Tuesday, December 10, 2013

ఢిల్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ, ఆం అద్మీ పార్టీలు ప్రతిపక్షంలో కూచుంటామంటూ ప్రకటించడంతో నెలకొన్న అనిస్చిత పరిస్థితిపై నా స్పందన

ఢిల్లీలో ఆం ఆద్మీ 
చీపురెట్టి ఊడ్చినా
కాంగిరేసుకి బుద్ధి రాదు
ఎంతసేపు ఏడ్చినా 

చేవలేని రాహులే
దేవుడంట వీళ్ళకి
డెమోక్రసీ ఇంజను
నడుస్తుందా నీళ్ళకి? 

ప్రతిపక్షం మాదంటూ
బిగుసుకున్న కేజ్రీవాలు
ఇంతలోనే చదివాడా
ఉద్ధండుల అనుభవాలు

అందుకుంటె తప్పేంటట 
కాంగిరేసు హస్తం 
అధికారం మీ చేతికిచ్చి 
అసలు రంగు మేం చూస్తాం  

చేతులు కట్టుకు కూచున్నారు
ఎందుకో బీజేపీ బేరగాళ్ళు 
లేదంటే దొరక్కపోరు 
ఒకరిద్దరు మాయగాళ్ళు 

మళ్ళీ ఎన్నికలొస్తే 
ప్రజలకేగా నష్టం
ఎన్నాళ్ళకు తీరుతుందో 
దేశానికి అరిష్టం 

Friday, November 22, 2013

కొడుకు



తండ్రి తనమీద పెట్టుకున్న
ఆశల్ని నిట్టనిలువునా
తుంచేసినవాడు
అవే ఆశలని తన
కొడుకు మీద పెంచుకుంటాడు 
ఆశల సౌధం నిర్మించుకుంటాడు
తన కొడుక్కి తన పోలిక రాదని
వాడికంత గట్టి నమ్మకమేమిటో!!!!!!!!!!

Friday, September 20, 2013

ఏమైపోయాయి మిత్రమా!!!


ఆ బుడిబుడి నడకలూ
బలపాలూ, పలకలూ
వానల్లో పడవలూ
వాగుల్లో ఈతలూ
ఏమైపోయాయి మిత్రమా

హోంవర్కు ఎగవేతలూ
మార్కుల్లో కోతలూ
నాన్నారి కోపాలూ
అనారోగ్యం నెపాలూ
ఏమైపోయాయి మిత్రమా

ఆ తుంటరి యాత్రలూ
ఆ వెన్నెల రాత్రులూ
కలిసి తాగిన బీర్లూ
తాగి తిరిగిన బజార్లూ
ఏమైపోయాయి మిత్రమా

ఆ ఫుట్ బోర్డింగ్ ఫీట్లూ
అమ్మాయిలకేసిన బీట్లూ
వారి అన్నలు కొట్టిన షాట్లూ
మనకు డాక్టర్లు కట్టిన కట్లూ
ఏమైపోయాయి మిత్రమా

అంతలో అయిపొయింది పెళ్ళీ
ఆనాటి రోజులోస్తాయా మళ్ళీ
పుట్టిళ్ళకి వెళ్ళిన పెళ్ళాలు
మనచేతికి దొరికిన కళ్ళాలు
ఏమైపోయాయి మిత్రమా

అబ్బాయిప్పుడు కాలేజీ
అమ్మాయికి త్వరలో మ్యారేజీ
ఆ సరదాలకు ఇక తావేదీ

భావసాగారమేలా ఈదేదీ????

