Wednesday, August 25, 2021

ప్రేయసి

 గుండెలోతుల గాయపరచీ జారుకున్నది ప్రేయసీ 

పెదవి దాటని మౌనగీతం పాడుకున్నది ప్రేయసీ


ఎదుటలేదూ తిరిగిరాదూ ఎందుకోమరి కోపమూ  

మనసుతోటీ బంతులాటే ఆడుకున్నది ప్రేయసీ  


మధువుకోసం పెదవులెంతో ఎదురుచూపులు చూసెనూ 

కళ్ళలోనే నిషానంతా దాచుకున్నది ప్రేయసీ 


చీమచిటుక్కుమన్నగాని తానొచ్చెనాయని ఊహలు   

మార్గమంతా ముళ్ళబాటగ మార్చుకున్నది ప్రేయసీ 


అంతలోనే ప్రేమ విషముగ మారెనెందుకొ తెలియదూ 

తీర్చలేనీ వరములేవో కోరుకున్నది ప్రేయసీ


నిదురలేనీ రాత్రులెన్నో తప్పవింకా ఈడూరి 

కౌగిలింతల వేకువంతా దోచుకున్నది ప్రేయసీ 


మరణమే యిక శరణమా మంతనములేవీ పొసగవా   

కనుసైగకైన బదులు చెప్పక ఊరుకున్నది ప్రేయసి       


Wednesday, August 18, 2021

లేదునాన

ఆన్లైన్ క్లాసులతో అవస్థలు పడుతున్న పిల్లల మనోభావాలతో రాసిన ఘజల్ యిది. పూర్తిగా తెలంగాణ యాసలో రాసిన ఘజల్ 


ఆనులైను క్లాసులద్దు అర్థమైత లేదునాన

టీచరేమి చెబుతుందో బుర్రకెక్త లేదునాన


కరంటుంటె నెట్టుండదు రెండుంటే క్లాసుండదు

నిన్న ఏమి సదివిన్నో యాదికొస్త లేదునాన  


మాయదారి కరోనచ్చి ఆగమాయే మా బతుకులు

ముందురోజులెట్లుంటయొ యివరమొస్త లేదునాన 


బడికిపోయి సదువుకుంటె మస్తుగుండె ఆ రోజులు  

ఇట్ల సదివి ఏమైతమొ లెక్కకొస్త లేదునాన 


సదువు సంకనాకిపాయె తప్పునాది ఎందుకాయె 

కోపమొచ్చి అమ్మగూడ ముద్దులిస్త లేదునాన