Friday, April 29, 2016

నీ యాదిలొ

మల్లెపూల సువాసనే తొలుకుతుంది నీ యాదిలొ   
మరపురాని ఆనందమె తొణుకుతుంది నీ యాదిలొ  

నరనరాన నీరూపము చిత్రించుకు కూచున్నా 
నా రూపము తిరిగినాకు దొరుకుతుంది నీ యాదిలొ
  
కడదాకా వుండేదీ ఏమున్నది ఈ భువిలో    
అంతులేని అనుభూతే మిగులుతుంది నీ యాదిలొ 

మరపురాని బాధకన్న మధురమేమి లేదేమో 
నా మనసే తేనియలను చిలుకుతుంది నీ యాదిలొ  

ఇష్టమైన వారిచెలిమి తీపి గదా అనునిత్యం
తల్లి మమత మధురోహే కలుగుతుంది నీ యాదిలొ 

చిలిపి వలపు సయ్యాటలు నింపుకున్న మన తలపులు  
నా బాల్యం అడుగడుగున తగులుతుంది నీ యాదిలొ 

ఈడూరికి చెలియ చెరను విడవడమే తెలియదులే 
ఈ తనువే ఒకనాటికి వొరుగుతుంది నీ యాదిలొ

Friday, April 1, 2016

అడగాలని ఉంది

నువ్వెందుకు వచ్చావో అడగాలని ఉంది 
నన్నెందుకు మెచ్చావో అడగాలని ఉంది

మోడుబారి అణగారిన ఈ జీవితానికి
విరులెందుకు తెచ్చావో అడగాలని ఉంది

కన్నీటికి కరువైన తరుణంలో చల్లని
సుఖమెందుకు ఇచ్చావో అడగాలని ఉంది

తీరా నిను చేరుకున్న ఈ చక్కని క్షణం 
సూదెందుకు గుచ్చావో అడగాలని ఉంది

మూగబోయి మసిబారిన గుండెకదా నాది
దాన్నెందుకు గిచ్చావో అడగాలని ఉంది

Friday, February 19, 2016

మంచులో మాణిక్యం

దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తూ 35 అడుగుల లోతులో మంచులో కూరుకుపోయినా ఆరురోజులు మృత్యువుని ఎదిరించి మరో మూడు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి నేలకొరిగిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు నివాళిగా....
మంచులో మాణిక్యమై నువ్వు దొరికినప్పుడు
భరతమాత మళ్ళీ పురుడుపోసుకున్న బాలింతయింది 
ఒక మహా ఇల్లాలు నిన్ను తొమ్మిది నెలలు మోసి ఉండొచ్చు
కానీ ఈ గడ్డ నిన్ను ఆరురోజులు తన కడుపులో దాచుకుంది
నువ్వు ఆ ఆనందాన్ని మూణ్ణాళ్ళ ముచ్చటే చేశావు

అవునులే, శత్రువు గుండెలోనే నిద్ర పోగల నీకు
తల్లి పొత్తిళ్ళలో నిద్రించడం కష్టం కాదేమో
పాలూ కూరగాయలే కాదు మా ప్రార్ధనలు కూడా
కల్తీలేనేమో అందుకే నిన్ను కాపాడుకోలేకపోయాం

చావు పుట్టుకలు ఇక్కడేమీ కొత్త కాదు కానీ
నీలాంటి వీరుడు నేలకొరిగినప్పుడే....
భూమాత ఆనందంగా హత్తుకుంటుంది
ఆకాశం దీనంగా రోదిస్తుంది

ఉగ్రవాదులని ఉరితీస్తే ఏడ్చినంతగా మా జనాలు
నీ కోసం ఏడ్వకపోవచ్చు, కానీ నీ కోసం కొన్ని 
కోట్ల గుండెలు మూగగా రోదిస్తాయి, ఆ గుండెల్లో
నువ్వెప్పుడూ బతికే ఉంటావు......వీరుడా ఇక శెలవ్!!!

మన కర్నూల్ జిల్లాకు చెందిన ముస్తాక్ అహ్మద్ మృతదేహం కూడా ఈరోజు లభించింది, అతను కూడా ఇలా సజీవంగా దొరుకుతాడేమో అన్న ఆశని వమ్ము చేస్తూ. ఆ దుర్ఘటనలో అసువులు బాసిన మన వీర జవాన్లందరికీ నా నివాళి

Sunday, January 3, 2016

ఎంత హాయి!!

