Tuesday, April 30, 2013

నేనేమో ఇక్కడ


భర్త కవి అయినా కాపౌండరైనా, డ్రైవర్ అయినా డైరెక్టర్ అయినా నిరంతరం అండగా నిలిచి అనుక్షణం శ్రమించే స్త్రీమూర్తులపై నిందా స్తుతిలాంటి కవిత 


నేనేమో ఇక్కడ
స్త్రీజాతి స్వాతంత్ర్యం కోసం
కవితలల్లుతున్నాను
నువ్వేమో అక్కడ
చెంచాలు, గరిటెలతో
కుస్తీ పడుతున్నావు

నేనేమో ఇక్కడ
కనుమరుగవుతున్న
విలువల వలువలిప్పుతున్నాను
నువ్వేమో అక్కడ
బంగాళదుంప తోలు వలుస్తున్నావు

నేనేమో ఇక్కడ
రాజకీయ దగాకోర్లపై
విప్లవ శంఖం పూరిస్తున్నాను
నువ్వేమో అక్కడ
ఏమండోయ్ కాఫీ తాగారా
చల్లారిపోతుంది అంటూ
అరుస్తున్నావు

నేనేమో ఇక్కడ
ఆకాశాన్నంటిన ధరలని
భూమార్గం పట్టిస్తున్నాను
నువ్వేమో అక్కడ
కూరగాయల కోసమని
నాజేబులో ఐదువందల నోటు
నొక్కేస్తున్నావు

నేనేమో ఇక్కడ
సినిమాల్లో మితిమీరిన శృంగారాన్ని
చెడుగుడు ఆడేస్తున్నాను
నువ్వేమో అక్కడ
తలుపు సందుల్లోంచి నాపైకి
వలపు బాణాలను
సంధిస్తున్నావు

ఎవరన్నారు ప్రతి మగవాడి
విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని?
నాకైతే అర్ధం కావట్లేదు!!

Friday, April 26, 2013

అతడు


అతడు ఆరడుగుల అందగాడు
తెల్లగా ఐస్ క్రీం పుల్లలా ఉంటాడు
అందంగా నవ్వుతాడు
అన్నింటా ముందుంటాడు

అతడు కంటిచూపుతో చంపేస్తాడు
అతని రక్తంలో భయంలేదు
అతను గుద్దితే రాళ్ళు పగులుతాయి 
అతడు అన్యాయాన్ని సహించడు 

న్యాయం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు
ధర్మాన్ని ఎప్పుడైనా రక్షిస్తాడు 
పేదలకు అండగా నిలబడతాడు 
పెన్నిధిని ఏనాడూ ఆశించడు  

కానీ ఇదంతా తెరమీదే 
నిజజీవితంలో అతడు 
మందుని మార్కెట్ చేస్తాడు 
చెరువుని ఆక్యుపై చేస్తాడు 
డబ్బుకోసం పార్టీ అమ్మేస్తాడు 
గూండాలతో జనాన్ని కొట్టిస్తాడు 

మీరు ఊహించింది నిజమే
అతడు మన తెలుగు సినిమా హీరో 

Wednesday, April 10, 2013

ఎక్కడ వెదకను ఉగాదిని?


ఆరు రుచుల్లోనా
బారు బిల్లుల్లోనా
మారు మూలల్లోనా
కారు మబ్బుల్లొనా
ఎక్కడ వెదకను ఉగాదిని?

మామిడి కాయలోనా
వేప పూతలోనా
చెరుకు గడల్లొనా
బెల్లం తీపిలోనా
ఎక్కడ వెదకను ఉగాదిని?

పసి నవ్వుల్లోనా
మసి చేతుల్లోనా
కసి చూపుల్లోనా
నిసి రాతిరిలోనా
ఎక్కడ వెదకను ఉగాదిని?

ఆధార్ కార్డుల్లోనా
వ్యదార్ధ గాధల్లోనా
పేదోడి బాధల్లోనా
రూపాయి బియ్యంలోనా 
ఎక్కడ వెదకను ఉగాదిని?

మబ్బు తునకల్లోనా
గబ్బు చేతుల్లోనా
డబ్బు సంచుల్లోనా
క్లబ్బు గంతుల్లోనా
ఎక్కడ వెదకను ఉగాదిని

సుడి గాలుల్లోనా
నది పాయల్లోనా
తడి కళ్ళల్లోనా
మది లోతుల్లోనా 
ఎక్కడ వెదకను ఉగాదిని

నల్ల బజారులోనా
తెల్ల కార్డుల్లోనా
కల్లు కాంపౌండ్లోనా
మల్లె పూలల్లోనా
ఎక్కడ వెదకను ఉగాదిని

పసి బాల్యంలోనూ
బోసి నవ్వుల్లోనూ
తల్లి మాటల్లోనూ
కొత్త పుంతల్లోనూ
వెదికి చూడు ఉగాదినీ
వేసుకో ఆశల పునాదినీ

బోనస్


మా నాయనను నలుగురు మోసుకోస్తుంటే
ఏదైనా ఆటల గెలిచిండు అనుకున్న
కానీ సచ్చి పోయిండంట
మా నాయన పొద్దుగాల చాలా అందంగ ఉండెటోడు
మాపటికి ఏమయ్యేదో ఏమో నల్లగ మారెటోడు
చూస్తేనే భయమేసేటిది
రా కొడకా అంటె పొయ్యెటోన్ని గాదు
వేడినీళ్ళతోని స్నానం చేసి ఎత్తుకునేటోడు

నాయిన బొగ్గు బాయిల పంజేస్తడు కొడకా
డూటికి పోతే అట్ల నల్లగైతడు అని అమ్మ జెప్పేడిది
అంతెగాదు మా నాయన రాత్రంత దగ్గెటోడు
మాయదారి బొగ్గు నా పెనిమిటి పానం దీస్తుంది
అనుకుంట అమ్మ ఏడ్సుడు నేను జూసిన చాన సార్లు

ఏమైనా మా నాయన చాన మంచోడు
జీతాలు పడినంక సైన్మకు తీస్కబోయెటోడు
సింగరేని తల్లి దయ అనెటోడు
పండ్గకు కొత్త బట్టలు కొంటవా
అని నాయిన నడిగితె బోనస్లు పడనియ్ బేటా అన్నడు
ఇంతలోకే ఏమైందో ఏమో
మా నాయన సచ్చి పోయిండు
31/3/13