Friday, March 2, 2018

ఆనందం

చిట్టిపొట్టి పాపలతో ఆడుతుంటె ఆనందం
ఆటలోని మాధుర్యం పంచుకుంటె ఆనందం

బుజ్జిబుజ్జి చేతులతో బువ్వ పెడితె తినాలోయ్
కమ్మనైన ఆ రుచులను గ్రోలుతుంటె ఆనందం

కాగితాల పడవల్లో చోటుందా కనుక్కో
వాననీటి దారులెంట సాగుతుంటె ఆనందం

అమ్మకడుపు చల్లగంటు దీవిస్తే ధన్యుడవే
తల్లిలాగే నీకు లాల పోస్తుంటే ఆనందం

తండ్రిలాగ దండిస్తే తప్పదంటు భరించాలి
సుతిమెత్తని కాఠిన్యం పొందుతుంటె ఆనందం

పాఠాలే చెబుతుంటే శ్రద్దపెట్టి నేర్చుకో
పంతుళ్లను నీ ఎదురుగ నిలుపుతుంటె ఆనందం

అదృష్టం వెతుక్కుంటు వచ్చిందోయ్ ఈడూరీ
నీబాల్యం ఇంటితలుపు తడుతుంటే ఆనందం

No comments:

Post a Comment