Thursday, July 21, 2016

ఎంత బాగ ఉంటుందీ

నెల మొత్తం వెన్నెలుంటె ఎంత బాగ ఉంటుందీ 
నేలంతా పచ్చగుంటె ఎంత బాగ ఉంటుందీ

గతుకులతో గోతులతో పయనమెటుల సాగాలీ
దారంతా పూలుంటే ఎంతబాగ ఉంటుందీ

పొలాలెండి గూడు చెదిరి రైతు రాజుల అవస్థలు 
చెరువుల్లో నీరుంటే ఎంతబాగ ఉంటుందీ

సమయానికి కురవనట్టి వర్షంతో లాభమేమి
ప్రతిరోజూ చినుకుంటే ఎంతబాగ ఉంటుందీ

కువకువలే లేకుండా తెల్లారితె ఏముందీ
చెట్టంతా పిట్టలుంటె ఎంతబాగ ఉంటుందీ

లక్షలనూ కోట్లనూ అడిగామా ఏమైనా
ఏ కష్టం రాకుంటే ఎంతబాగ ఉంటుందీ

మూగజీవినాదరించు మనసులేవి ఈడూరీ
ప్రతి జీవీ నవ్వుతుంటె ఎంత బాగ ఉంటుందీ

Thursday, June 2, 2016

నవ్విందీ

రాములోరు గుర్తొచ్చిన సీతలాగ నవ్విందీ 
నల్లనయ్య రూపుగన్న రాధలాగ నవ్విందీ 

పసితనాలు చిందించే అందమైన మోముతనది
చనుబాలను చవిచూసిన పాపలాగ నవ్విందీ

తిమిరాలను తరిమేసే చక్కనైన చూపుతనది
చీకటేల నింగిలోని చుక్కలాగ నవ్విందీ

నవ్వుతుంటె రతనాలే రాలినట్టు ఉంటుందీ   
జారుతున్న జలపాతపు హోరులాగ నవ్విందీ 

సందుజూసి సరసమాడ బోతుంటే జారుకునీ
పెద్దపులిని ఓడించిన జింకలాగ నవ్విందీ 

మనసుపడీ గెలుచుకున్న సఖునిజూసి నాచెలియే 
తనబిడ్డను చూసి మురియు తల్లిలాగ నవ్విందీ  

గమ్మత్తుగ మత్తులోకి లాగుతోంది ఈడూరిని 
శృంగారపు మరులు గొన్న రంభలాగ నవ్విందీ

నీ నవ్వులొ

మంచులోన తడిసినట్టి మల్లెపూవు కనబడింది నీ నవ్వులొ 
పైరగాలి పాడినట్టి రాగమేదొ వినబడింది నీ నవ్వులొ

పున్నమిలో చంద్రికలా నేలమీద విరబూసెను దరహాసము
ఓర్వలేని చందమామ అదేపనిగ తడబడింది నీ నవ్వులొ

బాపుగారు మనసుపడీ గీసుకున్న బొమ్మవేమొ అనుకున్నా 
కుంచెజారి వయ్యారం ఆందంగా అగుపడింది నీనవ్వులొ

పురివిప్పిన నెమలిలాగ సొంపులనే పరుచుకున్న పలువరుసలు 
నెమలినాట్యమందమనే వాదనకే తెరపడింది నీ నవ్వులొ

ఎందుకిలా కరుణించెనొ బాణమేసి మన్మధుడే ఈడూరిని 
ఈజన్మకి నామనసే మురిపెంగా ముడిపడింది నీ నవ్వులొ

Friday, April 29, 2016

నీ యాదిలొ

మల్లెపూల సువాసనే తొలుకుతుంది నీ యాదిలొ   
మరపురాని ఆనందమె తొణుకుతుంది నీ యాదిలొ  

నరనరాన నీరూపము చిత్రించుకు కూచున్నా 
నా రూపము తిరిగినాకు దొరుకుతుంది నీ యాదిలొ
  
కడదాకా వుండేదీ ఏమున్నది ఈ భువిలో    
అంతులేని అనుభూతే మిగులుతుంది నీ యాదిలొ 

మరపురాని బాధకన్న మధురమేమి లేదేమో 
నా మనసే తేనియలను చిలుకుతుంది నీ యాదిలొ  

ఇష్టమైన వారిచెలిమి తీపి గదా అనునిత్యం
తల్లి మమత మధురోహే కలుగుతుంది నీ యాదిలొ 

చిలిపి వలపు సయ్యాటలు నింపుకున్న మన తలపులు  
నా బాల్యం అడుగడుగున తగులుతుంది నీ యాదిలొ 

