ

Friday, April 29, 2016

నీ యాదిలొ

మల్లెపూల సువాసనే తొలుకుతుంది నీ యాదిలొ   
మరపురాని ఆనందమె తొణుకుతుంది నీ యాదిలొ  

నరనరాన నీరూపము చిత్రించుకు కూచున్నా 
నా రూపము తిరిగినాకు దొరుకుతుంది నీ యాదిలొ
  
కడదాకా వుండేదీ ఏమున్నది ఈ భువిలో    
అంతులేని అనుభూతే మిగులుతుంది నీ యాదిలొ 

మరపురాని బాధకన్న మధురమేమి లేదేమో 
నా మనసే తేనియలను చిలుకుతుంది నీ యాదిలొ  

ఇష్టమైన వారిచెలిమి తీపి గదా అనునిత్యం
తల్లి మమత మధురోహే కలుగుతుంది నీ యాదిలొ 

చిలిపి వలపు సయ్యాటలు నింపుకున్న మన తలపులు  
నా బాల్యం అడుగడుగున తగులుతుంది నీ యాదిలొ 

ఈడూరికి చెలియ చెరను విడవడమే తెలియదులే 
ఈ తనువే ఒకనాటికి వొరుగుతుంది నీ యాదిలొ

Friday, April 1, 2016

అడగాలని ఉంది

నువ్వెందుకు వచ్చావో అడగాలని ఉంది 
నన్నెందుకు మెచ్చావో అడగాలని ఉంది

మోడుబారి అణగారిన ఈ జీవితానికి
విరులెందుకు తెచ్చావో అడగాలని ఉంది

కన్నీటికి కరువైన తరుణంలో చల్లని
సుఖమెందుకు ఇచ్చావో అడగాలని ఉంది

తీరా నిను చేరుకున్న ఈ చక్కని క్షణం 
సూదెందుకు గుచ్చావో అడగాలని ఉంది

మూగబోయి మసిబారిన గుండెకదా నాది
దాన్నెందుకు గిచ్చావో అడగాలని ఉంది

Friday, February 19, 2016

మంచులో మాణిక్యం

దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తూ 35 అడుగుల లోతులో మంచులో కూరుకుపోయినా ఆరురోజులు మృత్యువుని ఎదిరించి మరో మూడు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి నేలకొరిగిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు నివాళిగా....
మంచులో మాణిక్యమై నువ్వు దొరికినప్పుడు
భరతమాత మళ్ళీ పురుడుపోసుకున్న బాలింతయింది 
ఒక మహా ఇల్లాలు నిన్ను తొమ్మిది నెలలు మోసి ఉండొచ్చు
కానీ ఈ గడ్డ నిన్ను ఆరురోజులు తన కడుపులో దాచుకుంది
నువ్వు ఆ ఆనందాన్ని మూణ్ణాళ్ళ ముచ్చటే చేశావు

అవునులే, శత్రువు గుండెలోనే నిద్ర పోగల నీకు
తల్లి పొత్తిళ్ళలో నిద్రించడం కష్టం కాదేమో
పాలూ కూరగాయలే కాదు మా ప్రార్ధనలు కూడా
కల్తీలేనేమో అందుకే నిన్ను కాపాడుకోలేకపోయాం

చావు పుట్టుకలు ఇక్కడేమీ కొత్త కాదు కానీ
నీలాంటి వీరుడు నేలకొరిగినప్పుడే....
భూమాత ఆనందంగా హత్తుకుంటుంది
ఆకాశం దీనంగా రోదిస్తుంది

ఉగ్రవాదులని ఉరితీస్తే ఏడ్చినంతగా మా జనాలు
నీ కోసం ఏడ్వకపోవచ్చు, కానీ నీ కోసం కొన్ని 
కోట్ల గుండెలు మూగగా రోదిస్తాయి, ఆ గుండెల్లో
నువ్వెప్పుడూ బతికే ఉంటావు......వీరుడా ఇక శెలవ్!!!

మన కర్నూల్ జిల్లాకు చెందిన ముస్తాక్ అహ్మద్ మృతదేహం కూడా ఈరోజు లభించింది, అతను కూడా ఇలా సజీవంగా దొరుకుతాడేమో అన్న ఆశని వమ్ము చేస్తూ. ఆ దుర్ఘటనలో అసువులు బాసిన మన వీర జవాన్లందరికీ నా నివాళి

Sunday, January 3, 2016

ఎంత హాయి!!

 పున్నమిలో బ్రతుకంతా గడిపేస్తే ఎంత హాయి
వెన్నెల్లో ఊరంతా తిరిగొస్తే ఎంత హాయి  

ఆ చెరువులు, ఈ చెట్లూ మన ఊరికి మైలురాళ్ళు   
పచ్చదనపు తివాచీలు పరిచేస్తే ఎంత హాయి 

మారేడుగ మారిపోయి మా రేడుని కొలవాలీ 
తనువంతా శివపూజకు అర్పిస్తే ఎంత హాయి 

సృష్టిలోని ప్రతి పత్రం దైవానికి సమ్మతమే 
ఆకులతో ఆ దేవుని అర్చిస్తే ఎంత హాయి  

ఉత్సవాలు జాతరలూ అందరినీ కలపాలీ    
పండుగలకి ఊరంతా కలిసొస్తే ఎంత హాయి 

పక్కవాణ్ణి ద్వేషించుట మానేసీ మనమంతా
దుర్గుణాలు దూరంగా విసిరేస్తే ఎంత హాయి 

మనిషిలోనె ఉన్నాడుగ అనాదిగా మాధవుడూ 
ప్రతివాడూ ఈవిషయం గుర్తిస్తే ఎంత హాయి   

కల్తీలకు బలైపోయె మనబతుకులు అనునిత్యం 
స్వచ్చమైన ఆరోజులు మళ్ళొస్తే ఎంత హాయి  
  
పల్లెటూళ్ళ అందమేది పట్నంలో ఈడూరీ 
ఆ సొగసులు ఇటుకూడా రప్పిస్తే ఎంత హాయి