Wednesday, April 29, 2015

టీవీలు మాకొద్దు

నిజాలన్న్ని నిర్భయంగా చిత్రించని టీవీలు మాకొద్దు 
అన్యాయాన్ని అనునిత్యం ఎదిరించని టీవీలు మాకొద్దు

అత్తాకోడళ్ళంటే ఎపుడూ పిల్లీ ఎలుకల కధేనా?
యిళ్ళల్లోన చిరు ప్రేమలు పూయించని టీవీలు మాకొద్దు 

పాత వంటకాలతో పాట్లు పడే యాంకర్లను చూశారా?
నోరూరే  కొత్త వంటల రుచి పంచని టీవీలు మాకొద్దు
   
వచ్చీరాని తెలుగుతో వంకర్లు తిరిగే యాంకర్ల గోల 
తేనెలూరే  తెలుగు పదం వినిపించని టీవీలు మాకొద్దు

మనిషి మనిషికి మధ్య మంచు గోడలు కట్టుటా పాత్రికేయం?
మానవత్వపు మధురిమలను కురిపించని టీవీలు మాకొద్దు

అందానికి మెరుగులనిచ్చేది మొహానికి పూసే రంగులా?
మనసులోపలి సౌందర్యం చూపించని టీవీలు మాకొద్దు 

యువతీ యువకులనగానే రోజంతా ఆట పాటలేనా?   
సమస్యలపై యువశక్తిని మళ్ళించని టీవీలు మాకొద్దు 

ఊసుపోని ఆటలే గృహలక్ష్మిని మహాలక్ష్మి చేస్తాయా?
మహిళామణుల చైతన్యం రగిలించని టీవీలు మాకొద్దు

వీక్షకునికి వినోదమే ప్రధానం కాదు కదా ఈడూరీ
అంతో ఇంతొ విజ్ఞానం అందించని టీవీలు మాకొద్దు

7 comments:

  1. ఈ నాటి తెలుగు టీవీ కార్యక్రమాల తీరుని చక్కగా సమరైజ్ (summarize) చేసారు. కాని ఎన్నంటే మాత్రం వీళ్ళల్లో మార్పు వస్తుంది గనక? అదీగాక వినోదాన్ని ఏదో దోసిళ్ళతో జుర్రేసుకోవాలనే ఆత్రం వీక్షకుల్లో బాగా ఎక్కువైపోతున్న నేపధ్యంలో టీవీ కార్యక్రమాల నాణ్యత మెరుగు పడటం కష్టం.

    అవునూ చివర్లో ఆ "ఈడూరి" ఎవరండి?

    ReplyDelete
    Replies
    1. ఈడూరి నేనేనండీ. ఇది గజల్, ఇందులో కవి తన పేరుని చివరలో సూచించడం ఆనవాయితీ నరసింహారావు గారూ

      Delete
    2. వివరణకి థాంక్స్ ఈడూరి గారూ.

      Delete
  2. అర్థవంతమైన కవితను అందించారు.
    కొంతైనా మార్పు వస్తే మన్నించి టీవీ చూసేద్దాంలెండి. మరీ బొత్తిగా వద్దు వద్దు అంటే జనాలు తిట్టుకుంటారు. :-)

    ReplyDelete
    Replies
    1. వద్దు వద్దు అంటే దారికొస్తాయని ఆశ పద్మార్పిత గారూ

      Delete