Saturday, May 2, 2015

నేటి స్కూళ్ళు

బెత్తముతో బాదుతాయి చిన్న పిల్లలను నేటి స్కూళ్ళు 
విత్తముతో బాదుతాయి తల్లి తండ్రులను నేటి స్కూళ్ళు  

తల్లి ఒడిలొ నేర్చుకున్న తేట తేట తెలుగు పదాలను  
ఉచ్చరిస్తే ఉతుకుతాయి విద్యార్ధులను నేటి స్కూళ్ళు   

మార్కులంటూ ర్యాంకులంటూ మానసికంగ వేధిస్తు  
నీరసంలో ముంచుతాయి చిన్నారులను నేటి స్కూళ్ళు 

డాక్టరువో ఇంజనీరొ అవ్వడమే నీ లక్ష్యమంటు  
చిన్న వాటిగ చూస్తాయి ఇతర వృత్తులను నేటి స్కూళ్ళు
     
టీవి లోన రోజు మొత్తం గొంతు చించుకుని అరుస్తూ 
తారుమారుగ చూపిస్తాయి ఫలితాలను  నేటి స్కూళ్ళు 

లేనిపోని స్పర్ధలను పెంచుతూ మరీ పేట్రేగుతూ  
పగవారిగా  మారుస్తాయి సహచరులను నేటి స్కూళ్ళు

కామాంధుల కొమ్ము కాస్తూ కారుణ్యం నేలరాస్తూ      
మొగ్గలోనే తుంచుతాయీ బాలికలను నేటి స్కూళ్ళు 

ఈడూరీ ఇంకా నీకు తెలియదంటె యిక తెలుసుకో  
ఎడారి లాగ మార్చుతాయి తెలుగునేలను నేటి స్కూళ్ళు  

No comments:

Post a Comment