Monday, February 18, 2013

చెట్టు


నేనొక చిన్న మొక్కని చూశాను
తూఫానులో అది రెపరెపలాడటం చూశాను
నీటి కోసం ఎండలో అదిపడే తపన చూశాను 
వానల్లో దాని ఒంటి పులకింత చూశాను 
అలా అలా అది పెద్దదవటం చూశాను

రెమ్మలుగా కొమ్మలుగా ఎదిగి ఆ చెట్టు మహావృక్షమయింది    
బొమ్మలుగా దిమ్మలుగా ఎందరికో ఉపయోగపడింది   
ఎందరికో తోడయింది, మరెందరికో నీడయింది 
ఆ  చెట్టుని నమ్ముకుని మరెన్నో మొక్కలు మొలిచాయి
నెమ్మదిగా అవికూడా చెట్లుగా ఎదిగాయి 

ఎన్నో వసంతాలు వచ్చాయి, ఎన్నో శిశిరాలు వెళ్ళాయి
చెట్టులో మునుపటి పచ్చదనం లేదు, పటుత్వమూ లేదు 
ఇప్పుడు దానికి నీరు కావాలి, నీరందించే చెయ్యి కావాలి 
తనపంచన పెరిగిన చెట్లన్నీ తమ మొక్కల్ని చూసుకుంటున్నాయి  
మాటిమాటికీ అడ్డు అని చెట్టుని తిట్టుకుంటున్నాయి 

తన చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లూ ఉన్నా అది ఇప్పుడు ఒంటరి 
ఏ చల్లగాలీ దానితో నాట్యమాడించలేదు
ఏ తూఫానూ దాన్ని కూకటి వేళ్ళతో పెకలించలేదు  
ఐనా ఆ చెట్టు అర్భకురాలే ఎందుకంటే దాని మన్సంతా డొల్లే   
దాని చుట్టుపక్కలంతా కుళ్ళే 


ఏ మహాప్రళయమో వచ్చి తనది కాని తన సమూహం నుండి 
దూరంగా విసిరేయాలని ఆ చెట్టు కోరుకుంటోంది 
మహాశివుని మూడో కన్ను తెరుచుకుంటే ఆ చూపు తనపైనే 
పడాలని ఆశిస్తోంది, నేలకొరగడంలోని ఆనందాన్ని
ఇప్పుడది తీవ్రంగా వెదుక్కుంటొంది

No comments:

Post a Comment