Sunday, December 28, 2014

వేడుకే

ఎదురుగ చక్కని అమ్మాయుంటే కళ్ళకు వేడుకే
వదలక పక్కన ప్రేయసుంటె కౌగిళ్ళకు వేడుకే   

వరాలు కోరని భక్తుడు అంటూ జగాన లేడుగా 
కోర్కెలు తీర్చే దేవుడు ఉంటే గుళ్ళకు వేడుకే

తెలియని దూరం నిండిన గుండెలు ప్రగతికి చేటుగా               
ఆడీ పాడే పిల్లలు ఉంటే ఇళ్ళకు వేడుకే  

కాలే కడుపుకి మండే బూడిద జవాబు కాదుగా   
సీరియలంటె తెలియని పెళ్ళాం మొగుళ్ళకు వేడుకే 

మరకలు అంటని అధికారిని చూశావా ఎపుడైన     
టేబులు కిందికి చేయే చాస్తే ఫైళ్ళకు వేడుకే 

జీవిత పాఠాలు తప్పక నేర్పే మాస్టారుంటే 
బిలబిలమంటూ పిల్లలు వచ్చే స్కూళ్ళకు వేడుకే      

రేపుంటామో లేదొ తెలియని జీవితం, ఈడూరి  
నిమిషానికో బ్రేకింగ్ న్యూసు చానళ్ళకు వేడుకే 

