మా నాయనను నలుగురు మోసుకోస్తుంటే
ఏదైనా ఆటల గెలిచిండు అనుకున్న
కానీ సచ్చి పోయిండంట
మా నాయన పొద్దుగాల చాలా అందంగ ఉండెటోడు
మాపటికి ఏమయ్యేదో ఏమో నల్లగ మారెటోడు
చూస్తేనే భయమేసేటిది
రా కొడకా అంటె పొయ్యెటోన్ని గాదు
వేడినీళ్ళతోని స్నానం చేసి ఎత్తుకునేటోడు
నాయిన బొగ్గు బాయిల పంజేస్తడు కొడకా
డూటికి పోతే అట్ల నల్లగైతడు అని అమ్మ జెప్పేడిది
అంతెగాదు మా నాయన రాత్రంత దగ్గెటోడు
మాయదారి బొగ్గు నా పెనిమిటి పానం దీస్తుంది
అనుకుంట అమ్మ ఏడ్సుడు నేను జూసిన చాన సార్లు
ఏమైనా మా నాయన చాన మంచోడు
జీతాలు పడినంక సైన్మకు తీస్కబోయెటోడు
సింగరేని తల్లి దయ అనెటోడు
పండ్గకు కొత్త బట్టలు కొంటవా
అని నాయిన నడిగితె బోనస్లు పడనియ్ బేటా అన్నడు
ఇంతలోకే ఏమైందో ఏమో
మా నాయన సచ్చి పోయిండు
31/3/13
No comments:
Post a Comment