Friday, August 14, 2015

మన భూమి

వేదాలకు జన్మనిచ్చి వెలుగొందిన భూమి మనది
జంతువులకు విలువనిచ్చి పూజించిన భూమి మనది

వాత్సాయన వరాహుడూ ఆర్యభట్ట చరకుడూను
పరిశోధన విజయాలను సాధించిన భూమి మనది

వాల్మీకీ వేద వ్యాసు కాళిదాసు పోతనలూ
ఆనాడే కలాలనూ కదిలించిన భూమి మనది

తక్షశిలా పుష్పగిరీ నలందాలు ఆనాడే
చదువులమ్మ నిలయాలుగ భాసిల్లిన భూమి మనది

రుద్రమ్మా దుర్గావతి చాందు బీబి ఝాన్సి లక్ష్మి 
మహిళలనూ అందలాలు ఎక్కించిన భూమి మనది

అన్నమయ్య రామదాసు త్యాగరాజు కబీరులూ
భగవంతుని మనసారా కీర్తించిన భూమి మనది

గౌతముడూ వివేకుడూ గురునానకు మహవీరుడు
మతాలలో మానవతను వివరించిన భూమి మనది

కూచిపూడి కధాకళీ భరతనాట్యమొడిస్సీల
భరతమాత పరవశాన నర్తించిన భూమి మనది

వందలాది ఏళ్ళు మనని బానిసలుగ చూసినట్టి
తెల్లవాడి గుండెలలో నిదురించిన భూమి మనది

ఖుదీరాము భగతుసింగు ఆజాదూ రామరాజు  
దేశానికి ప్రాణాలను అర్పించిన భూమి మనది

విజయలక్ష్మి ఇందిరమ్మ కిరణు బేడి పీటి ఉషా 
ఆడదబల కాదంటూ నినదించిన భూమి మనది

మొఘలాజం మాయబజార్ లగానులూ షోలేలూ
అద్భుతాలు వెండితెరకు చూపించిన భూమి మనది

గుల్జారూ ఆరుద్రా వేటూరీ సిరివెన్నెల
కమ్మనైన గీతాలను రచియించిన భూమి మనది 

కపిలుదేవు గోపిచందు మేరికోము సానియాలు
క్రీడలలో జయపతాక ఎగరేసిన భూమి మనది

అంతరిక్ష యాత్రలలో ఆరితేరి ఈడూరీ         
అరుణ గ్రహం పైకి కూడ లంఘించిన భూమి మనది

    


Wednesday, August 12, 2015

దారి

మగ్గంపై మగ్గుతున్న నేతన్నలకేది దారి?
వాన కొరకు వేచియున్న రైతన్నలకేది దారి ?

స్టైనులెస్సు గిన్నె మరిగి మట్టిపాత్రలొద్దంటే
కుండలనే నమ్ముకున్న కుమ్మరన్నకేది దారి?

విదేశాల మద్యమిపుడు పరవళ్ళే తొక్కుతుంటె   
ముంతకల్లు అమ్ముతున్న గీతన్నలకేది దారి?

ఆచారం అడుగంటిన ఆధునికులు ఎక్కువయ్యె  
వేదాలను చదువుకున్న బాపనన్నకేది దారి?

అడవులన్ని అంతరించి రగులుతున్న లోకంలో  
వెదురు బుట్టలల్లుతున్న మేదరన్నకేది దారి?

Thursday, August 6, 2015

కాముడివే

రాతిరేళ తనువంతా ప్రవహిస్తూ కాముడివే   
సరసమాడు వేళలలో అలరిస్తూ శ్యాముడివే

ఒంటరిగా నేనుంటే ఉబుసుపోక కూచుంటే    
ముద్దులాటపాటలలో మురిపిస్తూ బాలుడివే

తోడు నీడ ఔతానని పెళ్ళిలోన బాసచేసి 
కడదాకా ననునీతో నడిపిస్తూ దేవుడివే  

నిమిషమైన ఆడజాతి నిలువలేని లోకంలో
కంచుకవచమన్నట్టుగ రక్షిస్తూ ధీరుడివే

పైడి లేడి మోజు పడిన సీత నేను కాకుండా 
చుట్టుముట్టు కష్టాలను తొలగిస్తూ రాముడివే

అలుముకున్న చీకట్లను దాటించే చెలికాడా    
బతుకంతా వెన్నెలలే కురిపిస్తూ సోముడివే

దిష్టిచుక్క లేకుండా కుదరదుగా ఈడూరీ
ఈజన్మకు నామనసే దోచేస్తూ చోరుడివే

Saturday, August 1, 2015

స్నేహితుడు

కష్టం వస్తే తోడుగ నిలిచే వాడే స్నేహితుడు 
కాటికి కూడా నీతో నడిచే వాడే స్నేహితుడు

నలుపూ తెలుపూ రంగులు ఎపుడూ ఒకటే కాకున్న 
బేధం మరచీ ఒకటిగ మెదిలే వాడే స్నేహితుడు 

ఎదలో ఎన్నో అలలే విసురుగ వలలే వేస్తున్న  
మనసుతొ నీపై మధువును చిలికే వాడే స్నేహితుడు

నీలో తననే చూస్తూ నిరతం నీతో రమిస్తూ 
శూన్యం లోనూ ప్రేమై కురిసే వాడే స్నేహితుడు

వందలు వేలూ మనుషులు ఎందుకు లేవోయ్ ఈడూరి 
అమాస నాడూ నీకై మెరిసే వాడే స్నేహితుడు