Thursday, December 25, 2014

గజల్


బానిస సంకెళ్ళు నిలువున తెంచే పోదాం
అడుగడుగునా మన ముద్రను ఉంచే పోదాం 

భావి తరాలకు మన జాడలు వదలాలిగా 
మనదంటూ ఘన చరితను రచించే పోదాం

కులమతాల కట్టుబాట్లు నగుబాటే కదా 
మూఢ నమ్మకాల మొనలను తుంచే పోదాం 

మనిషి జన్మ మళ్ళీ దొరకాలని లేదుగా 
మానవత్వపు పరిమళాలు పెంచే పోదాం 

కుళ్ళు రాజకీయమిలా వదిలేస్తే ఎలా  
శ్రీ రాముడి రాజ్యం స్థాపించే పోదాం  

పోయేదెలాగూ తప్పదు కద ఈడూరీ
పదిమందికీ మన మంచిని పంచే పోదాం 

Wednesday, December 10, 2014

అదిగో ఆ నవ్వే

అదిగో ఆ నవ్వే నను కట్టిపడేసింది
విసిరే ఆ చూపే కనుగొట్టిపడేసింది

కదిలే అలలా నువు ఎటో కదిలిపోతుంటె 
వలపు అనే తుమ్మెద నను కుట్టి పడేసింది 

పగలే వెన్నెల్లు కురిసి మురిసిపోతుంటే     
మెరిసే నీ రూపం ఎద తట్టిపడేసింది
   
దివిలో ఈ అందం ఓర్వలేకపోయారా   
ఎవరో ఆ దైవం మన గట్టి ముడేసింది

మనకూ ఈడూరి తగు సమయమొచ్చిందిలే  
ఎదలో అణువణువూ తను చుట్టిపడేసింది

ఇదివరలో ఎపుడో

ఇదివరలో ఎపుడో నిను కలిసే ఉంటాను
నీ నవ్వుల జల్లులలో తడిసే ఉంటాను

ఏటిగట్టున ఒంటరిగా కూచుని ఉంటే 
ఆ ఊహల వెల్లువలో మెరిసే ఉంటాను

ఆరు బయట మంచం మీద నిదరౌతుంటే 
పున్నమి వెన్నెలలా నే కురిసే ఉంటాను

నీ వలపు దాచుకోలేక తడబడుతుంటే 
తలపుల పూదోటలొ నే విరిసే ఉంటాను

దివినుండి దిగిన అప్సరలా కదులుతూంటే 
నిను చూసిన ప్రతిసారీ మురిసే ఉంటాను

Monday, October 13, 2014

ఘజల్


ప్రేయసితో ప్రియుని మాట పరిమళమే ఘజల్
ఇరు మనసుల విరిసిన సిరి సోయగమే ఘజల్

వలపు వరదలో నిండా మమేకమయ్యేటి   
అనురాగపు జంటల యుగళ గీతమే ఘజల్

విరహముతో రగులుతున్న జతగాడి కోసం
చెలి కబురు మోసుకొచ్చే మారుతమే ఘజల్

వెతల లోతుల చితికి వేసారిన బతుకులకి
మదిని మరులు గొలిపే చెలిమి హస్తమే ఘజల్ 

ఈడూరి, రతిదేవి పూనిన ప్రేమ జంటకు
మదనుడు సారించిన పూల బాణమే ఘజల్  

Saturday, July 19, 2014

జీవిత చక్రం

ఒంటరిగానే మొదలవుతుంది జీవితం
ఒంటరిగానే ముగుస్తుంది
ఎవరి చావు వారిదే........

మొదలెక్కడో తెలియని జీవితం
తనకంటూ మరో గర్భాన్ని వెదుక్కుంటుంది
మళ్ళీ అంకురమై మొలుస్తుంది

ఒకటొకటిగా తన చుట్టూ బంధాల్ని అల్లుకుంటుంది
ఒక్కో ఇటుకా పేర్చి ఒక భవంతిని నిర్మించినట్టు
ఒక కుటుంబం తయారౌతుంది

అనుభంధాలు పెరుగుతాయి, అనురాగాలు పండుతాయి 
వచ్చే పోయే వానలా కష్టాలూ, కడగండ్లూ వస్తుంటాయి 
బంధాలతోపాటే బీటలూ పెరుగుతాయి 

ఎందుకో ఓరోజు జీవితం ఉన్నట్టుండి అలిసిపోతుంది 
తనకంటూ ఎవరున్నారని తనను తాను ప్రశ్నిస్తుంది
కొత్త గర్భం కోసం మరో వేట మొదలౌతుంది


Wednesday, April 16, 2014

కరివేపాకు


అప్పులు చేస్తే తిప్పలు తప్పవు
అప్పే లేక పప్పులు వుడకవు 
అప్పును ఒప్పుగ మార్చేదెవ్వడు?
మనకీ తిప్పలు తప్పేదెన్నడు?  
అప్పో సొప్పో చేస్తే భారం
నడిచేదెట్లా ఈ సంసారం
ఆకాశంలో ఎగిరే ధరలు
నేలమీద ఆకలి ప్రజలు
పళ్ళూకూరలు మనకందని ద్రాక్షలు
సామాన్యులకే ఎందుకీ శిక్షలు?
బొగ్గుని కూడా బొక్కే నేతలు
రక్తం రుచి మరిగిన పీతలు 
మద్యం, డబ్బులు చూపిస్తారు 
నీ వోటుకి గాలం వేసేస్తారు 
కులమూ మతమూ చూశావంటే
నోటుకి వోటుని అమ్మావంటే 
బానిసవే నువ్వు మరో అరవై నెలలు 
ఇక ఎన్నడు తీరును ఆకలి వెతలు  
సైకిల్ ఎక్కించి తొక్కేదొకడు  
కారులో షికారులు చేసేదొకడు 
నీ చెవిలో కమలం పెట్టేదొకడు
నీ ఆశల ఫ్యాను తిప్పేదొకడు  
భస్మాసుర హస్తం పెట్టేదొకడు   
అర్హత చూసి వోటుని వెయ్యి  
అవకాశవాదులకి తీసెయ్ గొయ్యి 
వోటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు 
మంచివాడికే నువ్వు పట్టం కట్టు 
నీకెన్ని కలలున్నా ఎవడిక్కావాలి 
ఎన్నికలప్పుడే నువ్వు కావాలి
నేతలందరిది ఒకటే సాకు  
వాళ్ళకి జనం  కరివేపాకు 


