Saturday, May 18, 2013

వంటలక్క


ఆయనకేం, అదృష్టవంతుడు!!
ఏమీ తెలియకుండా వెళ్ళిపోయాడు
మద్యం మత్తులో వొళ్ళు తూలి
లారీ కింద నలిగి కన్ను మూశాడు

ముక్కుపచ్చలారని
ముగ్గురుపిల్లల భారం మోసేందుకు
నేను వంటలక్క
అవతారం ఎత్తాను

నా పిల్లల్ని గాలికి వదిలేసి
జనాలకి విందు భోజనం
వండిపెట్టేదాన్ని
పెద్దాడికి ఇష్టమైన కూర
చిన్నాడికి నచ్చిన పచ్చడి
చంటిది ఇష్టంగా తినే పులుసు
వేరెవరో తింటుంటే,
నా బిడ్డలు ఏమి తింటున్నారో
ఎలా ఉన్నారో అని గుడ్ల నీరు
కుక్కుకునేదాన్ని

అందరికీ అన్నీ వండిపెట్టి
ఆదరా బాదరా ఇంటికి చేరి
ఆకలికి అలిసిపోయి పడుకున్న
నా పిల్లలని చూసి భోరున ఏడ్చేదాన్ని

కట్టుకున్నవాడు కనుమరుగైపోయినా
విధి కాలనాగై కాటువేసినా
చంటిపిల్లల పోషణ భారం
మీద వేసుకున్న
నన్ను కనికరించక
సూటిపోటి మాటలతో
శూలాలు గుచ్చేది సమాజం  

పిల్లల్ని బాగా చదివించినా
మంచి సంబంధాలు చూసి
పెళ్ళిళ్ళు చేసినా
నా అస్తిత్వం
నిలుపుకోడం కోసం
ఇప్పటికీ నేను
వంటలక్కనే..........

Sunday, May 12, 2013

అమ్మ - కవి


అమ్మ వంట చేసింది
ఉత్సాహంగా భోజనానికి 
సిధ్ధం చేసింది
కుటుంబంలో ఎవరెవరు
ఎంతెంత తింటారో
ఏమేమి అంటారో అనే కుతూహలంతో

కవిగారు మరో కవిత రాశారు
ఉత్సాహంగా (వీలైనన్ని) గ్రూప్సులో 
పోస్ట్ చేశారు 
ఎవరెవరు లైక్ కోడతారో
ఎవరు కామెంట్ పెడతారో అనే
కుతూహలంతో  

Wednesday, May 1, 2013

వచ్చింది (ఘజల్)


ఆమె నవ్వులో ఏడురంగుల చాపం వచ్చింది
ఆమె చూపుతో నా ప్రేమకు రూపం వచ్చింది 

నాతో స్నేహం నీకు సరేనా అని అడగాలనుకుంటే  
ఆమె మోములో చిరునవ్వే జవాబు వచ్చింది 

ప్రేమ కుట్టిన ప్రతివాడూ పసిపాపడు కాదా  
ఆమె రాకతో నాలో మళ్ళీ బాల్యం వచ్చింది

నాలో నాకే అన్నీ కొత్తగా అనిపిస్తుంటేనూ    
ఆమె తోడులో ఏదో తెలియని ధైర్యం వచ్చింది

ఇంక జాగేల ఈడూరీ కదలవోయ్ ముందుకి   
ఆమె చేతితో చేతిని కలిపే సమయం వచ్చింది