Thursday, November 22, 2018

నినుచూస్తే

కనులముందు కార్తీకం కనబడింది నినుచూస్తే
కొండగాలి ఊసేదో వినబడింది నినుచూస్తే


ఆ వయారి నడకలతో అలరించే నీ అందం
నర్తించే మయూరమే తడబడింది నినుచూస్తే


కన్నులతో నువు చేసే అల్లరులే అద్భుతాలు
నాకంటికి నిదురైతే కొరవడింది నినుచూస్తే 


ఏ దివిలో దీపానివొ భువిమీదకు దిగినావే
ఈడూరికి జోడేనని ధృవపడింది నినుచూస్తే  


నీ చూపే తగిలిందో...మన్మధుడే వదిలాడో
గుండెలోన బాణమేదొ దిగబడింది నినుచూస్తే 




Friday, October 5, 2018

దేనికిరా??

అటో ఇటో దూకకుంటె గోడున్నది దేనికిరా 
కన్నొ గిన్నొ కొట్టకుంటె ఈడున్నది దేనికిరా  

ఆకలైతె అడుక్కోడ రాజైనా పేదైనా    
కలో గంజొ తాగకుంటె కడుపున్నది దేనికిరా

మంచి చెడూ చెప్పకుంటె మానవతకు మనుగడేది 
మాటొ పాటొ రాయకుంటె కలమున్నది దేనికిరా

ఇతరులతో పంచుకొనుట చెట్టుకన్న ఎవరికెఱుక
కాయొ పండొ ఇవ్వకుంటె తరువున్నది దేనికిరా 

మత్తులోన మునిగితేనె గమ్మత్తుగ నుండునంట
పెగ్గొ మగ్గొ లేపకుంటె నోరున్నది దేనికిరా 

కరెన్సీల కట్టలెపుడు అవసరమే ఈడూరీ
అప్పొ సోప్పొ  చేయకుంటె డబ్బున్నది దేనికిరా

ప్రతీ శిలనూ శిల్పంగా మలచలేవు మిత్రమా  
రాయొ రప్పొ తెలియకుంటె మెదడున్నది దేనికిరా 

Sunday, September 9, 2018

మనుషులు

ప్రతివారూ పల్లెలకే ఫిదా అవుతు వుంటారు 
తమబతుకులు పట్నంలో సాగదీస్తు వుంటారు

పెంకుటిల్లు మెచ్చుతారు ఫొటో షేరు చేస్తారు 
కొనుక్కున్న ఫ్లాటులోన విర్రవీగుతుంటారు

బాలలకై వీసమెత్తు పనులేవీ చేయరూ 
తమబాల్యం పోయిందని బాధపడుతు వుంటారు

పండగొస్తె వాట్సప్పులొ మెసేజీలు పెడతారు 
ఎదుటపడితె ఎరగనట్టు ముఖం దాస్తు వుంటారు

సినిమాల్లో అసభ్యతే పెరిగిందని అంటూనె  
లిప్పులాకు సీనులొస్తె లొట్టలేస్తు వుంటారు

మంచితనం మోస్తారూ, లోన కుళ్ళు దాస్తారు 
ముసుగులోన ముసిముసిగా నవ్వు రువ్వుతుంటారు

అవినీతిని ఎండగడుతు లెక్చరైతె ఇస్తారు 
అవకాశం వుందంటే చేయి చాస్తు వుంటారు 

దేశంలో ఎటుచూసిన సమస్యలే అంటారు 
ఎన్నికల్లొ వోటెయ్యక సినిమ చూస్తు వుంటారు

ప్రకృతంటే ప్రేమంటా....విన్నావా ఈడూరి   
ప్లాస్టిక్కుని ప్రతిచోటా పారవేస్తు వుంటారు            

Friday, March 2, 2018

మది

సోషలు మీడియ చూరుని పట్టుకు గడిపేయాలంటోంది మది
ఛాటింగులతో డేటింగులతో సడి చేయాలంటోంది మది

రామూగాడు సోమూగాడు ఎపుడూ వుండే దోస్తులె కదా  
చెలి కొరకయితే ఏ చెలిమయినా వదిలేయాలంటోంది మది

మన్మధుడేనా వలపు శరాలు వదిలే వీరుడు లోకంలో 
చెలి గుండెలు తాకే బాణం గురి పెట్టేయాలంటోంది మది 

అలెక్జాండరు చెంఘీజ్ ఖానూ గెలిచేవారా ప్రతి యుద్ధం 
ఫెయిలయిపోతే సప్లీలోనూ ట్రై చేయాలంటోంది మది  

ఒకటే బాణం ఒకతే పెళ్ళం అన్నావంటె కష్టం రా    
బ్యాకప్ గట్టిగ చూసుకుని మరీ బతికేయాలంటోంది మది

ఆనందం

చిట్టిపొట్టి పాపలతో ఆడుతుంటె ఆనందం
ఆటలోని మాధుర్యం పంచుకుంటె ఆనందం

బుజ్జిబుజ్జి చేతులతో బువ్వ పెడితె తినాలోయ్
కమ్మనైన ఆ రుచులను గ్రోలుతుంటె ఆనందం

కాగితాల పడవల్లో చోటుందా కనుక్కో
వాననీటి దారులెంట సాగుతుంటె ఆనందం

అమ్మకడుపు చల్లగంటు దీవిస్తే ధన్యుడవే
తల్లిలాగే నీకు లాల పోస్తుంటే ఆనందం

తండ్రిలాగ దండిస్తే తప్పదంటు భరించాలి
సుతిమెత్తని కాఠిన్యం పొందుతుంటె ఆనందం

పాఠాలే చెబుతుంటే శ్రద్దపెట్టి నేర్చుకో
పంతుళ్లను నీ ఎదురుగ నిలుపుతుంటె ఆనందం

అదృష్టం వెతుక్కుంటు వచ్చిందోయ్ ఈడూరీ
నీబాల్యం ఇంటితలుపు తడుతుంటే ఆనందం