Thursday, August 6, 2015

కాముడివే

రాతిరేళ తనువంతా ప్రవహిస్తూ కాముడివే   
సరసమాడు వేళలలో అలరిస్తూ శ్యాముడివే

ఒంటరిగా నేనుంటే ఉబుసుపోక కూచుంటే    
ముద్దులాటపాటలలో మురిపిస్తూ బాలుడివే

తోడు నీడ ఔతానని పెళ్ళిలోన బాసచేసి 
కడదాకా ననునీతో నడిపిస్తూ దేవుడివే  

నిమిషమైన ఆడజాతి నిలువలేని లోకంలో
కంచుకవచమన్నట్టుగ రక్షిస్తూ ధీరుడివే

పైడి లేడి మోజు పడిన సీత నేను కాకుండా 
చుట్టుముట్టు కష్టాలను తొలగిస్తూ రాముడివే

అలుముకున్న చీకట్లను దాటించే చెలికాడా    
బతుకంతా వెన్నెలలే కురిపిస్తూ సోముడివే

దిష్టిచుక్క లేకుండా కుదరదుగా ఈడూరీ
ఈజన్మకు నామనసే దోచేస్తూ చోరుడివే

2 comments:

  1. మీరు మొత్తానికి గొప్ప భావకులే :-)

    ReplyDelete
    Replies
    1. హ హ హ మీరు మాత్రం తక్కువా..... :)

      Delete