నగరానికి వరదొచ్చింది

ఆ నగరం చుట్టూ గోదారి లేదు
క్రిష్ణమ్మా లేదు
నగరానికి ఓ పక్క సముద్రమూ లేదు
అయినా ఆ నగరానికి వరదొచ్చింది
కనిపించిన నేలంతా కాంక్రీటుగా మారుస్తుంటే
ఇంకలేని నీరేమో ప్రతి ఇంటినీ ముంచేసింది
పేదవాని స్వేదంలా వరదలై పారుతోంది 
నాగరీకుడా గుర్తించావా నీ ప్రాణం పోకడ

ఇకనైనా మట్టిని సిమెంటుగా మార్చడం మానెయ్యి

Sunday, July 14, 2013

"చౌద్వీ కా చాంద్ హో" పాటకి నేను రాసిన పేరడీ

ఫెసుబుక్కు షేరువో లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో

ఏ గ్రూపులోన నీవు తారాడుచుందువో
మెంబెర్స్ లేక అది అల్లాడుచుండునే
అలరించు గ్రూపులన్నీ అంతమై పోవునే
ఫెసుబుక్కు షేరువో

నీ ఫోటోలోన అందం అమావాస్య చంద్రమే
నీ జోకులోన హాస్యం నేతి బీరకాయనే
మేస్సేజు పెట్టి మరీ నువ్ చంపుతున్దువే
ఫెసుబుక్కు షేరువో

లేదేల జాలి తల్లీ ఈ బాదుడేలనే
రాబోవు తరాలకైనా  నీ పీడ తొలగునా
ఏకంగా ఫెసుబుక్కునే మూయిన్చమందువో

ఫెసుబుక్కు షేరువో లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ కామెంటే లేదు నీకు

ఫెసుబుక్కు షేరువో

Wednesday, June 12, 2013

పుడమి తల్లి

ఒక చోట 
వాన కురిసింది
పుడమి తల్లి
ఒక మొక్కకి ఊపిరి పోసింది

ఇంకో చోట 
ప్రేమ కురిసింది
మరో తల్లి
ఓ బిడ్డకి ప్రాణం పోసింది!!!!

Tuesday, June 11, 2013

వానలు

ఒక వాన 
బోసిగా నవ్వుతుంది
చంటిపిల్లాడిలా

ఒక వాన
ఇలా వచ్చి అలా మాయమౌతుంది
నెలసరి జీతంలా....

ఒక వాన
రోజంతా కురుస్తూనె ఉంటుంది
టీవీ సీరియల్లా........

ఒక వాన
తడిపి ముద్దచేస్తుంది
తల్లి ప్రేమలా.......

ఒక వాన
వెచ్చని ఊహల్నిస్తుంది 
కొత్త పెళ్ళికూతుర్లా 

ఒక వాన
భళ్ళున కురుస్తుంది
చెలి భావోద్వేగంలా 

ఒక వాన
పోటెత్తుతుంది
రగిలిన సామాన్యుని గుండెలా

ఒక వాన
ఉప్పెనై వెంటాడుతుంది
ప్రళయకాల రుద్రునిలా......

Saturday, May 18, 2013

వంటలక్క


ఆయనకేం, అదృష్టవంతుడు!!
ఏమీ తెలియకుండా వెళ్ళిపోయాడు
మద్యం మత్తులో వొళ్ళు తూలి
లారీ కింద నలిగి కన్ను మూశాడు

ముక్కుపచ్చలారని
ముగ్గురుపిల్లల భారం మోసేందుకు
నేను వంటలక్క
అవతారం ఎత్తాను

నా పిల్లల్ని గాలికి వదిలేసి
జనాలకి విందు భోజనం
వండిపెట్టేదాన్ని
పెద్దాడికి ఇష్టమైన కూర
చిన్నాడికి నచ్చిన పచ్చడి
చంటిది ఇష్టంగా తినే పులుసు
వేరెవరో తింటుంటే,
నా బిడ్డలు ఏమి తింటున్నారో
ఎలా ఉన్నారో అని గుడ్ల నీరు
కుక్కుకునేదాన్ని

