Monday, June 29, 2015

నాకోసం

ఒక అందం నాకోసం నడచి వచ్చింది
తనువంతా పానుపుగా పరచి వచ్చింది 

గత జన్మల పుణ్యాలే నన్ను వరించే 
ఆ దేవత చిరునామా మరచి వచ్చింది 

ప్రేమంటే ఎపుడైనా జనులకి లోకువ 
ఈ సమాజ సంకెళ్ళను విరిచి వచ్చింది

నాకేమిటి పొమ్మంటూ ఎదురు పోరాడి 
ఎద గదులను విపులంగా తెరిచి వచ్చింది 

చెలి కన్నుల కదలాడిన మలయ సమీరం  
ఈడూరీ నీ వలపుకి సురుచి వచ్చింది

Wednesday, June 24, 2015

రాజకీయం

నోట్లతోటి వోటర్లను కొంటున్నది రాజకీయం 
మాటలతో కోటలనే కడుతున్నది రాజకీయం 

దగాకోరు నాయాళ్ళను గెలిపించీ ఎన్నికలలో    
పక్కలోన బల్లెములు గుచ్చుతున్నది రాజకీయం

మనమంతా తెలుగేలే అంటూనే సెగలుపెడుతూ         
ఇంటిలోన చిచ్చులను రేపుతున్నది రాజకీయం

మతాలనే పావులుగా వదులుతుంది జనాలపైకి 
మానవతా విలువలను మాపుతున్నది రాజకీయం  

ఈడూరీ మేలుకోక తప్పదుగా ఇప్పుడైనా
భవితపైన ఆశలను చంపుతున్నది రాజకీయం