Friday, September 14, 2012

నగరం నిద్రపోతోంది


నగరం నిద్రపోతోంది
పేదోడి పొయ్యిలో మత్తుగా పడుకున్న పిల్లిలా
ధనవంతుడి ఇనప్పెట్టెలో మూలిగే డబ్బు సంచిలా  
సినిమా హీరోయిన్ పొద్దున్నెప్పుడో కొట్టుకున్న మేకప్పులా 
………………………………….నగరం నిద్రపోతోంది

అప్పుడే పుట్టిన బుడతడొకడు తానొచ్చేశానంటూ
గట్టిగా ఏడుస్తున్నాడు. ఏం ఉద్ధరిద్దామనో!!!  
కొత్త గౌనులో ఎలా ఉంటానో ఇప్పుడే కలగంటోంది
పుట్టినరోజు  చేసుకోబోయే మరో బుజ్జిపాప       
రేపొక్కరోజు బడికెడితే ఇంకో వారం రోజులు సెలవులు
అన్న మత్తులో జోగుతున్నాడు ఒక భావిభారత పౌరుడు  
…………………………………నగరం నిద్రపోతోంది


తన జీవార్తిని, దేహార్తిని తీర్చే మగాడి కోసం
వెతుకుతోంది లో బడ్జెట్ సినిమాలో నాయికలాంటి మగువ
బారు నుంచి బయటపడ్డ మందుబాబు
మరో కిక్కు కోసం అటువైపే వస్తున్నాడు
ఇంకొక్క కండోం అమ్మకం ఖాయం అని
ఆశగా చూస్తున్నాడు 24X7 మందులషాపు సేల్స్ మాన్  
………………………………….నగరం నిద్రపోతోంది  

వీధికుక్క ఒకటి విసుగ్గా అటూఇటూ తిరుగుతోంది
మొరగటానికి సరైన అవకాశమే దొరక్క
చేతివాటం తప్ప చమత్కారం తెలియని దొంగ ఒకడు
కన్నం వెయ్యటానికి సరైన ఇంటికోసం వెతుకుతున్నాడు
సీఐ గారింట్లొ బీటు పుస్తకంలో సంతకంపెట్టి వెనుతిరిగాడు
కానిస్టేబుల్ వెంకన్న ఈరోజుకి డ్యూటీ అయిందనుకుంటూ 
…………………………………నగరం నిద్రపోతోంది

ట్యాక్సీ డ్రైవరూ, టీకొట్టు సాయిలూ రాబోయే ఎన్నికలలో
వోటు ఎంత పలుకుతుందో లెక్కలేస్తున్నారు...ఎన్ని కలలో
నైటు షిఫ్టు నరేష్ వీకెండుని ఎలా ఎండుచెయ్యాలో అని
విపరీతంగా ప్లాను చేస్తున్నాడు.....అమ్మాయే ఖాయం కాలేదు
…..…………………………………నగరం నిద్రపోతోంది

ఆ ఒక్కటీ అందిస్తే ఈరోజుకి పతిసేవ పరిసమాప్తం 
అనుకుంటూ మొగుడి వైపుకి తిరిగింది ఒక ఇల్లాలు
కాటికి కాళ్ళు చాపిన ముసలివాడు దగ్గుతున్నాడు
రాత్రంతా దగ్గాలని మొక్కుకున్నాడేమో మరి!!!
 ………………………నగరం నిద్రపోతోంది

Wednesday, August 22, 2012

English Ghazal



I want to see beyond the moon, my God
I want to reach beyond the horizon, my God

A heart that sings and dances can’t be quiet
I want to play beyond the childhood, my God

Heartless victory never finds value
I want to win beyond the defeat, my God

If love is eternal how does it end?
I want the bliss beyond the desire, my God

Aim is not just to reach the heavens Iduri
I want to live beyond the death, my God





Thursday, August 9, 2012

నా రుబాయి


ఈ మధ్య సామల సదాశివ మాస్టారు గురించి తెలుసుకున్నప్పుడు రుబాయిల గురించి కూడా తెలిసింది. చిన్న ప్రయత్నం చేశాను. పెద్దలు  చదివి సలహాలు ఇవ్వగలరు

చెలి పాద సవ్వడి అదిగో గుండె లయ సరిచూసుకో
రస రాణి నవ్వింది కసిగా వలపు వీణ శ్రుతిచేసుకో
తనతో గడిపిన అనుక్షణం ఒక సుందర కావ్యం
అపురూప మానస చిత్రం కుంచెతో నీ మదిగీసుకో
ఈడూరీ మరణంలోనూ ప్రేయసిని పెనవేసుకో

Saturday, August 4, 2012

స్నేహితుల దినం


స్నేహితుడంటే “ఒంటరితనములోనూ వదలని తుంటరి” ఈ స్నేహితులదినం సందర్భంగా నా స్నేహితులందరికీ శుభాకాంక్షలతో...........

