Wednesday, April 10, 2019

యిపుడైనా

ఒక్కసారి మనుషులుగా మారుదాము యిపుడైనా
స్వార్ధ రహిత మంచితనం పంచుదాము యిపుడైనా


బీద బిక్కి కులం మతం అంతరాలనొదిలేసీ
బానిసత్వ సంకెళ్లను తెంచుదాము యిపుడైనా


నాకొడుకూ నాకూతురు నాపెళ్లాం అని కాదోయ్
విశ్వమంత మనదేనని చాటుదాము యిపుడైనా


ఆయుధాలు ఎన్నున్నా ఆత్మశాంతి దొరికేనా
గొంతులెత్తి స్నేహగీతి పాడుదాము యిపుడైనా


మందిరాలు, మసీదులూ చర్చిలేల ఈడూరీ
మనసుల్లో దేవుడినే నిలుపుదాము యిపుడైనా


అహంకార సెగలతోటి రగులుతోంది భూగోళం 
రోజుకొక్క పూలమొక్క నాటుదాము యిపుడైనా