Wednesday, March 10, 2021

శంకరా

 ఆకులతోటీ పూజలు చేస్తే ఆనందించే శంకరా

ఆర్తిగ పిలిచీ శరణనియంటే అభయములిచ్చే శంకరా 


చుక్క నీటితొ తడిపితె చాలూ నిండా మునిగే దేవుడవు

అడిగినవాడికి లేదనకుండా వరాలనిచ్చే శంకరా 


ఆదిభిక్షువే అయినా కూడా అందరి కడుపూ నింపెదవు

కోపంవస్తే కాముడినైనా బూదిగమార్చే శంకరా


అర్ధదేహమే అంబికకిచ్చీ నీవే సగమై మిగిలావు

మహిళకు మగనితొ సమానమయ్యే విలువలనిచ్చే శంకరా  


సాలీడైనా సామజమైనా ఒకటిగచూసే దేవరవు

వలువలకన్నా విలువలు మిన్నని చర్మం దాల్చే శంకరా


నీవేగనకా సరియనకుంటే చీమలు కూడా కుట్టవట

విపత్తులోనూ గమ్మత్తుజేసీ భక్తులబ్రోచే శంకరా


మంచుకొండలూ నీవేనంటా వల్లకాటిలో నీవేనటగా  

లయకారుడవని పేరేగానీ ఆయువునిచ్చే శంకరా 


ఆదియులేదూ అంతములేదూ ఎక్కడ వెదికిన నీవేగ 

ఎన్నో జన్మల పూజల ఫలమే నినుజూపించే శంకరా 


నాయకుడంటే నమ్మినవారికి మంచిని చేసే వాడు కద 

మాకై నిత్యము గళమున గరళము యింపుగ భరించె శంకరా