Wednesday, April 20, 2011

వేసవి మంచిదే

మధ్యాహ్నం మామిడికాయ పప్పు

సాయంత్రం తియ్యటి మామిడి పండు

రాత్రి మూరెడు మల్లెపూలు

వేసవి మంచిదే!

Tuesday, April 12, 2011

సీతమ్మ

అడవికి రమ్మన్నా
దుంపలు తినమన్నా
అగ్గిలో దూకమన్నా
ఆఖరికి పొమ్మన్నా
అంగీకరించింది
సీతమ్మ
అది పతివ్రత
లక్షణమంది
నాటి బామ్మ
పురుషాహంకారమంది
నేటి భామ

Thursday, April 7, 2011

అన్నా హజారే


బాపూ తెచ్చిన స్వాతంత్ర్యం చేజారె
అడుగో వచ్చె అన్నా హజారే
గర్జిస్తే ఈ ప్రజస్వామ్య పూజారే
లంచగొండ్ల గుండెలిక బేజారే

Monday, April 4, 2011

ఉగాది అంటే??


మాలిన్యమనే కుబుసం విడిచి
మనిషి తనమనే మరో చొక్కా తొడిగి
నవరసాల్ని షడ్రుచులుగా చేసిన పచ్చడి తిని
నవ వసంతాన్ని ఆహ్వానించడమే ఉగాది!!

Tuesday, March 8, 2011

కాల గమనం

ఒక మంచం మీద మల్లెపూవు నలుగుతోంది
మరో చోట ఓ తల్లిపేగు తెగుతోంది
ఇంకొచోట సగం చచ్చిన శవం మూలుగుతోంది
భూమి తన చుట్టూ తను తిరుగుతోంది

Friday, March 4, 2011

ఎందుకో నాకు

కళ్ళెదుటే  నువ్వున్నా కలలెందుకో నాకు
నీ తోడుగా వుంటున్నా కలతెందుకో నాకు


ఎన్నిసార్లు ఆ పెదవుల మధువులు నే తాగినా
వదల్లేదు తొలిముద్దు మత్తెందుకో నాకు


మల్లెపూల సువాసన మనసుని చుట్టేస్తున్నా
పాలుపోదు నువ్వులేని పక్కెందుకో నాకు

 
నా చుట్టూ ఎంతమంది తిరుగుతు వున్నా
ఊసుపోదు నువ్వులేక పొద్దెందుకో నాకు


అమృతాన్ని  కురిపించే నీ ప్రేమను చూస్తుంటే 
మెరుస్తుంది కళ్ళముందు అమ్మెందుకో నాకు


ఈడూరికి తోదుగా నూరేళ్ళూ నువ్వుంటే
వీడిపోదు బతుకు మీద ఆశెందుకో నాకు

Wednesday, March 2, 2011

అటో ఇటో

ప్చ్! ఏం మనిషో ఏమిటో
అడ్డు అదుపూ లేకుండా వెళిపోతున్నాడు ఎటో
అదిగో ఎదురుగా వస్తోంది ఆటో
ఇక తేలుతుంది వీడు అటో ఇటో