Sunday, January 29, 2017

నీగురించి

ట్విట్టరులో ట్వీటులెన్నొ పెట్టానే నీగురించి 
ఫేస్బుక్లో లైకులెన్నొ కొట్టానే నీగురించి  

అందమైన నీఫొటోలు పదికాలాలుండేలా
ఇన్స్టాగ్రాం మెమొరీలో దాచానే నీగురించి
  
రాసుకున్న లేఖలన్ని చేయిజారి పోకుండా
వాట్సాప్లో మెసేజులే చేశానే నీగురించి

కమ్మనైన కబురులెన్నొ చెబుతావని ఆశించీ 
హ్యాంగౌట్లో ఎదురుచూపు చూశానే నీగురించి

ఈడూరిని హీరోగా చిత్రిస్తూ కథలనల్లి
వైబరులో వైభవంగ పేర్చానే నీగురించి

Wednesday, January 18, 2017

నీ తలపు

ఉదయం తాగిన కాఫీ రుచిలా హాయిగ వుందే నీ తలపు
మల్లెల వాసన తాకిన మదిలా మత్తుగ వుందే నీ తలపు

ఘడియే యుగముగ గడిపెను చూడూ విరహం వీడని నా మనసు   
తొలకరి జల్లుల చిరువాసనలా చిక్కగ వుందే నీ తలపు

ఎపుడూ చూడని ఏవో రంగులు విరిసెను నాలో ఈనాడు 
నింగిలొ మెరిసిన తారక లాగా తళుకుగ వుందే నీ తలపు

అందాలన్నీ ఒకటై చేసే అల్లరి నాట్యం నీ నడక 
అపుడే విరిసిన తామరలాగా సొంపుగ వుందే నీ తలపు

నీవే ఎపుడూ పక్కన వుంటే చిరంజీవి కద ఈడూరి   
చేదే తగలని వైద్యంలాగా తీయగ వుందే నీ తలపు

Thursday, January 12, 2017

సంక్రాంతి

గాదెలలోన కొత్త పంటలు
వీధుల్లోన భోగిమంటలు
ముగ్గులు వేసే ముద్దుగుమ్మలు
ఆశగ చూసే అల్లరి మూకలు
నులివెచ్చగ తాకే భానుని కిరణాలు
గుమ్మాలకి వేలాడే మామిడి తోరణాలు
విరివిగ పూసే బంతులు చేమంతులు
గొబ్బిళ్ళతొ ఆడే చక్కని పూబంతులు
ఊరంతా వినపడేలా హరిదాసు కీర్తనలు
ఇల్లిల్లూ తిరుగుతూ బసవన్నల నర్తనలు
ఆకాశాన పతంగుల హరివిల్లు
ఘుమఘుమలతో నిండిన వంటిల్లు
తొడలు కొట్టే పందెం రాయుళ్ళు
తలలు తెగి పడే మూగ కోళ్ళు
పరమాన్నాలూ బూరెలు అరిసెలు
ఆనందంతో విరిసే మనసులు
అత్తారింటికి దారేదంటూ 
గూటికి చేరే అల్లుళ్ళు
బావా బావా పన్నీరంటూ 
ఆటాడించే మరదళ్ళు
విందువినోదాల క్రాంతి
వాడవాడలా సంక్రాంతి