Friday, December 30, 2011

మరణం తరువాత


చూడాలని ఉంది నాకు చందమామ వెనుక కూడా
చేరాలని ఉంది నాకు దిగంతాల ఆవల కూడా
 
ఉరకలేసే లేత మనసు అణిగి మణిగి ఉండలేదు   
ఆడాలని ఉంది నాకు బాల్యం  తరువాత కూడా

మనసు తోడు రాకుంటే విజయానికి విలువెక్కడిది
గెలవాలని ఉంది నాకు ఓటమి తరువాత కూడా

ప్రేమ అమరమనుకుంటే అంతమన్న మాటెందుకు
రమించాలనుంది నాకు ప్రణయం తరువాత కూడా

కానరాని లోకాలపై మమకారం నాకెందుకు
బతకాలని ఉంది నాకు మరణం తరువాత కూడా

Tuesday, December 20, 2011

విటుడు – నటుడు


ఓ వంద నోటు పారేసి
ఆనందం కొనుక్కుంటాడు
రాసలీల విటుడు 
అదే వంద నోటు పారేసి
అసెంబ్లీ సీటు కొంటాడు
రాజకీయ నటుడు

Sunday, December 11, 2011

వై దిస్ కొలవెరి

ఎన్నో వూడల పాటల మర్రి
ఏమిటోనండీ ఈ వేలంవెర్రి
ఏ నోట విన్నా వై దిస్ కొలవెరి
కుర్రకారు బుర్రల్లో చేరి
ప్రతినోటా పాట కచేరి
రోజుకో వెర్షన్లో మారి
మళ్ళిస్తూంది మనసుల దారి
సచిన్ గారి వందో సెంచరీ
సోనునిగం పుత్రుడి మాకరీ 
తెలంగాణా వాదుల వర్రీ
అంధ్రాలో కుర్రాళ్ళ అల్లరి
ఏ మూసలోనైనా శిల్పంగా మారి
అలరిస్తోంది అదేంటో మరి

Monday, December 5, 2011

శ్రీరామరాజ్యం

 
బాపూ గీసిన రమణీయ ద్రుశ్యం
ఇళయరాజా మోగించిన కమ్మని బాజా
ముళ్ళపూడివారి మురిపించే మాటలు
జొన్నవిత్తిన సొగసరి సాహిత్య సేధ్యం
కనులవిందు గావించె శ్రీరామరాజ్యం
వాల్మీకిగా వెలిగె ఎదురులేని అక్కినేని
వసిష్టుడు ఎవరో కాదయ్యా, మునుపటి బాలయ్య
రామునివేషం కట్టె నందమూరి మేటి, నేటి బాలయ్య
నయనానందముగ సీతమ్మను నిల్పిన తార నయనతార
దారాసింగు గారాల తనయుడు ఆంజనేయునిగ చేసె కను’విందు’
శ్రీకాంతుడైనాడు లక్ష్మణుడు, సమీరు భక్తినిరతుడు భరతుడు
లవుడుగా మురిపించినవాడు గౌరవుడు
కుశుడుగా అలరించెను ధనుష్
మగధీర కణ్ణన్ చేసెను గ్రాఫిక్కుల ట్రిక్కులు
పి ఆర్ కే రాజు కెమేరా చూపించెను నలుదిక్కులు
ఇంతగొప్ప చిత్రమందించిన నవాబు యలమంచిలి సాయిబాబు
మేటితారలతో ధాటిగా నిర్మించిరి శ్రీరామరాజ్యం
అట్టి రమణీయ రంగులకల బాపు రమణలకే సాధ్యం
నెలతప్పిన సీతమ్మ నడుముకు వేలాడిన చింతకాయ
భావవ్యక్తీకరణలో ముళ్ళపూడివారిది పెద్దతలకాయ
బాలహనుమంతుని చమక్కు రమణ మార్కు గిమ్మిక్కు
మంగళకరమౌ ఈ సినిమా చక్కగ చూపెను రాముని మహిమ
పుల్లయ్యగారి లవకుశ యుగయుగాల మధ్యం
నేటి తెలుగుతరానికి దక్కెను శ్రీరామరాజ్యం

Sunday, December 4, 2011

ఘంటసాల


పాటల పర్ణశాల
మన ఘంటసాల
సరిగమల స్టారు
ఈ గడసరి మాస్టారు
పాడిన ప్రతిపాటా
మోగుతునే ఉంది ఇంటింటా
ఎన్నేళ్ళైనా ఈ పాటల చిరంజీవి
ఏలుతునే వుంటారు సరిగమల భువి
భగవద్గీత పాడిన భక్తుడు
శివరంజని అందించిన ఘనుడు
శ్రుంగారమొలికించిన రసికరాజు
కంచుకంఠానికి తరాజు
పుష్పవిలాపం పాడిన మనీషి
దినకరుని నిదురలేపే మహర్షి
కోలొ కోలో యన్నది ఘంటసాల గళము
నిద్రలేచెనంతట మహిళా లోకము
మౌనముగా నా మనసుపాడెను వేణుగానము
ప్రేమయాత్రలకు బ్రుందావనము నందనవనము ఏలనో
చాలదా ఘంటసాల గళము
ఐనా నేను మారలేదు నా కాంక్ష తీరలేదు
నిన్నలేని అందమేదో నిదురలేచెను
భలేమంచిరోజు, పసనందైన రోజు
నీవు పుట్టావు ఈలోకం మెచ్చింది
అందమే ఆనందం ఆనందమె జీవిత మకరందం
కుడిఎడమైనా పొరపాటు లేదోయ్
నీ గానామ్రుతము మరిచేది కాదోయ్



Wednesday, November 30, 2011

అడవిలో.......


పదిమందికి నీడనిచ్చే
పచ్చని చెట్టు నేలకూలింది
వూరిలో......
పదిమంది కోసం
పోరాడే యోధుడు
నేలకొరిగాడు
అడవిలో.......

దేవుడు


దేవుడు మంచి రసికుడు
డిజైన్ లో ఘటికుడు 
చమట వాసనల
వేసవిలో ఇచ్చాడు
మత్తెక్కించే మల్లెపూలు
స్నానానికి బద్దకించే
చిలికాలంలో
జలుబు, రొంప అంటూ
మూసేశాడు ముక్కులు