Friday, November 18, 2011

చిట్టి కప్ప

కప్పలు కప్పలు చిరు చిరు కప్పలు చిట్టి చిట్టి కప్పలు
గెంతులేయుచుండె చిట్టి పొట్టి కప్పలు
వాటికెదురుగ పొడవాటి స్తంభమొకటి వుండెను
ఇంతలోనె ఒక కప్పకు కోర్కె ఒకటి కలిగెను
స్తంభాన్నెక్కుదాం, ఎవరు ముందు శిఖరాన్ని  చేరెదరో
చూద్దాము అన్నది కప్ప చిట్టి పొట్టి చిరుకప్ప
పడుతూ తిప్పలు ఎక్కసాగె కప్పలు
కొన్ని కప్పలెక్కసాగె, కొన్నేమో చూడసాగె
కిందనున్న కప్పల్లో ముందరుండె తెలివైనవి,
స్తంభమెక్కలేవుగాని సతాయించగల కప్పలు
పకపక బెకబెక తికమక పెడుతున్నవి
ఎక్కుతున్న కప్పల్ని వెటకారం చేస్తున్నవి
చాలా కష్టం, చాలదు శక్తి, తీరని నష్టం, తర్వాత మీ ఇష్టం
అని భయపెదుతున్నవి ఎక్కుతున్న కప్పల ధైర్యాన్ని తగ్గిస్తున్నవి
ఆ మాటతో కప్పలు తోకముడుచుచుండెను
ఒక్కొక్కటె నెమ్మదిగా కిందికి దూకుచుండెను
చిట్టికప్ప ఒకటి మాత్రం మాట వినకుండెను
ఎవ్వరేమన్న గాని ముందుకెళ్ళుచుండెను
తన వెనకెవరూ లేరను విషయమెరుగకుండెను
ముందుకె దాని పయనం జోరుగ సాగుచుండెను
ఎవరెంత నీరుగార్చినా ఈ కప్పకు లెక్కలేదు, వుత్సాహం తగ్గలేదు
లక్ష్యంపై గురి తప్పలేదు, వెనుతిరిగి చూడలేదు పైదాకా ఎక్కెను
విజేతగా వచ్చెను, అన్ని కప్పలు దాన్ని చూసి ఆశ్చర్యం చెందెను
దాని విజయ రహస్యమేమని తల్లడిల్లె కప్పలు, ఊపసాగె తోకలు
ఎన్ని కప్పలడిగినా నోరుమెదపకుండెను
తరచి చూడ ఆ కప్పకు చెవుడు మెండుగుండెను 
చెవిటి కప్ప ఎక్కునపుడు వీటిమాట వినలేదు
అందుకనే వెనుక తిరిగి చూడలేదు
చెవిటి కప్ప వలన మనకు గొప్ప నీతి తెలిసెను
నీ లక్ష్యం చేరు వరకు విజయం చేజిక్కు వరకు
చెడుమాటలు వినరాదు, నీరసించి పోరాదు
చెవిటిగానె పోరాడు, విజేతగా నిలబడు

No comments:

Post a Comment