అందరికీ అన్నీ వండిపెట్టి
ఆదరా బాదరా ఇంటికి చేరి
ఆకలికి అలిసిపోయి పడుకున్న
నా పిల్లలని చూసి భోరున ఏడ్చేదాన్ని

కట్టుకున్నవాడు కనుమరుగైపోయినా
విధి కాలనాగై కాటువేసినా
చంటిపిల్లల పోషణ భారం
మీద వేసుకున్న
నన్ను కనికరించక
సూటిపోటి మాటలతో
శూలాలు గుచ్చేది సమాజం  

పిల్లల్ని బాగా చదివించినా
మంచి సంబంధాలు చూసి
పెళ్ళిళ్ళు చేసినా
నా అస్తిత్వం
నిలుపుకోడం కోసం
ఇప్పటికీ నేను
వంటలక్కనే..........

Sunday, May 12, 2013

అమ్మ - కవి


అమ్మ వంట చేసింది
ఉత్సాహంగా భోజనానికి 
సిధ్ధం చేసింది
కుటుంబంలో ఎవరెవరు
ఎంతెంత తింటారో
ఏమేమి అంటారో అనే కుతూహలంతో

కవిగారు మరో కవిత రాశారు
ఉత్సాహంగా (వీలైనన్ని) గ్రూప్సులో 
పోస్ట్ చేశారు 
ఎవరెవరు లైక్ కోడతారో
ఎవరు కామెంట్ పెడతారో అనే
కుతూహలంతో  

Wednesday, May 1, 2013

వచ్చింది (ఘజల్)


ఆమె నవ్వులో ఏడురంగుల చాపం వచ్చింది
ఆమె చూపుతో నా ప్రేమకు రూపం వచ్చింది 

నాతో స్నేహం నీకు సరేనా అని అడగాలనుకుంటే  
ఆమె మోములో చిరునవ్వే జవాబు వచ్చింది 

ప్రేమ కుట్టిన ప్రతివాడూ పసిపాపడు కాదా  
ఆమె రాకతో నాలో మళ్ళీ బాల్యం వచ్చింది

నాలో నాకే అన్నీ కొత్తగా అనిపిస్తుంటేనూ    
ఆమె తోడులో ఏదో తెలియని ధైర్యం వచ్చింది

ఇంక జాగేల ఈడూరీ కదలవోయ్ ముందుకి   
ఆమె చేతితో చేతిని కలిపే సమయం వచ్చింది 

Tuesday, April 30, 2013

నేనేమో ఇక్కడ


భర్త కవి అయినా కాపౌండరైనా, డ్రైవర్ అయినా డైరెక్టర్ అయినా నిరంతరం అండగా నిలిచి అనుక్షణం శ్రమించే స్త్రీమూర్తులపై నిందా స్తుతిలాంటి కవిత 


నేనేమో ఇక్కడ
స్త్రీజాతి స్వాతంత్ర్యం కోసం
కవితలల్లుతున్నాను
నువ్వేమో అక్కడ
చెంచాలు, గరిటెలతో
కుస్తీ పడుతున్నావు

నేనేమో ఇక్కడ
కనుమరుగవుతున్న
విలువల వలువలిప్పుతున్నాను
నువ్వేమో అక్కడ
బంగాళదుంప తోలు వలుస్తున్నావు

నేనేమో ఇక్కడ
రాజకీయ దగాకోర్లపై
విప్లవ శంఖం పూరిస్తున్నాను
నువ్వేమో అక్కడ
ఏమండోయ్ కాఫీ తాగారా
చల్లారిపోతుంది అంటూ
అరుస్తున్నావు

నేనేమో ఇక్కడ
ఆకాశాన్నంటిన ధరలని
భూమార్గం పట్టిస్తున్నాను
నువ్వేమో అక్కడ
కూరగాయల కోసమని
నాజేబులో ఐదువందల నోటు
నొక్కేస్తున్నావు

నేనేమో ఇక్కడ
సినిమాల్లో మితిమీరిన శృంగారాన్ని
చెడుగుడు ఆడేస్తున్నాను
నువ్వేమో అక్కడ
తలుపు సందుల్లోంచి నాపైకి
వలపు బాణాలను
సంధిస్తున్నావు

ఎవరన్నారు ప్రతి మగవాడి
విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని?
నాకైతే అర్ధం కావట్లేదు!!

