Friday, May 29, 2015

నాకిష్టం

నే చేరిన గమ్యం కాదోయ్ నే చేసిన పయనం నాకిష్టం 
జనులిచ్చిన కితాబు కాదోయ్ నే రాసిన కవనం నాకిష్టం 

జగమంతా ఒక కుగ్రామము నేడు జనులంతా ఒక కుటుంబము   
నీ యిల్లొ నా యిల్లొ కాదోయ్ మనముండే భువనం నాకిష్టం 

తుది ఎపుడూ ఆరంభమే సృష్టి అంతా జీవ పరిణామమే  
కనుమూసే మరణం కాదోయ్ తిరిగొచ్చే జననం నాకిష్టం

నీ చేతి ఊతం అందిస్తే ప్రతివాడూ విజయుడే కాడా   
మది గుచ్చే మాటలు కాదోయ్ బలమిచ్చే వచనం నాకిష్టం 

ఒక నవ్వే చాలుగ అలసిన మనసంతా మల్లెలు పరిచేందుకు  
పై పూతల ముఖాలు కాదోయ్ నిండైన హసనం నాకిష్టం

అభివృద్దే నీ మంత్రం నిభద్దతే నీ అస్త్రం ఈడూరీ 
భయపెట్టే యామిని కాదోయ్ వెలుగిచ్చే కిరణం నాకిష్టం      

Monday, May 18, 2015

అంటారు

అమ్మ ఒడిని ఎవరైనా స్వర్గమనే అంటారు 
జన్మభూమినెవరైనా తల్లి అనే అంటారు
  
డబ్బున్నా లేకున్నా బాల్యం బహు పసందే 
ఆ రోజులు మరెప్పుడూ రానివనే అంటారు 

నూనూగు యవ్వనమూ ఆ నూతన పరిచయాలు   
తొలి ప్రేమను ఎవరైనా మధురమనే అంటారు 

దాన గుణం నీకుంటే సంపదతో పనేమిటి   
ఆదుకుంటె ఎవరైనా రాజువనే అంటారు 

ఒకడితో నీకెందుకు నీ మంచిని నువ్వు పంచు  
మొరుగు కుక్కలెపుడైనా కరవవనే అంటారు

తాత పేరు చెప్పుకుని మనవళ్ళ మేకప్పులా     
నేతి బీర లోన నెయ్యి ఉండదనే అంటారు 

మనసులోన సౌందర్యం నింపి చూడు ఓ చెలీ  
నిన్ను చూసి ఎవరైనా రంభవనే అంటారు

టెక్నాలజి మనిషికిపుడు ప్రాణవాయువౌతోంది 
నెట్టు లేక క్షణమైనా నరకమనే అంటారు 

పట్టు విడకు ఈడూరీ రాస్తూనే ఉండు మరి 
నేడు కాదు రేపైనా మంచివనే అంటారు  

Sunday, May 17, 2015

మారదు లోకం

భానుడే పశ్చిమాన ఉదయించినా మారదు లోకం
రాముడే మరోసారి జన్మించినా మారదు లోకం  

ట్రాఫిక్కు చిక్కులే, ఏ రోడ్డైనా శవాల గుట్టలె    
వాసుదేవుడే రధం నడిపించినా మారదు లోకం 

కాలుష్యాల కోరలలో కరడు గట్టినా హృదయాలు   
శివుడే ఈ గరళాలు కబళించినా మారదు లోకం      

నేరమూ ఘోరమూ దినచర్యలు ఈ పుణ్య భూమిలో    
బ్రహ్మ దేవుడే మరల సృష్టించినా మారదు లోకం 

చౌకబారు చదువులతో తరిగిపోయె ఘన విజ్ఞానం 
మన వేదాలను తిరగ రాయించినా మారదు లోకం 

ఈడూరికి బాగా తెలుసునండి యిది పాడు ప్రపంచం   
ముక్కోటి దేవతలూ కరుణించినా మారదు లోకం 

