Monday, April 26, 2021

పేరడీ.....రడీ

 గోలీమార్ సినిమాలో మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళె అన్న పాటకి నా పేరడీ.....రడీ  



వైరస్సు ఒట్టి మాయలాడే కరుణంటే ఏమిటో తెలీదే  

ప్రాణాలు తోడేసి పోతాదే కరోన అంటె  ఇంతే   


వైరస్సు ఒట్టి మాయలాడే కరుణంటే ఏమిటో తెలీదే  

ప్రాణాలు తోడేసి పోతాదే కరోన అంటె  ఇంతే   


రోజంతా పేషంటు దగ్గుతుంటే ఫ్లూలాగ టెంపరేచరున్నదంటే  

వైరస్సు నీకు సోకినట్టే....కరోన అంటె ఇంతే   


వైరస్సు ఒట్టి మాయలాడే కరుణంటే ఏమిటో తెలీదే  

ప్రాణాలు తోడేసి పోతాదే కరోన అంటె  ఇంతే  


ఢంకుటకర ఢంకుటకర ------------టా


కాసేపు మాస్కుతీసి తిరుగుతామ్ కూసంత గుంపులొ పడి దొర్లుతాం   

కాసేపు మాస్కుతీసి తిరుగుతామ్ కూసంత గుంపులొ పడి దొర్లుతాం 

వైరస్సు గాలేంటో మ్యూటేన్టో పేటెంటో యామో ఏంటో 

ముక్కులోకి వచ్చినిన్ను చేరదా నీ చెస్టు పిండి పిండి చేయదా   

మీరింక పైపైకే....కరోన అంటె ఇంతే   


వైరస్సు ఒట్టి మాయలాడే కరుణంటే ఏమిటో తెలీదే  

ప్రాణాలు తోడేసి పోతాదే కరోన అంటె  ఇంతే  


బతికుంటె బలుసాకు తింటువుంటాం ఇంటినుండె పనులన్ని చేసుకుంటామ్   

బతికుంటె బలుసాకు తింటువుంటాం ఇంటినుండె పనులన్ని చేసుకుంటామ్ 

టీవీల్లో న్యూసేంటొ గోలేంటో బాధేంటో యామో యాంటో  

అడ్డమైన వార్తలన్ని ఆపరా కూసింత మంచి కూడ చూపరా  

ఛానళ్ళు ఛీఛీ కరోన్ కూడ ఇంతే  


  



Sunday, April 18, 2021

 కరోనాను అడ్డుకోండి మనుషులార ఇపుడైనా

జాగ్రత్తగ మసలుకోండి మూర్ఖులార ఇపుడైనా


శవంపైన నగలుకూడ ఒలుచుకునే దుర్మార్గుడ

గుండెలోన మానవతను ఒంపుకోర ఇపుడైనా 


మందులన్ని మాయమాయె మార్కెట్లో ఎందుకనో

లాభాలను దండుకొనుట మానుకోర ఇపుడైనా


కార్పొ"రేటు" ఆస్పత్రులు మారాలోయ్ తప్పదిపుడు

బెడ్డుకొరకు బేరాలను వదులుకోర ఇపుడైనా


ప్రతిరోజూ తాగుతుంటె ఆరోగ్యం సంగతేంటి?

కుటుంబాన్ని ప్రేమతోటి చూసుకోర ఇపుడైనా


అధికారులు మొద్దునిద్ర వదులుకుంటె మంచిదండి

లంచమొదిలి మంచిపేరు అందుకోర ఇపుడైనా


స్నానాలకు తొందరేంటి నది ఎపుడూ దేవతేగ 

ప్రాణాలను చూసుకోండి భక్తులార ఇపుడైనా 


లక్షలాది జనులెందుకు ఎలక్షన్ల సభలెందుకు

ఓటర్లను బాధ్యతెరిగి నిలుపుకోర ఇపుడైనా


అభిమానులు లేకపోతె నటులెక్కడ ఈడూరీ

నిజజీవిత హీరోగా నిలబడరా ఇపుడైనా 


కరోనా కష్టకాలంలో కూడా మనుషులు చూపిస్తున్న వికృత చేష్టలు చూసి స్పందించి రాసిన ఘజల్ యిది. ఆడమనిషి చనిపోతే ఆవిడ ఒంటిపై వున్న నగలను దోచుకున్న ఆసుపత్రి సిబ్బంది గురించి విన్నాను. ఆసుపత్రిలో బెడ్ కోసం కరోనా పీడితుల కుటుంబాలు పడుతున్న యిబ్బందులను విన్నాను. ప్రజల క్షేమం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులూ, ఎవడి గోల వాడిదే అన్నట్టుగా తమ సినిమాలను ప్రమోట్ చెసుకోడానికి ఆయాసపడుతున్న నటులు, ప్రజలేమైతే మనకెందుకు మన నాటకాలు మనం ఆడదాం అనుకుని యధేచ్చగా సభలు పెట్టుకుంటున్న నాయకులూ, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా స్నానాలు చేసి పుణ్యం పెంచుకోవాలనుకునే భక్తశిఖామణులూ అందరూ కాస్త సమ్యమనం పాటిస్తే మంచిది.