Wednesday, January 30, 2013

గాంధీతాతకి నివాళి


ఉక్కుమనసు నీకుంటే
ఉద్యమించు సోదరా
కత్తులతో సుత్తులతో
నీలక్ష్యం చేరవురా
గాంధీలా పోరు సల్పు
గాడ్సేలా కాదురా

ఆయుధాలు పట్టినోళ్ళు
అతీగతీ లేకపాయె
బక్కపలుచ గాంధితాత
జాతిపితగ ఎదిగిపోయె 
గుండెదమ్ములున్నోళ్ళే
నాయకులౌతారురా
ఎనకుండి నడిపించే
ఎర్రెధవలు కాదురా!!!!  

Saturday, January 12, 2013

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో......


వాడవాడలా భోగిమంటలు
గాదెలలోన కొత్త పంటలు
ముగ్గులేసే ముద్దుగుమ్మలు
నక్కిచూసే కోతిమూకలు
ఇంటిముంగిట రంగవల్లులు
వాటి మధ్యలో గొబ్బిళ్ళు
నులివెచ్చని కిరణాలు 
మామిడాకు తోరణాలు
హరిదాసు కీర్తనలు
బసవన్నల నర్తనలు
ఎగిరే గాలిపటాలు 
అందుకునే ఆరాటాలు 
అందరికీ కొత్తబట్టలు 
ఇంటింటా పిండివంటలు
ఈ సంక్రాంతి సంబరాలు
తాకాలి అంబరాలు

Thursday, January 10, 2013

బస్సు – మిస్సు


అనగనగా ఒక ఊరిలో చిత్రమొకటి జరిగెను 
ఆడవారు ఎక్కినట్టి బస్సు నీట మునిగెను 
భార్యామణుల ప్రాణాలు గాలిలోన కలిసెను 
భర్తలందరూ భోరుమంటు ఏడ్చెను
కొద్ది రోజుల దాకా అందరేడ్చుచుండెను
ఒకడు మాత్రం తన ఏడుపాపకుండెను 
వాడి బాధ చూసి జాలిపడిరి ఊరివారు
వాని చుట్టుచేరి ఓదార్చుచుండెవారు 
ఊరుకోవయ్య మగడ ఆపు నీ ఏడుపు
ఎంతకాలమిట్లు ఏడ్చుచుందువు చెప్పు 
భార్యపోయినందుకు బాధ నీది తెలుసు
అంతలోనె వాడు ఒక్క ఉదుట అనెను బుస్సు
అయ్యలార నా భార్య ఎక్కలెదు ఆ బస్సు
అందుకనే నా ఏడుపు మీకు ఏమి తెలుసు
నా భార్య ఎక్కకముందె సాగిపోయె ఆ బస్సు
అందుకనే నా ఏడుపు నా ఈ కస్సుబుస్సు

Monday, January 7, 2013

చాలు నాకు (Ghazal)


దినమంతా నీనామం జపిస్తే చాలు నాకు 
బతుకంతా నీతోనే గడిస్తే చాలు నాకు   

వీఐపీని కానుగా పాసులు పట్టుకురాలేను    
అరక్షణం కనులారా దర్శిస్తే చాలు నాకు  

పొట్టలేవీ కొట్టలేదు,కిరీటాలు చేయించలేను  
నీ పాదాలకు పూలను అర్పిస్తే చాలు నాకు    

భూదందా రాదుగా, గుడులను కట్టించలేను  
గుండెగుడి లోనిన్ను స్మరిస్తే చాలు నాకు  

ఈడూరిని నేను, మరోలా నటించలేను    
ఘడియైనా నీకరుణ కురిస్తే చాలు నాకు