Sunday, December 28, 2014

వేడుకే

ఎదురుగ చక్కని అమ్మాయుంటే కళ్ళకు వేడుకే
వదలక పక్కన ప్రేయసుంటె కౌగిళ్ళకు వేడుకే   

వరాలు కోరని భక్తుడు అంటూ జగాన లేడుగా 
కోర్కెలు తీర్చే దేవుడు ఉంటే గుళ్ళకు వేడుకే

తెలియని దూరం నిండిన గుండెలు ప్రగతికి చేటుగా               
ఆడీ పాడే పిల్లలు ఉంటే ఇళ్ళకు వేడుకే  

కాలే కడుపుకి మండే బూడిద జవాబు కాదుగా   
సీరియలంటె తెలియని పెళ్ళాం మొగుళ్ళకు వేడుకే 

మరకలు అంటని అధికారిని చూశావా ఎపుడైన     
టేబులు కిందికి చేయే చాస్తే ఫైళ్ళకు వేడుకే 

జీవిత పాఠాలు తప్పక నేర్పే మాస్టారుంటే 
బిలబిలమంటూ పిల్లలు వచ్చే స్కూళ్ళకు వేడుకే      

రేపుంటామో లేదొ తెలియని జీవితం, ఈడూరి  
నిమిషానికో బ్రేకింగ్ న్యూసు చానళ్ళకు వేడుకే 

