Friday, November 18, 2011

చిట్టి కప్ప

కప్పలు కప్పలు చిరు చిరు కప్పలు చిట్టి చిట్టి కప్పలు
గెంతులేయుచుండె చిట్టి పొట్టి కప్పలు
వాటికెదురుగ పొడవాటి స్తంభమొకటి వుండెను
ఇంతలోనె ఒక కప్పకు కోర్కె ఒకటి కలిగెను
ఆ స్తంభాన్నెక్కుదాం, ఎవరు ముందు శిఖరాన్ని  చేరెదరో
చూద్దాము అన్నది ఆ కప్ప చిట్టి పొట్టి చిరుకప్ప
పడుతూ తిప్పలు ఎక్కసాగె కప్పలు
కొన్ని కప్పలెక్కసాగె, కొన్నేమో చూడసాగె
కిందనున్న కప్పల్లో ముందరుండె తెలివైనవి,
స్తంభమెక్కలేవుగాని సతాయించగల కప్పలు
పకపక బెకబెక తికమక పెడుతున్నవి
ఎక్కుతున్న కప్పల్ని వెటకారం చేస్తున్నవి
చాలా కష్టం, చాలదు శక్తి, తీరని నష్టం, తర్వాత మీ ఇష్టం
అని భయపెదుతున్నవి ఎక్కుతున్న కప్పల ధైర్యాన్ని తగ్గిస్తున్నవి
ఆ మాటతో కప్పలు తోకముడుచుచుండెను
ఒక్కొక్కటె నెమ్మదిగా కిందికి దూకుచుండెను
చిట్టికప్ప ఒకటి మాత్రం మాట వినకుండెను
ఎవ్వరేమన్న గాని ముందుకెళ్ళుచుండెను
తన వెనకెవరూ లేరను విషయమెరుగకుండెను
ముందుకె దాని పయనం జోరుగ సాగుచుండెను
ఎవరెంత నీరుగార్చినా ఈ కప్పకు లెక్కలేదు, వుత్సాహం తగ్గలేదు
లక్ష్యంపై గురి తప్పలేదు, వెనుతిరిగి చూడలేదు పైదాకా ఎక్కెను
విజేతగా వచ్చెను, అన్ని కప్పలు దాన్ని చూసి ఆశ్చర్యం చెందెను
దాని విజయ రహస్యమేమని తల్లడిల్లె కప్పలు, ఊపసాగె తోకలు
ఎన్ని కప్పలడిగినా నోరుమెదపకుండెను
తరచి చూడ ఆ కప్పకు చెవుడు మెండుగుండెను 
చెవిటి కప్ప ఎక్కునపుడు వీటిమాట వినలేదు
అందుకనే వెనుక తిరిగి చూడలేదు
చెవిటి కప్ప వలన మనకు గొప్ప నీతి తెలిసెను
నీ లక్ష్యం చేరు వరకు విజయం చేజిక్కు వరకు
చెడుమాటలు వినరాదు, నీరసించి పోరాదు
చెవిటిగానె పోరాడు, విజేతగా నిలబడు

Wednesday, November 16, 2011

బంగారు నగలు


తెల్లారగానే పుస్తకాల సంచీ భుజానేసుకుని 
బడికెళ్ళిపోయే స్కూలు పిల్లాడిలానే 
కష్టాల పొద్దుపొడవగానే భాధ్యతల బరువు
నెత్తినేసుకుని తాకట్టు కొట్లోకెళ్ళిపోతాయి బంగారు నగలు

Tuesday, November 15, 2011

వి వి యెస్ లక్ష్మణ్


కలకత్తాలోని ఈడెన్ గార్డెన్
వి వి యెస్ లక్ష్మణ్ కి అదో పెద్ద డెన్
అన్ని మాచులూ బాగా ఆడెన్
ప్రతిసారీ పరుగుల పంట పండెన్
బౌలర్ల కంట కన్నీరు నిండెన్
ప్రత్యర్ధి గావుకేక వినబడెన్
తెలుగోడి సత్తా కనబడెన్

Friday, November 11, 2011

హైదరాబాదు


 
హైదరాబాదు రహదారులు
నరకానికి అవి అడ్డదారులు
వేశావంటే బయటకు అడుగు
చుక్కలు కనబడకుంటే నన్నడుగు
లెఫ్టూ రైటూ జనాలకి తెలియవు
ట్రాఫిక్ లైట్లు ఎన్నడూ వెలగవు
పొలీసులు నడిచే ఏటీయెమ్ములు
జేబులు నింపును అవినీతి సొమ్ములు
పామరులకు తప్పవు చలానులు 
ధనవంతులకేమొ సలాములు
రాత్రంతా రోడ్లపై గొప్పోళ్ళ పిల్లల రేసులు
తెల్లారితే బస్సులకోసం రన్నింగ్ రేసులు
బండున్న ప్రతివాడూ ప్రతిభావంతుడు
రోడ్డెక్కితే అశోకవనంలో హనుమంతుడు
ఈ నగరానికి ముద్దుపేరు హైటెక్ సిటీ
దారంతా శవాల గుట్టలు వాట్ ఎ పిటీ