Tuesday, April 30, 2013

నేనేమో ఇక్కడ


భర్త కవి అయినా కాపౌండరైనా, డ్రైవర్ అయినా డైరెక్టర్ అయినా నిరంతరం అండగా నిలిచి అనుక్షణం శ్రమించే స్త్రీమూర్తులపై నిందా స్తుతిలాంటి కవిత 


నేనేమో ఇక్కడ
స్త్రీజాతి స్వాతంత్ర్యం కోసం
కవితలల్లుతున్నాను
నువ్వేమో అక్కడ
చెంచాలు, గరిటెలతో
కుస్తీ పడుతున్నావు

నేనేమో ఇక్కడ
కనుమరుగవుతున్న
విలువల వలువలిప్పుతున్నాను
నువ్వేమో అక్కడ
బంగాళదుంప తోలు వలుస్తున్నావు

నేనేమో ఇక్కడ
రాజకీయ దగాకోర్లపై
విప్లవ శంఖం పూరిస్తున్నాను
నువ్వేమో అక్కడ
ఏమండోయ్ కాఫీ తాగారా
చల్లారిపోతుంది అంటూ
అరుస్తున్నావు

నేనేమో ఇక్కడ
ఆకాశాన్నంటిన ధరలని
భూమార్గం పట్టిస్తున్నాను
నువ్వేమో అక్కడ
కూరగాయల కోసమని
నాజేబులో ఐదువందల నోటు
నొక్కేస్తున్నావు

నేనేమో ఇక్కడ
సినిమాల్లో మితిమీరిన శృంగారాన్ని
చెడుగుడు ఆడేస్తున్నాను
నువ్వేమో అక్కడ
తలుపు సందుల్లోంచి నాపైకి
వలపు బాణాలను
సంధిస్తున్నావు

ఎవరన్నారు ప్రతి మగవాడి
విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని?
నాకైతే అర్ధం కావట్లేదు!!

No comments:

Post a Comment