Tuesday, May 12, 2015

సెల్ఫీ

అపుడే పుట్టిన పాపాయికి అమ్మతో సెల్ఫీ
కొత్తగ పెళ్ళైన అమ్మాయికి అత్తతొ సెల్ఫీ  

అహరహము పదవికి వెంపర్లాటె రాజకీయం
లీడరుకి దొరకక దొరికిన కుర్చీతో సెల్ఫీ  

న్యాయ దేవతకి కళ్ళే లేవు - కాదనగలమా     
మన కండల వీరుడికేమో జడ్జీతొ సెల్ఫీ

రెండాకులు ఎక్కువే చదివిన అమ్మగారికీ  
అందాక పదవి కాపాడిన చెంచాతొ సెల్ఫీ 

చిన్ననాటి చిలిపి గుర్తులు మాసిపోతే యెలా  
అల్లరి పిల్లాడికి టీచర్ బెత్తంతొ సెల్ఫీ    
     
డబ్బుకి లోకం దాసోహమే అది నిజమేగా 
బాగా బలిసిన ఆసామికి ఆకలితొ సెల్ఫీ 

ఆసుపత్రికి అప్పుడపుడు వెడితేనే మంచిది    
రోజూ వచ్చె పేషంటు నర్సమ్మతో సెల్ఫీ 
  
ఎపుడూ చూస్తూ ఉంటె స్నేహం పెరగదా యేంటి
గజదొంగ గంగులు గాడికి పోలీసుతొ సెల్ఫీ  

మనుషులకేనా ప్రేమ, మాకు కూడా ఉందంటు 
అడవిలొ సింహానికి కుందేలు పిల్లతొ సెల్ఫీ   

తుదిదాక తపస్సు చేస్తె వచ్చేది ఏ దేవుడొ 
మధ్యలోనే ఆపిన మునికి మేనకతొ సెల్ఫీ      

పోనీ

చెలీ ఈ క్షణమిలా కాలమాగిపోనీ 
నీతోనె ఉన్న మధురోహ సాగిపోనీ

ప్రేమను చూసి ఓర్వలేని మాయ లోకం   
చెక్కిన కుటిల శాసనాలు వీగిపోనీ

మల్లెలు పూసిన వెన్నెల సాయంత్రాలూ  
నీ వలపుల మత్తులో చెలరేగిపోనీ 

యామినికేమి తెలుసు భామిని  సౌందర్యం  
శృంగార గంగలో నన్ను మునిగిపోనీ

నిన్ను మించు అందము లేనే లేదు కదా
రంభా ఊర్వశులకు గర్వమణగిపోనీ  

Wednesday, May 6, 2015

అమ్మా నా పెళ్ళెప్పుడు?

అందరూ ఆడపిల్ల వద్దనుకుని అబ్బాయిలనే కంటుంటే ముందు ముందు అమ్మాయిలు మరింత తగ్గిపోయి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాని పరిస్థితి వస్తుంది ఆ రోజుల్లో అబ్బాయిల పాట్లు ఎలా ఉంటాయో ఈ గజల్ వివరిస్తుంది, ఆ రోజులు ఆల్రెడీ వచ్చేశాయనుకోండి కానీ ఇంకాస్త చెయ్యిదాటిపోతే: 


వయసు మీద పడుతోంది అమ్మా నా పెళ్ళెప్పుడు?
మనసు ఆగనంటోంది అమ్మా నా పెళ్ళెప్పుడు?

పేరయ్యలు, పెళ్ళి సైట్లు అన్నిటిని గాలించా  
పిల్ల దొరకనంటోంది అమ్మా నా పెళ్ళెప్పుడు?

వంద పెళ్ళి చూపులూ ఎపుడో దాటేశానూ   
మ్యాచ్ కుదరకుంటోందీ అమ్మా నా పెళ్ళెప్పుడు?

నా వయసు అమ్మాయిలు ఎపుడో తల్లులయారే 
ఖర్మ కాలిపోతోంది అమ్మా నా పెళ్ళెప్పుడు?

లేనిపోని ఊహేదో మనసు దొలిచివేస్తోంది
నిప్పు రాజుకుంటోంది అమ్మా నా పెళ్ళెప్పుడు?
       
ఆడపిల్లలొద్దనుట ఈ ఖర్మకు కారణమా  
కన్ను తెరుచుకుంటోంది అమ్మా నా పెళ్ళెప్పుడు?