Friday, April 26, 2013

అతడు


అతడు ఆరడుగుల అందగాడు
తెల్లగా ఐస్ క్రీం పుల్లలా ఉంటాడు
అందంగా నవ్వుతాడు
అన్నింటా ముందుంటాడు

అతడు కంటిచూపుతో చంపేస్తాడు
అతని రక్తంలో భయంలేదు
అతను గుద్దితే రాళ్ళు పగులుతాయి 
అతడు అన్యాయాన్ని సహించడు 

న్యాయం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు
ధర్మాన్ని ఎప్పుడైనా రక్షిస్తాడు 
పేదలకు అండగా నిలబడతాడు 
పెన్నిధిని ఏనాడూ ఆశించడు  

కానీ ఇదంతా తెరమీదే 
నిజజీవితంలో అతడు 
మందుని మార్కెట్ చేస్తాడు 
చెరువుని ఆక్యుపై చేస్తాడు 
డబ్బుకోసం పార్టీ అమ్మేస్తాడు 
గూండాలతో జనాన్ని కొట్టిస్తాడు 

మీరు ఊహించింది నిజమే
అతడు మన తెలుగు సినిమా హీరో 

Wednesday, April 10, 2013

ఎక్కడ వెదకను ఉగాదిని?


ఆరు రుచుల్లోనా
బారు బిల్లుల్లోనా
మారు మూలల్లోనా
కారు మబ్బుల్లొనా
ఎక్కడ వెదకను ఉగాదిని?

మామిడి కాయలోనా
వేప పూతలోనా
చెరుకు గడల్లొనా
బెల్లం తీపిలోనా
ఎక్కడ వెదకను ఉగాదిని?

పసి నవ్వుల్లోనా
మసి చేతుల్లోనా
కసి చూపుల్లోనా
నిసి రాతిరిలోనా
ఎక్కడ వెదకను ఉగాదిని?

ఆధార్ కార్డుల్లోనా
వ్యదార్ధ గాధల్లోనా
పేదోడి బాధల్లోనా
రూపాయి బియ్యంలోనా 
ఎక్కడ వెదకను ఉగాదిని?

మబ్బు తునకల్లోనా
గబ్బు చేతుల్లోనా
డబ్బు సంచుల్లోనా
క్లబ్బు గంతుల్లోనా
ఎక్కడ వెదకను ఉగాదిని

సుడి గాలుల్లోనా
నది పాయల్లోనా
తడి కళ్ళల్లోనా
మది లోతుల్లోనా 
ఎక్కడ వెదకను ఉగాదిని

నల్ల బజారులోనా
తెల్ల కార్డుల్లోనా
కల్లు కాంపౌండ్లోనా
మల్లె పూలల్లోనా
ఎక్కడ వెదకను ఉగాదిని

పసి బాల్యంలోనూ
బోసి నవ్వుల్లోనూ
తల్లి మాటల్లోనూ
కొత్త పుంతల్లోనూ
వెదికి చూడు ఉగాదినీ
వేసుకో ఆశల పునాదినీ

బోనస్


మా నాయనను నలుగురు మోసుకోస్తుంటే
ఏదైనా ఆటల గెలిచిండు అనుకున్న
కానీ సచ్చి పోయిండంట
మా నాయన పొద్దుగాల చాలా అందంగ ఉండెటోడు
మాపటికి ఏమయ్యేదో ఏమో నల్లగ మారెటోడు
చూస్తేనే భయమేసేటిది
రా కొడకా అంటె పొయ్యెటోన్ని గాదు
వేడినీళ్ళతోని స్నానం చేసి ఎత్తుకునేటోడు

