Thursday, July 16, 2015

అక్షరాలు

కాగితాల తోటలలో తిరగాలని ఉంది నాకు 
అక్షరాలు సున్నితంగ తాకాలని ఉంది నాకు 

జీవితాన నాన్నలాగ పాఠాలను నేర్పునట్టి
పుస్తకమే మస్తకమని పాడాలని ఉంది నాకు

సువాసనలు వెదజల్లగ ఎందుకోయి అత్తరులూ
గ్రంధాలే సుగంధాలు చాటాలని ఉంది నాకు

పారుతున్న ఏరులాగ సంస్కృతినే ప్రవహించే
పుస్కాలకు ఆనకట్ట కట్టాలని ఉంది నాకు

ఎవరికైన ఏకాంతం అంతులేని ఆవేదనె 
కితాబులే స్నేహితులని తెలపాలని ఉంది నాకు

ఈబుక్కూ తాళపత్రమేదైతేనేమిగాని
బుక్కులనే కానుకగా ఇవ్వాలని ఉంది నాకు 

గుండెలపై పుస్తకాన్ని పెట్టుకునీ ఈడూరీ
సంతసముగ ఊపిరులే వదలాలని ఉంది నాకు

No comments:

Post a Comment