Friday, May 29, 2015

నాకిష్టం

నే చేరిన గమ్యం కాదోయ్ నే చేసిన పయనం నాకిష్టం 
జనులిచ్చిన కితాబు కాదోయ్ నే రాసిన కవనం నాకిష్టం 

జగమంతా ఒక కుగ్రామము నేడు జనులంతా ఒక కుటుంబము   
నీ యిల్లొ నా యిల్లొ కాదోయ్ మనముండే భువనం నాకిష్టం 

తుది ఎపుడూ ఆరంభమే సృష్టి అంతా జీవ పరిణామమే  
కనుమూసే మరణం కాదోయ్ తిరిగొచ్చే జననం నాకిష్టం

నీ చేతి ఊతం అందిస్తే ప్రతివాడూ విజయుడే కాడా   
మది గుచ్చే మాటలు కాదోయ్ బలమిచ్చే వచనం నాకిష్టం 

ఒక నవ్వే చాలుగ అలసిన మనసంతా మల్లెలు పరిచేందుకు  
పై పూతల ముఖాలు కాదోయ్ నిండైన హసనం నాకిష్టం

అభివృద్దే నీ మంత్రం నిభద్దతే నీ అస్త్రం ఈడూరీ 
భయపెట్టే యామిని కాదోయ్ వెలుగిచ్చే కిరణం నాకిష్టం      

1 comment:

  1. మీ ఇష్టాలు బాగున్నాయి

    ReplyDelete