Saturday, May 18, 2013

వంటలక్క


ఆయనకేం, అదృష్టవంతుడు!!
ఏమీ తెలియకుండా వెళ్ళిపోయాడు
మద్యం మత్తులో వొళ్ళు తూలి
లారీ కింద నలిగి కన్ను మూశాడు

ముక్కుపచ్చలారని
ముగ్గురుపిల్లల భారం మోసేందుకు
నేను వంటలక్క
అవతారం ఎత్తాను

నా పిల్లల్ని గాలికి వదిలేసి
జనాలకి విందు భోజనం
వండిపెట్టేదాన్ని
పెద్దాడికి ఇష్టమైన కూర
చిన్నాడికి నచ్చిన పచ్చడి
చంటిది ఇష్టంగా తినే పులుసు
వేరెవరో తింటుంటే,
నా బిడ్డలు ఏమి తింటున్నారో
ఎలా ఉన్నారో అని గుడ్ల నీరు
కుక్కుకునేదాన్ని

అందరికీ అన్నీ వండిపెట్టి
ఆదరా బాదరా ఇంటికి చేరి
ఆకలికి అలిసిపోయి పడుకున్న
నా పిల్లలని చూసి భోరున ఏడ్చేదాన్ని

కట్టుకున్నవాడు కనుమరుగైపోయినా
విధి కాలనాగై కాటువేసినా
చంటిపిల్లల పోషణ భారం
మీద వేసుకున్న
నన్ను కనికరించక
సూటిపోటి మాటలతో
శూలాలు గుచ్చేది సమాజం  

పిల్లల్ని బాగా చదివించినా
మంచి సంబంధాలు చూసి
పెళ్ళిళ్ళు చేసినా
నా అస్తిత్వం
నిలుపుకోడం కోసం
ఇప్పటికీ నేను
వంటలక్కనే..........

4 comments:

  1. very sad...........aa pillalaki valla amma kashtam telusunaa?

    ReplyDelete
    Replies
    1. enduku teliyadooo...perigi peddavaaru ayyaaruga

      Delete
  2. కదిలించే ఇలాంటి గాధలెన్నో.
    కవితలో హృద్యంగా చెప్పారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ

      Delete