Sunday, July 26, 2015

షుక్రియ

నీతో గడిపిన క్షణాలన్నిటికి షుక్రియ 
నాకే ఇచ్చిన సుఖాలన్నిటికి షుక్రియ 

దివిలో వెలసిన దేవత భువికే వచ్చీ   

నాపై కురిసిన వరాలన్నిటికి షుక్రియ

తెలుపగ తరమా చెలియా మదిలో భావం  

పదాలు అల్లిన కవితలన్నిటికి షుక్రియ

నుదుటన రాసిన రాతలు ఏమైనాయో

మనకై మారిన గీతలన్నిటికి షుక్రియ

ఒకరికి ఒకరై ఎపుడూ నిలవాలంటూ 
అక్షతలేసిన చేతులన్నిటికి షుక్రియ

రెక్కలు తొడిగిన ఊహల విజయ నివేదన    

పెదాలు పంచిన మధువులన్నిటికి షుక్రియ

కలిసిన తనువుల లక్ష్యము వెన్నెల గమనం  
సుధలే చిలికిన రాత్రులన్నిటికి షుక్రియ

Thursday, July 16, 2015

అక్షరాలు

కాగితాల తోటలలో తిరగాలని ఉంది నాకు 
అక్షరాలు సున్నితంగ తాకాలని ఉంది నాకు 

జీవితాన నాన్నలాగ పాఠాలను నేర్పునట్టి
పుస్తకమే మస్తకమని పాడాలని ఉంది నాకు

సువాసనలు వెదజల్లగ ఎందుకోయి అత్తరులూ
గ్రంధాలే సుగంధాలు చాటాలని ఉంది నాకు

పారుతున్న ఏరులాగ సంస్కృతినే ప్రవహించే
పుస్కాలకు ఆనకట్ట కట్టాలని ఉంది నాకు

ఎవరికైన ఏకాంతం అంతులేని ఆవేదనె 
కితాబులే స్నేహితులని తెలపాలని ఉంది నాకు

ఈబుక్కూ తాళపత్రమేదైతేనేమిగాని
బుక్కులనే కానుకగా ఇవ్వాలని ఉంది నాకు 

గుండెలపై పుస్తకాన్ని పెట్టుకునీ ఈడూరీ
సంతసముగ ఊపిరులే వదలాలని ఉంది నాకు

Sunday, July 12, 2015

జిందగీ

ఎన్నొ ఏళ్ళ మధ్యంలా ఊరిస్తోంది జిందగీ 
ఎదురింట్లో పిల్ల లాగ కవ్విస్తోంది జిందగీ

అందనిదే అందినట్టు అల్లరులే చేస్తుంటే   
ఎడారిలో ఎండమావి అనిపిస్తోంది జిందగీ 

కన్ను మూసి తెరుచు లోపు కనుమరుగౌ తారలాగ
మనసుతోటి దోబూచులె ఆడిస్తోంది జిందగీ

ఏ నిముషం ఏమగునో ఎవరికెరుక ఈజగతిలొ 
సంద్రంలో కెరటంలా పడిలేస్తోంది జిందగీ 

ఐదేళ్ళకు ఒక్కసారి అగుపించే నాయకుడా
అన్నట్టుగ ఒకోసారి మురిపిస్తోంది జిందగీ

తప్పొప్పులు అతిసహజం నాటకాలు జీవితాలు 
టీవీలలొ సీరియల్సు మరిపిస్తోంది జిందగీ  

అమాయకపు చేపపిల్ల నువ్వేనా ఈడూరీ 
నెమ్మదిగా ఎరవేసీ వలలేస్తోంది జిందగీ 

Monday, July 6, 2015

గోదావరి

నింగినుండి జారిపడ్డ మెరుపల్లే మెరుస్తోంది గోదారీ 
పుష్కరాల శోభలన్ని తనలోనే పరుస్తోంది గోదారీ   

కలకాలం కనులవిందు కలిగిస్తూ పాడిపంటలందిస్తూ
గోదావరి జిల్లాలకు తన ప్రేమే పంచుతోంది గోదారీ 
  
కొండలలో కోనలలో వాగులతో వంకలతో పదము కలిపి
చక్కనైన జానపదుల గీతాలను పాడుతోంది గోదారీ

ఎల్లెడలా పరుగులెడుతు ఆరుగాలమలరిస్తూ నీరిస్తూ   
రైతన్నల కంటి నీరు తనచేత్తో తుడుస్తోంది గోదారీ 

ఈడూరీ పాపికోండలొకవైపూ పంట చేలు ఒకవైపూ 
ప్రకృతియను పట్టు చీర కట్టుకునీ మురుస్తోందీ గోదారీ

Wednesday, July 1, 2015

వాన

నిన్ను మొదటిసరి చూసినప్పుడు
నా మీద పడిన వర్షపు చుక్క
నీ నుదుటి సింధూరంగా మారుతుందని 
ఆ క్షణాన నాకు తెలియదు

చేయీ చేయీ కలిపి
పార్కులూ సినిమాలూ అంటూ 
తిరిగినప్పుడు నీ నవ్వుల నుండి 
జారిన ముత్యాలు...చిరుజల్లులా
నన్ను ఆసాంతం తడిపేశాయి  

నెత్తిన జీలకర్రా, బెల్లం పెట్టిన వెంటనే
కురిసిన వాన 
భద్రాచల సీతారాముల కళ్యాణం
గుర్తు చేసింది కదూ!!!!!! 

ఆపై మన ప్రేమ సునామీకి
ఆ నాటి కుంభవృష్టే బినామీ


తొలిసంతానాన్ని చేతులలోకి 
తీసుకున్నప్పుడు పడ్డ తొలకరి
మనసులని కూడా తడిపేసింది

రైన్ రైన్ గో అవే అంటూ పిల్లలు
రైములు పాడుతుంటే మన నుండి ఎవరో
ఏదో లాగేసుకుంటున్న వేదన...

పిల్లలు పెరుగుతున్న కొద్దీ
ప్రతి రోజూ వరాల జల్లే 
అంతు చిక్కడం లేదు
ఇది ఏ మేఘ సందేశమో!!!!!!!!!!!!