Friday, August 14, 2015

మన భూమి

వేదాలకు జన్మనిచ్చి వెలుగొందిన భూమి మనది
జంతువులకు విలువనిచ్చి పూజించిన భూమి మనది

వాత్సాయన వరాహుడూ ఆర్యభట్ట చరకుడూను
పరిశోధన విజయాలను సాధించిన భూమి మనది

వాల్మీకీ వేద వ్యాసు కాళిదాసు పోతనలూ
ఆనాడే కలాలనూ కదిలించిన భూమి మనది

తక్షశిలా పుష్పగిరీ నలందాలు ఆనాడే
చదువులమ్మ నిలయాలుగ భాసిల్లిన భూమి మనది

రుద్రమ్మా దుర్గావతి చాందు బీబి ఝాన్సి లక్ష్మి 
మహిళలనూ అందలాలు ఎక్కించిన భూమి మనది

అన్నమయ్య రామదాసు త్యాగరాజు కబీరులూ
భగవంతుని మనసారా కీర్తించిన భూమి మనది

గౌతముడూ వివేకుడూ గురునానకు మహవీరుడు
మతాలలో మానవతను వివరించిన భూమి మనది

కూచిపూడి కధాకళీ భరతనాట్యమొడిస్సీల
భరతమాత పరవశాన నర్తించిన భూమి మనది

వందలాది ఏళ్ళు మనని బానిసలుగ చూసినట్టి
తెల్లవాడి గుండెలలో నిదురించిన భూమి మనది

ఖుదీరాము భగతుసింగు ఆజాదూ రామరాజు  
దేశానికి ప్రాణాలను అర్పించిన భూమి మనది

విజయలక్ష్మి ఇందిరమ్మ కిరణు బేడి పీటి ఉషా 
ఆడదబల కాదంటూ నినదించిన భూమి మనది

మొఘలాజం మాయబజార్ లగానులూ షోలేలూ
అద్భుతాలు వెండితెరకు చూపించిన భూమి మనది

గుల్జారూ ఆరుద్రా వేటూరీ సిరివెన్నెల
కమ్మనైన గీతాలను రచియించిన భూమి మనది 

కపిలుదేవు గోపిచందు మేరికోము సానియాలు
క్రీడలలో జయపతాక ఎగరేసిన భూమి మనది

అంతరిక్ష యాత్రలలో ఆరితేరి ఈడూరీ         
అరుణ గ్రహం పైకి కూడ లంఘించిన భూమి మనది

    


No comments:

Post a Comment