Monday, October 2, 2017

చాలు

అమ్మాయికి ఒక్క నవ్వు యిస్తే చాలు
ఓరకంట ఒక్క చూపు చూస్తే చాలు

పొద్దంతా చెప్పేందుకు ఏముంటాయి? 
రోజుకొక్క ప్రేమలేఖ రాస్తే చాలు

బంగారం, వెండిలోనె వుందా విలువ?
వాలుజడకు మల్లెపూలు తెస్తే చాలు

మహారాణి లాగ తనను చూడాలేంటి?
నీ ఎదపై తన బొమ్మను గీస్తే చాలు

అందమైన సమాధులే కట్టవద్దులె
నీ ఒడిలో తను కన్నులు మూస్తే చాలు

దినమంతా పనులేనా తప్పు సోదర 
ఒక్క క్షణం తనకోసం దాస్తే చాలు

వనితలేమి కోరుకొందురింతకుమించి
తన మోమున నీ నవ్వులు పూస్తే చాలు 

Saturday, August 12, 2017

ఉంటాయి

నడిరాతిరి నీ కురులే గుర్తొస్తూ వుంటాయి
గిలిగింతలు సువాసనలు గుప్పిస్తూ వుంటాయి


నడకలెలా తెలిసాయో నాట్యమెలా నేర్చాయొ
నా ఎదపై అందంగా నర్తిస్తూ వుంటాయి


అమాసలో జాబిలమ్మ మెరిసిందా అన్నట్టు
నీ ముఖమూ ముంగురులూ మురిపిస్తూ వుంటాయి


వలపువాన కురిపించే మేఘమాలలే కురులు
రసపట్టుకు రారమ్మని కవ్విస్తూ వుంటాయి


నిదురలోకి జారనీవు మెళకువతొ వుండనీవు
ఈడూరికి మత్తేదో ఎక్కిస్తూ వుంటాయి

Sunday, July 23, 2017

మతమంటే


ప్రతిమనిషీ తెలుసుకోక తప్పదులే మతమంటే
మానవతను నిలువెత్తున కప్పదులే మతమంటే

ప్రేమించుటె ఆరాధన దయాగుణం నైవేద్యం
ఆయుధాలు పట్టమనీ చెప్పదులే మతమంటే

కులాలతో అడ్డుగోడ కట్టువాడు స్వార్ధజీవి
ఎవ్వరినీ చెడుదారికి తిప్పదులే మతమంటే

మానవుడే సంఘజీవి సమానతే ఆదర్శం
చిన్న పెద్ద తేడాలను ఒప్పదులే మతమంటే

తేలికగా వీలుకాదు తెలుసుకొనుట ఈడూరీ
నమ్మకుంటె తనగుట్టును విప్పదులే మతమంటే

Tuesday, April 4, 2017

నా మొగుడు

ఎవరెస్టెక్కి జెండా పాతుట మరిచొస్తాడే నా మొగుడు
బజారుకెళ్ళి సరుకుల సంచీ వదిలొస్తాడే నా మొగుడు

సూటిగ చెబితె అర్థంకాదు హాస్యం అసలు బుర్రకెక్కదు
సినిమాకెడితే సీనుసీనుకి విసిగిస్తాడే నా మొగుడు

వివరంలేదు విషయంలేదు మెదడుకి పదును మచ్చుకి లేదు
డిస్కోకెళ్ళీ భరత నాట్యం చేసొస్తాడే నా మొగుడు

వంటకి వారు ముందుకు రారు తిండికి సారు దూరం కారు
సాంబార్లోకీ సగ్గుబియ్యము పోపేస్తాడే నా మొగుడు

బానెడు పొట్ట, జానెడు పొడుగు ఆటలలోన అడుగే పడదు
క్రికెట్ బంతితో టెన్నిసాటే ఆడేస్తాడే నా మొగుడు

Sunday, January 29, 2017

నీగురించి

ట్విట్టరులో ట్వీటులెన్నొ పెట్టానే నీగురించి 
ఫేస్బుక్లో లైకులెన్నొ కొట్టానే నీగురించి  

అందమైన నీఫొటోలు పదికాలాలుండేలా
ఇన్స్టాగ్రాం మెమొరీలో దాచానే నీగురించి
  
రాసుకున్న లేఖలన్ని చేయిజారి పోకుండా
వాట్సాప్లో మెసేజులే చేశానే నీగురించి

కమ్మనైన కబురులెన్నొ చెబుతావని ఆశించీ 
హ్యాంగౌట్లో ఎదురుచూపు చూశానే నీగురించి

ఈడూరిని హీరోగా చిత్రిస్తూ కథలనల్లి
వైబరులో వైభవంగ పేర్చానే నీగురించి

Wednesday, January 18, 2017

నీ తలపు

ఉదయం తాగిన కాఫీ రుచిలా హాయిగ వుందే నీ తలపు
మల్లెల వాసన తాకిన మదిలా మత్తుగ వుందే నీ తలపు

ఘడియే యుగముగ గడిపెను చూడూ విరహం వీడని నా మనసు   
తొలకరి జల్లుల చిరువాసనలా చిక్కగ వుందే నీ తలపు

ఎపుడూ చూడని ఏవో రంగులు విరిసెను నాలో ఈనాడు 
నింగిలొ మెరిసిన తారక లాగా తళుకుగ వుందే నీ తలపు

అందాలన్నీ ఒకటై చేసే అల్లరి నాట్యం నీ నడక 
అపుడే విరిసిన తామరలాగా సొంపుగ వుందే నీ తలపు

నీవే ఎపుడూ పక్కన వుంటే చిరంజీవి కద ఈడూరి   
చేదే తగలని వైద్యంలాగా తీయగ వుందే నీ తలపు

Thursday, January 12, 2017

సంక్రాంతి

గాదెలలోన కొత్త పంటలు
వీధుల్లోన భోగిమంటలు
ముగ్గులు వేసే ముద్దుగుమ్మలు
ఆశగ చూసే అల్లరి మూకలు
నులివెచ్చగ తాకే భానుని కిరణాలు
గుమ్మాలకి వేలాడే మామిడి తోరణాలు
విరివిగ పూసే బంతులు చేమంతులు
గొబ్బిళ్ళతొ ఆడే చక్కని పూబంతులు
ఊరంతా వినపడేలా హరిదాసు కీర్తనలు
ఇల్లిల్లూ తిరుగుతూ బసవన్నల నర్తనలు
ఆకాశాన పతంగుల హరివిల్లు
ఘుమఘుమలతో నిండిన వంటిల్లు
తొడలు కొట్టే పందెం రాయుళ్ళు
తలలు తెగి పడే మూగ కోళ్ళు
పరమాన్నాలూ బూరెలు అరిసెలు
ఆనందంతో విరిసే మనసులు
అత్తారింటికి దారేదంటూ 
గూటికి చేరే అల్లుళ్ళు
బావా బావా పన్నీరంటూ 
ఆటాడించే మరదళ్ళు
విందువినోదాల క్రాంతి
వాడవాడలా సంక్రాంతి