నాయిన బొగ్గు బాయిల పంజేస్తడు కొడకా
డూటికి పోతే అట్ల నల్లగైతడు అని అమ్మ జెప్పేడిది
అంతెగాదు మా నాయన రాత్రంత దగ్గెటోడు
మాయదారి బొగ్గు నా పెనిమిటి పానం దీస్తుంది
అనుకుంట అమ్మ ఏడ్సుడు నేను జూసిన చాన సార్లు

ఏమైనా మా నాయన చాన మంచోడు
జీతాలు పడినంక సైన్మకు తీస్కబోయెటోడు
సింగరేని తల్లి దయ అనెటోడు
పండ్గకు కొత్త బట్టలు కొంటవా
అని నాయిన నడిగితె బోనస్లు పడనియ్ బేటా అన్నడు
ఇంతలోకే ఏమైందో ఏమో
మా నాయన సచ్చి పోయిండు
31/3/13

Monday, March 11, 2013

కవిత్వం


నెమలి ఆడినప్పుడో
వరద ముంచినప్పుడో

అమ్మ నవ్వినప్పుడో
నాన్న తిట్టినప్పుడో 

పరీక్ష పాసైనప్పుడో
ప్రేయసి దూరమైనప్పుడో 

ఎద పులకించినప్పుడో
దారుణం తిలకించినప్పుడో

మనసు బాగున్నపుడో
బతుకు బరువైనప్పుడొ 

అప్పుడు రాయాలి కవిత్వం
ఎప్పుడు  పడితే అప్పుడు కాదు 

Monday, February 18, 2013

చెట్టు


నేనొక చిన్న మొక్కని చూశాను
తూఫానులో అది రెపరెపలాడటం చూశాను
నీటి కోసం ఎండలో అదిపడే తపన చూశాను 
వానల్లో దాని ఒంటి పులకింత చూశాను 
అలా అలా అది పెద్దదవటం చూశాను

రెమ్మలుగా కొమ్మలుగా ఎదిగి ఆ చెట్టు మహావృక్షమయింది    
బొమ్మలుగా దిమ్మలుగా ఎందరికో ఉపయోగపడింది   
ఎందరికో తోడయింది, మరెందరికో నీడయింది 
ఆ  చెట్టుని నమ్ముకుని మరెన్నో మొక్కలు మొలిచాయి
నెమ్మదిగా అవికూడా చెట్లుగా ఎదిగాయి 

ఎన్నో వసంతాలు వచ్చాయి, ఎన్నో శిశిరాలు వెళ్ళాయి
చెట్టులో మునుపటి పచ్చదనం లేదు, పటుత్వమూ లేదు 
ఇప్పుడు దానికి నీరు కావాలి, నీరందించే చెయ్యి కావాలి 
తనపంచన పెరిగిన చెట్లన్నీ తమ మొక్కల్ని చూసుకుంటున్నాయి  
మాటిమాటికీ అడ్డు అని చెట్టుని తిట్టుకుంటున్నాయి 

తన చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లూ ఉన్నా అది ఇప్పుడు ఒంటరి 
ఏ చల్లగాలీ దానితో నాట్యమాడించలేదు
ఏ తూఫానూ దాన్ని కూకటి వేళ్ళతో పెకలించలేదు  
ఐనా ఆ చెట్టు అర్భకురాలే ఎందుకంటే దాని మన్సంతా డొల్లే   
దాని చుట్టుపక్కలంతా కుళ్ళే 


ఏ మహాప్రళయమో వచ్చి తనది కాని తన సమూహం నుండి 
దూరంగా విసిరేయాలని ఆ చెట్టు కోరుకుంటోంది 
మహాశివుని మూడో కన్ను తెరుచుకుంటే ఆ చూపు తనపైనే 
పడాలని ఆశిస్తోంది, నేలకొరగడంలోని ఆనందాన్ని
ఇప్పుడది తీవ్రంగా వెదుక్కుంటొంది