Thursday, December 25, 2014

గజల్


బానిస సంకెళ్ళు నిలువున తెంచే పోదాం
అడుగడుగునా మన ముద్రను ఉంచే పోదాం 

భావి తరాలకు మన జాడలు వదలాలిగా 
మనదంటూ ఘన చరితను రచించే పోదాం

కులమతాల కట్టుబాట్లు నగుబాటే కదా 
మూఢ నమ్మకాల మొనలను తుంచే పోదాం 

మనిషి జన్మ మళ్ళీ దొరకాలని లేదుగా 
మానవత్వపు పరిమళాలు పెంచే పోదాం 

కుళ్ళు రాజకీయమిలా వదిలేస్తే ఎలా  
శ్రీ రాముడి రాజ్యం స్థాపించే పోదాం  

పోయేదెలాగూ తప్పదు కద ఈడూరీ
పదిమందికీ మన మంచిని పంచే పోదాం 

Wednesday, December 10, 2014

అదిగో ఆ నవ్వే

అదిగో ఆ నవ్వే నను కట్టిపడేసింది
విసిరే ఆ చూపే కనుగొట్టిపడేసింది

కదిలే అలలా నువు ఎటో కదిలిపోతుంటె 
వలపు అనే తుమ్మెద నను కుట్టి పడేసింది 

పగలే వెన్నెల్లు కురిసి మురిసిపోతుంటే     
మెరిసే నీ రూపం ఎద తట్టిపడేసింది
   
దివిలో ఈ అందం ఓర్వలేకపోయారా   
ఎవరో ఆ దైవం మన గట్టి ముడేసింది

మనకూ ఈడూరి తగు సమయమొచ్చిందిలే  
ఎదలో అణువణువూ తను చుట్టిపడేసింది

ఇదివరలో ఎపుడో

ఇదివరలో ఎపుడో నిను కలిసే ఉంటాను
నీ నవ్వుల జల్లులలో తడిసే ఉంటాను

ఏటిగట్టున ఒంటరిగా కూచుని ఉంటే 
ఆ ఊహల వెల్లువలో మెరిసే ఉంటాను

ఆరు బయట మంచం మీద నిదరౌతుంటే 
పున్నమి వెన్నెలలా నే కురిసే ఉంటాను

నీ వలపు దాచుకోలేక తడబడుతుంటే 
తలపుల పూదోటలొ నే విరిసే ఉంటాను

దివినుండి దిగిన అప్సరలా కదులుతూంటే 
నిను చూసిన ప్రతిసారీ మురిసే ఉంటాను

Monday, October 13, 2014

ఘజల్


ప్రేయసితో ప్రియుని మాట పరిమళమే ఘజల్
ఇరు మనసుల విరిసిన సిరి సోయగమే ఘజల్

వలపు వరదలో నిండా మమేకమయ్యేటి   
అనురాగపు జంటల యుగళ గీతమే ఘజల్

విరహముతో రగులుతున్న జతగాడి కోసం
చెలి కబురు మోసుకొచ్చే మారుతమే ఘజల్

వెతల లోతుల చితికి వేసారిన బతుకులకి
మదిని మరులు గొలిపే చెలిమి హస్తమే ఘజల్ 

ఈడూరి, రతిదేవి పూనిన ప్రేమ జంటకు
మదనుడు సారించిన పూల బాణమే ఘజల్  

Saturday, July 19, 2014

జీవిత చక్రం

ఒంటరిగానే మొదలవుతుంది జీవితం
ఒంటరిగానే ముగుస్తుంది
ఎవరి చావు వారిదే........

మొదలెక్కడో తెలియని జీవితం
తనకంటూ మరో గర్భాన్ని వెదుక్కుంటుంది
మళ్ళీ అంకురమై మొలుస్తుంది

ఒకటొకటిగా తన చుట్టూ బంధాల్ని అల్లుకుంటుంది
ఒక్కో ఇటుకా పేర్చి ఒక భవంతిని నిర్మించినట్టు
ఒక కుటుంబం తయారౌతుంది

అనుభంధాలు పెరుగుతాయి, అనురాగాలు పండుతాయి 
వచ్చే పోయే వానలా కష్టాలూ, కడగండ్లూ వస్తుంటాయి 
బంధాలతోపాటే బీటలూ పెరుగుతాయి 

ఎందుకో ఓరోజు జీవితం ఉన్నట్టుండి అలిసిపోతుంది 
తనకంటూ ఎవరున్నారని తనను తాను ప్రశ్నిస్తుంది
కొత్త గర్భం కోసం మరో వేట మొదలౌతుంది


Wednesday, April 16, 2014

కరివేపాకు


అప్పులు చేస్తే తిప్పలు తప్పవు
అప్పే లేక పప్పులు వుడకవు 
అప్పును ఒప్పుగ మార్చేదెవ్వడు?
మనకీ తిప్పలు తప్పేదెన్నడు?  
అప్పో సొప్పో చేస్తే భారం
నడిచేదెట్లా ఈ సంసారం
ఆకాశంలో ఎగిరే ధరలు
నేలమీద ఆకలి ప్రజలు
పళ్ళూకూరలు మనకందని ద్రాక్షలు
సామాన్యులకే ఎందుకీ శిక్షలు?
బొగ్గుని కూడా బొక్కే నేతలు
రక్తం రుచి మరిగిన పీతలు 
మద్యం, డబ్బులు చూపిస్తారు 
నీ వోటుకి గాలం వేసేస్తారు 
కులమూ మతమూ చూశావంటే
నోటుకి వోటుని అమ్మావంటే 
బానిసవే నువ్వు మరో అరవై నెలలు 
ఇక ఎన్నడు తీరును ఆకలి వెతలు  
సైకిల్ ఎక్కించి తొక్కేదొకడు  
కారులో షికారులు చేసేదొకడు 
నీ చెవిలో కమలం పెట్టేదొకడు
నీ ఆశల ఫ్యాను తిప్పేదొకడు  
భస్మాసుర హస్తం పెట్టేదొకడు   
అర్హత చూసి వోటుని వెయ్యి  
అవకాశవాదులకి తీసెయ్ గొయ్యి 
వోటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు 
మంచివాడికే నువ్వు పట్టం కట్టు 
నీకెన్ని కలలున్నా ఎవడిక్కావాలి 
ఎన్నికలప్పుడే నువ్వు కావాలి
నేతలందరిది ఒకటే సాకు  
వాళ్ళకి జనం  కరివేపాకు