Friday, December 18, 2020

తమ్ముడూ....

 లోభికెపుడూ కలిమినిలవదు తెలుసుకోరా తమ్ముడూ 

అలసటంటే గెలుపు దక్కదు తెలుసుకోరా తమ్ముడూ


పెద్దలెన్నడు తప్పు చెప్పరు ఉదాసీనతె నష్టమూ  

శుచిగ వుంటే రోగమంటదు తెలుసుకోరా తమ్ముడూ   


పాడిపంటలు పుష్కలముగా వున్ననాడే పబ్బమూ

రైతులేకా కడుపునిండదు తెలుసుకోరా తమ్ముడూ 


చెట్టుచేమ జంతుజాలము వున్న పుడమే అందమూ

బీడు భూమిలొ మొక్క బతకదు తెలుసుకోరా తమ్ముడూ


పదవులెపుడూ పాములాటలు మానవత్వమె ధర్మమూ

శివుడు చెప్పక చీమకుట్టదు తెలుసుకోరా తమ్ముడూ


మిత్రులెవ్వరు శత్రువెవ్వరు వున్నదొకటే బంధమూ 

ఆత్మకన్నా చుట్టముండదు తెలుసుకోరా తమ్ముడూ  


మంచి పంచుతు పోతువుంటే మరణమవ్వదు భారమూ   

పుట్టినోడికి చావు తప్పదు తెలుసుకోరా తమ్ముడూ 

No comments:

Post a Comment