ఈడూరికి చెలియ చెరను విడవడమే తెలియదులే 
ఈ తనువే ఒకనాటికి వొరుగుతుంది నీ యాదిలొ

Friday, April 1, 2016

అడగాలని ఉంది

నువ్వెందుకు వచ్చావో అడగాలని ఉంది 
నన్నెందుకు మెచ్చావో అడగాలని ఉంది

మోడుబారి అణగారిన ఈ జీవితానికి
విరులెందుకు తెచ్చావో అడగాలని ఉంది

కన్నీటికి కరువైన తరుణంలో చల్లని
సుఖమెందుకు ఇచ్చావో అడగాలని ఉంది

తీరా నిను చేరుకున్న ఈ చక్కని క్షణం 
సూదెందుకు గుచ్చావో అడగాలని ఉంది

మూగబోయి మసిబారిన గుండెకదా నాది
దాన్నెందుకు గిచ్చావో అడగాలని ఉంది

Friday, February 19, 2016

మంచులో మాణిక్యం

దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తూ 35 అడుగుల లోతులో మంచులో కూరుకుపోయినా ఆరురోజులు మృత్యువుని ఎదిరించి మరో మూడు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి నేలకొరిగిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు నివాళిగా....
మంచులో మాణిక్యమై నువ్వు దొరికినప్పుడు
భరతమాత మళ్ళీ పురుడుపోసుకున్న బాలింతయింది 
ఒక మహా ఇల్లాలు నిన్ను తొమ్మిది నెలలు మోసి ఉండొచ్చు
కానీ ఈ గడ్డ నిన్ను ఆరురోజులు తన కడుపులో దాచుకుంది
నువ్వు ఆ ఆనందాన్ని మూణ్ణాళ్ళ ముచ్చటే చేశావు

అవునులే, శత్రువు గుండెలోనే నిద్ర పోగల నీకు
తల్లి పొత్తిళ్ళలో నిద్రించడం కష్టం కాదేమో
పాలూ కూరగాయలే కాదు మా ప్రార్ధనలు కూడా
కల్తీలేనేమో అందుకే నిన్ను కాపాడుకోలేకపోయాం

చావు పుట్టుకలు ఇక్కడేమీ కొత్త కాదు కానీ
నీలాంటి వీరుడు నేలకొరిగినప్పుడే....
భూమాత ఆనందంగా హత్తుకుంటుంది
ఆకాశం దీనంగా రోదిస్తుంది

ఉగ్రవాదులని ఉరితీస్తే ఏడ్చినంతగా మా జనాలు
నీ కోసం ఏడ్వకపోవచ్చు, కానీ నీ కోసం కొన్ని 
కోట్ల గుండెలు మూగగా రోదిస్తాయి, ఆ గుండెల్లో
నువ్వెప్పుడూ బతికే ఉంటావు......వీరుడా ఇక శెలవ్!!!

మన కర్నూల్ జిల్లాకు చెందిన ముస్తాక్ అహ్మద్ మృతదేహం కూడా ఈరోజు లభించింది, అతను కూడా ఇలా సజీవంగా దొరుకుతాడేమో అన్న ఆశని వమ్ము చేస్తూ. ఆ దుర్ఘటనలో అసువులు బాసిన మన వీర జవాన్లందరికీ నా నివాళి

Sunday, January 3, 2016

ఎంత హాయి!!

 పున్నమిలో బ్రతుకంతా గడిపేస్తే ఎంత హాయి
వెన్నెల్లో ఊరంతా తిరిగొస్తే ఎంత హాయి  

ఆ చెరువులు, ఈ చెట్లూ మన ఊరికి మైలురాళ్ళు   
పచ్చదనపు తివాచీలు పరిచేస్తే ఎంత హాయి 

మారేడుగ మారిపోయి మా రేడుని కొలవాలీ 
తనువంతా శివపూజకు అర్పిస్తే ఎంత హాయి 

సృష్టిలోని ప్రతి పత్రం దైవానికి సమ్మతమే 
ఆకులతో ఆ దేవుని అర్చిస్తే ఎంత హాయి  

ఉత్సవాలు జాతరలూ అందరినీ కలపాలీ    
పండుగలకి ఊరంతా కలిసొస్తే ఎంత హాయి 

పక్కవాణ్ణి ద్వేషించుట మానేసీ మనమంతా
దుర్గుణాలు దూరంగా విసిరేస్తే ఎంత హాయి 

మనిషిలోనె ఉన్నాడుగ అనాదిగా మాధవుడూ 
ప్రతివాడూ ఈవిషయం గుర్తిస్తే ఎంత హాయి   

కల్తీలకు బలైపోయె మనబతుకులు అనునిత్యం 
స్వచ్చమైన ఆరోజులు మళ్ళొస్తే ఎంత హాయి  
  
పల్లెటూళ్ళ అందమేది పట్నంలో ఈడూరీ 
ఆ సొగసులు ఇటుకూడా రప్పిస్తే ఎంత హాయి