 పున్నమిలో బ్రతుకంతా గడిపేస్తే ఎంత హాయి
వెన్నెల్లో ఊరంతా తిరిగొస్తే ఎంత హాయి  

ఆ చెరువులు, ఈ చెట్లూ మన ఊరికి మైలురాళ్ళు   
పచ్చదనపు తివాచీలు పరిచేస్తే ఎంత హాయి 

మారేడుగ మారిపోయి మా రేడుని కొలవాలీ 
తనువంతా శివపూజకు అర్పిస్తే ఎంత హాయి 

సృష్టిలోని ప్రతి పత్రం దైవానికి సమ్మతమే 
ఆకులతో ఆ దేవుని అర్చిస్తే ఎంత హాయి  

ఉత్సవాలు జాతరలూ అందరినీ కలపాలీ    
పండుగలకి ఊరంతా కలిసొస్తే ఎంత హాయి 

పక్కవాణ్ణి ద్వేషించుట మానేసీ మనమంతా
దుర్గుణాలు దూరంగా విసిరేస్తే ఎంత హాయి 

మనిషిలోనె ఉన్నాడుగ అనాదిగా మాధవుడూ 
ప్రతివాడూ ఈవిషయం గుర్తిస్తే ఎంత హాయి   

కల్తీలకు బలైపోయె మనబతుకులు అనునిత్యం 
స్వచ్చమైన ఆరోజులు మళ్ళొస్తే ఎంత హాయి  
  
పల్లెటూళ్ళ అందమేది పట్నంలో ఈడూరీ 
ఆ సొగసులు ఇటుకూడా రప్పిస్తే ఎంత హాయి

Monday, November 30, 2015

ప్రేమవాన

కళ్ళనుండి ప్రేమవాన కురుస్తుందొ లేదో
మరోసారి చెలియ నన్ను కలుస్తుందొ లేదో

చెలి అందం చూడగానె చిన్నబోయె జగమే
ఆకసాన మరో తార మెరుస్తుందొ లేదో

వాలుచూపు ఒకటివిసిరి సాగిపోయె తానూ
ఘడియైనా నాగురించి తలుస్తుందొ లేదో

ఇన్నినాళ్ళ విరహగీతి ఆగిపోదు మనసా  
ఈదాసుడి నిరీక్షణం ఫలిస్తుందొ లేదో

ఏ జన్మదొ ఈ పుణ్యము ఒక్కటాయె మనసులు
మరుజన్మలొ ఈడూరిని వరిస్తుందొ లేదో

Monday, October 26, 2015

చిట్టికన్న

నాకోసం తిరిగొచ్చిన అమ్మవురా చిట్టికన్న 
ప్రేమపూలు విరబూసిన కొమ్మవురా చిట్టికన్న

నీరాకతొ తొలగిపోయె ఇంటిలోని చీకటులే 
విధిరాతను మార్చగలా బ్రహ్మవురా చిట్టికన్న

ఆట పాట మాటలతో కాలమంత గడచిపోయె 
మురిపాలను పంచిపెట్టు బొమ్మవురా చిట్టికన్న

పుట్టినింట మెట్టినింట మంచిపేరు తీసుకొచ్చి
మురిపించెడు మంచి ముద్దు గుమ్మవురా చిట్టికన్న

కష్టాలలొ - నేనున్నా అని పలుకుచు ధైర్యమొసగి   
మెరిసిపోవు నాన్న కంటి చెమ్మవురా చిట్టికన్న

Wednesday, October 14, 2015

నీవు లేక......

ఎప్పుడో సావిత్రిలాంటి మహానటి మీద శ్రీశ్రీలాంటి మహాకవి రాసిన ఈ పాట చిత్రీకరించారు, అది ఒక అద్భుత గీతంగా మనని అలరించింది. కానీ ఏమి పాడుతున్నామో ఏమి భావం చూపించాలో తెలియని, తెలుగు రాని మహానటీమణులున్న ఈ కాలంలో కూడా అదే పాట పాడుకుంటే ఎలా? అందుకే మీకోసం, వాళ్ళకోసం మనందరి కోసం ఇలా మార్చాను.....చదూకోండి, పాడుకోండి మీ ఇష్టం....భర్త ఊళ్ళోలేకపోతే తన విరహాన్ని తెలుపుతూ మోడర్న్ భామ ఇలా పాడుకుంటోంది. 


నీవు లేక కుక్కర్ విజిలువేయకున్నది  
ఇంటి ముందు వాకిట ముగ్గులేకున్నది  //నీవు// 

పనిమనిషి కూడా నిన్ను పలవరించె
చూసి చూసి అంట్లు తోమి వెళ్ళిపోయె 
మాసిఉన్న బట్టలు ఉతుకువారు లేరే
మాసిఉన్న బట్టలు ఉతుకువారు లేరే
వాషింగ్ మెషీను పాతదైపోయే  //నీవు//  

ఏదొ ఒకటి వండి తినేద్దామంటే   
వంటరాని నాకు తిండి కూడ కరువే 
ఆకలింక నేను ఓపలేను స్వామీ
ఆకలింక నేను ఓపలేను స్వామీ 
కర్రీ పాయింట్ కూడా దగ్గర లేదే  //నీవు//  

వాట్సప్పు నీకై తెరచి ఉంచినాను
ఫేసుబుక్కులోనూ వెతికి చూసినాను
పాసు వర్డు లేని వైఫై లాగా  
పాసు వర్డు లేని వైఫై లాగా 
ఎందుకు పనికిరాని మనిషైనాను  //నీవు//