Tuesday, May 5, 2015

చేరుకుంటావు

కన్ను కన్ను కలపకనే జారుకుంటావు
లోలోపల నన్నే నువు కోరుకుంటావు  

చూడనట్టుగ నా ఎదుటే నడిచి వెడుతూ     
తలనుతిప్పి వెనకెనకే చూసుకుంటావు 

నక్కి నక్కీ నేనెచటో దాగి ఉంటే
మదిలోనే విరహ గీతి పాడుకుంటావు  

నే నడిచిన దారిలో ఏ మాయ ఉందో 
వంగి వంగి ఏదొ తీసి దాచుకుంటావు 

ఒక్క చూపు తగ్గినా ఆగునా కాలం  
అనుక్షణం నాకొరకే కాచుకుంటావు

వేల పున్నముల వెన్నెలే కద నీ ప్రేమ   
కాదన్నా ఈడూరిని చేరుకుంటావు 

Saturday, May 2, 2015

ప్రపంచ హాస్య దొనోత్సవ సందర్భంగా

ఇంటికి చుట్టాలొచ్చినా ఫేసు బుక్కు పోస్టే
పెళ్ళాం ఊరికి వెళ్ళినా ఫేసు బుక్కు పోస్టే  

నిజాయితి కనుమరుగైన ఈనాటి లోకములో 
ఆటోవాడు మీటరేసినా ఫేసు బుక్కు పోస్టే
  
మీటలు నొక్కితే పనులైపోతాయి మహిళలకి 
పనిమనిషి రాకపోయినా ఫేసు బుక్కు పోస్టే  

అంకెలతొ గారడీలు చేసే స్కూళ్ళకు కరువా 
పిల్లోడికి ర్యాంకొచ్చినా ఫేసు బుక్కు పోస్టే 

నచ్చిన హీరో సినిమా మొదటి ఆట చూడాలి  
హాల్లోన సీటు దొరికినా ఫేసు బుక్కు పోస్టే  

శతృవులకి ఏమి జరిగినా ఆనందమే కదా   
అత్తగారు జారిపడినా ఫేసు బుక్కు పోస్టే     

తొలి సంతానం కోతికి కొబ్బరి కాయ లాటిది 
చంటి బిడ్డ బట్ట తడిపినా ఫేసు బుక్కు పోస్టే  

ఈడూరీ ఇదెక్కడి మాయలోకమో చూడర 
ఎంత చెత్త కవిత రాసినా ఫేసు బుక్కు పోస్టే  

నేటి స్కూళ్ళు

బెత్తముతో బాదుతాయి చిన్న పిల్లలను నేటి స్కూళ్ళు 
విత్తముతో బాదుతాయి తల్లి తండ్రులను నేటి స్కూళ్ళు  

తల్లి ఒడిలొ నేర్చుకున్న తేట తేట తెలుగు పదాలను  
ఉచ్చరిస్తే ఉతుకుతాయి విద్యార్ధులను నేటి స్కూళ్ళు   

మార్కులంటూ ర్యాంకులంటూ మానసికంగ వేధిస్తు  
నీరసంలో ముంచుతాయి చిన్నారులను నేటి స్కూళ్ళు 

డాక్టరువో ఇంజనీరొ అవ్వడమే నీ లక్ష్యమంటు  
చిన్న వాటిగ చూస్తాయి ఇతర వృత్తులను నేటి స్కూళ్ళు
     
టీవి లోన రోజు మొత్తం గొంతు చించుకుని అరుస్తూ 
తారుమారుగ చూపిస్తాయి ఫలితాలను  నేటి స్కూళ్ళు 

లేనిపోని స్పర్ధలను పెంచుతూ మరీ పేట్రేగుతూ  
పగవారిగా  మారుస్తాయి సహచరులను నేటి స్కూళ్ళు

కామాంధుల కొమ్ము కాస్తూ కారుణ్యం నేలరాస్తూ      
మొగ్గలోనే తుంచుతాయీ బాలికలను నేటి స్కూళ్ళు 

ఈడూరీ ఇంకా నీకు తెలియదంటె యిక తెలుసుకో  
ఎడారి లాగ మార్చుతాయి తెలుగునేలను నేటి స్కూళ్ళు