Sunday, October 30, 2011

అన్నారు


చదువుకుందామని వెళితే రిజర్వేషన్ కాదన్నారు
చదువు కొందామని వెళితే తాహతు సరిపోదన్నారు 
రేషనుకార్డు కోసం వెళితే ఆధారం లేదన్నారు
ఓటువేద్దామని వెళితే వోటరువి కాదన్నారు
వుద్యోగంకోసం వెళితే అనుభవం కావాలన్నారు
తిక్కరేగి నలుగుర్ని చితకబాది వెళితే
నా వెంటే వచ్చి నువ్వే మా లీడరువన్నారు 

Thursday, October 27, 2011

ఎటో వెళ్ళిపోయావు


అద్దంలో నే చూసిన ప్రతిసారీ నువ్వే కనబడ్డావు
అదేమిటని అడిగితే నా మాటల్లోనూ వినబడ్డావు
తీరా నీకోసం వస్తే కనుమరుగైపోయావు
అందనంత దూరంగా ఎటో వెళ్ళిపోయావు

ఒకప్పుడు

ఒకప్పుడు భూమ్మీద మనుషులుండేవారట
మంచితనం, మర్యాద పంచుతుండేవారట.

ఏవైపు చూసినా పచ్చదనం వుండేదట
నదీ పరివాహకాల్లో నాగరికత విరిసేదట.

ఏనోటి మాట విన్నా మనసు పులకరించేదట
ఏఇంటి తలుపు తట్టినా ఆప్యాయత పలకరించేదట.

శ్రమైక జీవన సౌందర్యం అనుభవించేవారట
చెరపకురా చెడేవు అని చెప్పుకునేవారట.

ఆ రోజులు పోయాయి, అవతారాలు మారాయి
విలువలు తరిగాయి, స్వార్ధాలు పెరిగాయి  

నేడు భూమ్మీద వున్న జనం మనుషులు కానేకారు
యాంత్రికంగా బతుకు లాగే మరమనుషులు వీరు

జురాసిక్కు పార్కులో స్పీలుబర్గు చూపించినట్లు
రాక్షస బల్లుల్లా మనుషులు మళ్ళీ పుడతారట 

అమ్మ నన్ను ఈరోజు జూకి తీసుకెడుతోంది
మనుషుల్ని చూపిస్తా రారమ్మని అంటోంది

అంతరించిపోతున్న మనిషి జాతీ వందనం
ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడో కలుద్దాం మనమందరం!!!!

Tuesday, October 18, 2011

నాన్నగారు


 అనుక్షణం కుటుంబం కోసం కష్టపడుతూ తమ జీవితంలో ముఖ్యమైన సమయమంతా చేజార్చుకుని, తీరా పిల్లలు పెద్దవాళ్ళై తన కలలు సాకారమయ్యే క్షణంలో ఒంటరిగా దేవుడిలో కలిసిపోయే ఎందరో నాన్నలకు ఈ ఘజల్ అంకితం.....

కడుపు నిండ తానెపుడూ తిని ఎరుగరు నాన్నగారు 
కంటి నిండ ఏరాత్రీ నిదురెరుగరు నాన్నగారు

పరివారము బరువంతా తానొకరే లాగుతూ 
మనసారా ఏనాడూ నవ్వెరుగరు నాన్నగారు 

ఆకాశం బద్దలయ్యే అల్లరెంత చేస్తున్నా
విసుగు చెంది పరుషంగా కసిరెరుగరు నాన్నగారు 

పెరుగుతున్న ధరలు, చెదురుతున్న కలలు, భారమైన
బతుకు, అలుపన్నది తాను అసలెరుగరు నాన్నగారు   

బక్కచిక్కి మంచానికి అతుక్కున్న మనిషి నేడు 
జీవితాన ఏనాడూ సుఖమెరుగరు నాన్నగారు   

సాకారం అయిన కలలు తనకు కళ్ళెదుటే ఉన్నా 
మసక కనుల మాటున అవి చూసెరుగరు నాన్నగారు  

తరలి రాని లోకాలకు తనుమాత్రం వెళ్ళిపోయె 
బతికుండగ తనవారిని వదిలెరుగరు నాన్నగారు  

Monday, October 17, 2011

చాలదా?

ప్రేమకు ఎవరైతే ఏమిటి మనసుంటే చాలదా?
దేవుడు ఎవరైతే ఏమిటి గురి వుంటే చాలదా?

ఎక్కువ తక్కువ ఎన్నడూ ఎంచవద్దు నేస్తమా
ప్రాంతం ఏదైతే ఏమిటి కలిసుంటే చాలదా?

మానవ జన్మ అందరికి భగవంతుని వరమే కదా
మరి కులమతాలు ఏమిటి మనిషిగ వుంటే చాలదా?

పుస్తకాలు ఎన్నిచదివిన ఆత్మ శుద్ధి అవుతుందా
చదువులు ఏవైతే ఏమిటి విజ్ఞత వుంటే చాలదా?

సేవే గమ్యమనే వారికి అధికారం మార్గమా
పదవి ఏదైతే ఏమిటి పాటవముంటే చాలదా?

అలుపెరుగక అనుకున్నది రాసెయ్యిక ఈడూరీ
ఇనాం లేకుంటే ఏమిటి పాఠకులుంటే చాలదా?

Sunday, October 2, 2011

చక్కని సంసారం


వెన్నెల రాత్రి
పచ్చని చెట్టు
నీ చీర కట్టు
నా మదిలో పదిలం

గోదారొడ్డు
రేవు మెట్టు
నే వేసిన ఒట్టు
నా మదిలో పదిలం

కళ్యాణ తిలకం
నీ నుదుట బాసికం
జీలకర్రా బెల్లం
నా మదిలో పదిలం

ఆగిన చక్రం
పెరిగిన ఆత్రం
విరిసిన మోదం
నా మదిలో పదిలం

నీ వేవిళ్ళు
పుల్లటి తిళ్ళు
నా కడగళ్ళు
నా మదిలో పదిలం

నీ పురిటి నెప్పులు
నా ఎదురు చూపులు
పాపాయి ఏడ్పులు
నా మదిలో పదిలం

ఒకో సారి చప్పట్లు
మరోసారి ఇక్కట్లు
ఎన్నోసార్లు సిగపట్లు
నా మదిలో పదిలం