Monday, March 25, 2019

వున్నదోయి

అడవంతా అదేపనిగ తిరగాలని వున్నదోయి
మూగజీవులన్నిటినీ కలవాలని వున్నదోయి 


ఆచెట్టూ ఈకొమ్మా తడుముకుంటు రోజంతా
ఆకులోన ఆకునవుతు మసలాలని వున్నదోయి

 
కొండల్లో కోనల్లో తిరుగాడుతు లేడిలాగ
ఆకుపచ్చ తివాచిపై నడవాలని వున్నదోయి


జలపాతపు హోరులోని మాధుర్యం వినుకుంటూ
ప్రకృతిలో పరవసిస్తూ పాడాలని వున్నదోయి

 
వనమంటే వెన్నెలలే పగలైనా రేయైనా
మాలతిలో మనసంతా తడపాలని వున్నదోయి


తుమ్మెదనై ప్రతిపువ్వును పలకరిస్తు ఈడూరీ
ఆనందపు మధువులనే తాగాలని వున్నదోయి


ఈ అడవులు అంతరిస్తె మనుగడేది మనుషులకీ
వనదేవత మన తల్లని చాటాలని వున్నదోయి 



 



No comments:

Post a Comment