Wednesday, January 30, 2013

గాంధీతాతకి నివాళి


ఉక్కుమనసు నీకుంటే
ఉద్యమించు సోదరా
కత్తులతో సుత్తులతో
నీలక్ష్యం చేరవురా
గాంధీలా పోరు సల్పు
గాడ్సేలా కాదురా

ఆయుధాలు పట్టినోళ్ళు
అతీగతీ లేకపాయె
బక్కపలుచ గాంధితాత
జాతిపితగ ఎదిగిపోయె 
గుండెదమ్ములున్నోళ్ళే
నాయకులౌతారురా
ఎనకుండి నడిపించే
ఎర్రెధవలు కాదురా!!!!  

Saturday, January 12, 2013

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో......


వాడవాడలా భోగిమంటలు
గాదెలలోన కొత్త పంటలు
ముగ్గులేసే ముద్దుగుమ్మలు
నక్కిచూసే కోతిమూకలు
ఇంటిముంగిట రంగవల్లులు
వాటి మధ్యలో గొబ్బిళ్ళు
నులివెచ్చని కిరణాలు 
మామిడాకు తోరణాలు
హరిదాసు కీర్తనలు
బసవన్నల నర్తనలు
ఎగిరే గాలిపటాలు 
అందుకునే ఆరాటాలు 
అందరికీ కొత్తబట్టలు 
ఇంటింటా పిండివంటలు
ఈ సంక్రాంతి సంబరాలు
తాకాలి అంబరాలు

Thursday, January 10, 2013

బస్సు – మిస్సు


అనగనగా ఒక ఊరిలో చిత్రమొకటి జరిగెను 
ఆడవారు ఎక్కినట్టి బస్సు నీట మునిగెను 
భార్యామణుల ప్రాణాలు గాలిలోన కలిసెను 
భర్తలందరూ భోరుమంటు ఏడ్చెను
కొద్ది రోజుల దాకా అందరేడ్చుచుండెను
ఒకడు మాత్రం తన ఏడుపాపకుండెను 
వాడి బాధ చూసి జాలిపడిరి ఊరివారు
వాని చుట్టుచేరి ఓదార్చుచుండెవారు 
ఊరుకోవయ్య మగడ ఆపు నీ ఏడుపు
ఎంతకాలమిట్లు ఏడ్చుచుందువు చెప్పు 
భార్యపోయినందుకు బాధ నీది తెలుసు
అంతలోనె వాడు ఒక్క ఉదుట అనెను బుస్సు
అయ్యలార నా భార్య ఎక్కలెదు ఆ బస్సు
అందుకనే నా ఏడుపు మీకు ఏమి తెలుసు
నా భార్య ఎక్కకముందె సాగిపోయె ఆ బస్సు
అందుకనే నా ఏడుపు నా ఈ కస్సుబుస్సు

Monday, January 7, 2013

చాలు నాకు (Ghazal)


దినమంతా నీనామం జపిస్తే చాలు నాకు 
బతుకంతా నీతోనే గడిస్తే చాలు నాకు   

వీఐపీని కానుగా పాసులు పట్టుకురాలేను    
అరక్షణం కనులారా దర్శిస్తే చాలు నాకు  

పొట్టలేవీ కొట్టలేదు,కిరీటాలు చేయించలేను  
నీ పాదాలకు పూలను అర్పిస్తే చాలు నాకు    

భూదందా రాదుగా, గుడులను కట్టించలేను  
గుండెగుడి లోనిన్ను స్మరిస్తే చాలు నాకు  

ఈడూరిని నేను, మరోలా నటించలేను    
ఘడియైనా నీకరుణ కురిస్తే చాలు నాకు