అమ్మ తిట్టినప్పుడు
నాన్న మొట్టినప్పుడు
అక్క కసిరినప్పుడు
అన్న బాదినప్పుడు


పాఠం తలకెక్కనప్పుడు
మాస్టారు కొట్టినప్పుడు
పక్కనోడు గిచ్చినప్పుడు
పరీక్షలో తప్పినప్పుడు

గోళీకాయలాడినప్పుడు
జామకాయలు కోసినప్పుడు
సినిమా టిక్కెట్టు దొరకనప్పుడు
శ్రీరామనవమి పండగప్పుడు


అమ్మాయి నచ్చినప్పుడు
ప్రేమలేఖ రాసినప్పుడు
కాలేజీ రోజులప్పుడు
పార్కుల్లో తిరిగినప్పుడు

ఉద్యోగం వచ్చినప్పుడు
తొలిజీతం అందినప్పుడు
భాద్యతలు పెరిగినప్పుడు
చేబదుళ్ళు అడిగినప్పుడు

వార్ధక్యం కమ్మినప్పుడు
వ్యాధులు వాటేసినప్పుడు
చీకట్లు ముసిరినప్పుడు
తుది శ్వాస వదిలినప్పుడు

నను వీడని ఓ నేస్తమా
నా నీడవు నువ్వే సుమా
నా జీవన సర్వస్వమా
నీకోసమొక దినం న్యాయమా????





Monday, July 30, 2012

సం(సారీ)!!!!


అనగనగా ఒక బ్రహ్మచారి
పాపం తప్పిపోయి దారి
పెళ్ళనే ఊబిలోకి జారి
అయ్యాడు కొత్త సంసారి!!


ఆ కయ్యాలమారి
తేలేదని కొత్త శారీ
అపర కాళిగా మారి
చేసింది వాడికి పిచికారీ!!


ఎముకలగూడుగా మారి
బతుకుపై విసిగి వేసారి
వేసుకున్నాడు చెట్టుకు ఉరి
చేరుకున్నాడు యమపురి!!


యమభటులు చుట్టూచేరి
నవ్వుతుంటే మరీ మరీ
చూపాడు భార్య ఫొటో ఒక్కసారి
పరుగెత్తారు అంతా తలో దారి!!!

Wednesday, February 22, 2012

ముళ్ళపూడి




ఎందరో వ్యక్తులు గుమిగూడి
అయ్యారేమో ఒక ముళ్ళపూడి

హాస్యానికి శ్రుష్టించారొక ఒరవడి
నవ్వాలంతా యుగాల తరబడి

వారి కధలు చదివితే  మనసుపడి
నవ్విస్తూనే పెట్టిస్తారు కంటతడి

స్నేహంలో బాపుగారికి సరిజోడి
ఇపుడా లోటును తీర్చే మనిషేడి?

Sunday, January 8, 2012

మాకుంది


తాడో పేడో తేల్చుకునే ధైర్యం మాకుంది
విజయాలు దక్కించుకునే సైన్యం మాకుంది

కాలంచెల్లిన ముసలితరం పాలన మాకొద్దు
నవచైతన్యం నింపే యువతరం మాకుంధి

సర్వనాశనం చేసే అణుబాంబులు మాకొద్దు
సహనం గెలిపించే సత్యాగ్రహం మాకుంది

గారడీలు చేసే మూఢాచారం మాకొద్దు
నిజాల నిగ్గును తేల్చే విజ్ఞానం మాకుంది

అరుపులు కేకల అరువు సంగీతం మాకొద్దు
హ్రుదయం కదిలించె భావగీతం మాకుంది

అంతులేని రహస్యాల ఆకాశం మాకొద్దు
అన్నదాత నమ్ముకున్న పుడమితల్లి మాకుంది

ఈడూరీ, పెత్తనం చేసే పెద్దన్నలు మాకొద్దు  
సైనికులై నడిపించే నాయకత్వం మాకుంది