Sunday, April 6, 2014

రేసుగుర్రం “సిన్మా సూపిత్త మామా నీకూ సిన్మా సూపిత్త మామా” పాటకు నేను రాసిన పేరడీ


మామ నువ్వు గిట్ల స్కాములు గీములు దొమ్మీలు గిమ్మీలు దోపిడీ గీపిడి చేసుకుంట చెడిపోకే
నీకు నాకన్న మంచి విలను దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే
సుక్కల్ సూపిత్త మామా నీకూ సుక్కల్ సూపిత్త మామా
వోటు వోటుకీ నీ........ గోచీ లాగేస్త మామా
అస్మాన్ల తిరగబట్టే ఆలుగడ్డ
కాలరెత్తి రెచ్చిపోయే ఉల్లిగడ్డ
కత్తి లెక్క గుచ్చుతాంది ధరల సూచీ
హే లబ్బుడబ్బు ఆగిపోయి గుండె జారే
నిప్పు గుండమయిపోయే మా బజారే
పప్పు బియ్యం తిన్దమన్న డబ్బు లేకపాయేరా
హే నీయమ్మ ఇంత జూసుకుంట మన్నుదిన్న పాములెక్క ఏడ పండినావురా
అయ్యో నిన్ను సూడగానే ఈది సివర కుక్క కూడా తెగ మొరగబట్టే
నిన్ను ఈసారి ఎన్నికల్ల ఘోరాతిఘోరంగ ఓడిపియ్య బుద్ది పుట్టే
సుక్కల్ సూపిత్త మామా నీకూ సుక్కల్ సూపిత్త మామా
వోటు వోటుకీ నీతో పల్టీ కొట్టిత్త మామా.........మామా
సుక్కల్ సూపిత్త మామా నీకూ సుక్కల్ సూపిత్త మామా
వోటు వోటుకీ నీతో పల్టీ కొట్టిత్త మామా
అస్మాన్ల తిరగబట్టే ఆలుగడ్డ
కాలరెత్తి రెచ్చిపోయే ఉల్లిగడ్డ
కత్తి లెక్క గుచ్చుతాంది ధరల సూచీ
మామా నీకు పదవి ఇచ్చి పంపినంకనే డబ్బు మదం ఎక్కి నువ్వు కొట్టుకున్నవే
ఒరయ్యా ఒక స్కాముల ఇరికినంతనే భస్మాసుర హస్తాన్ని ఎత్తుకున్నవే
పోయినసారి నమ్మి నీకు వోటేశాను అసెంబ్లీల నేను నీకు సీటేశాను
సుట్టూత బొంగరంల తిప్పుకున్టివి, కష్టమొచ్చి సూడబోతే తప్పుకుంటివి
బడుగు ప్రజల భూములన్నీ లాక్కుంటివి సెజ్జులంటూ గుజ్జులంటూ దోచుకుంటివి
నీ నంగనాచి పనులు సూత్తే నిన్ను గెలిపించినందుకు నన్ను నేను కొట్టుకోవాలే
సుక్కల్ సూపిత్త మామా నీకూ సుక్కల్ సూపిత్త మామా
వోటు వోటుకీ నీతో పల్టీ కొట్టిత్త మామా.........మామా
సుక్కల్ సూపిత్త మామా నీకూ సుక్కల్ సూపిత్త మామా
వోటు వోటుకీ నీతో పల్టీ కొట్టిత్త మామా..... మామా.........మామా
ఎక్ దో తీన్ చార్ పాంచ్ బటాన మామ నీకు ముందుందే పుంగి బజానా
ఎక్ దో తీన్ చార్ పాంచ్ బటాన మామ నీకు ముందుందే పుంగి బజానా
ఎక్ దో తీన్ చార్ పాంచ్ బటాన మామ నీకు ముందుందే పుంగి బజానా
ఎక్ దో తీన్ చార్ పాంచ్ బటాన మామ నీకు ముందుందే పుంగి బజానా


Friday, March 28, 2014

తాత-మనవడు చిత్రంలో “అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం” అని సినారె గారు రాసిన పాటకి నా పేరడీ


ఎన్నికలు, ఫలితాలు అంతా ఒక బూటకం
పదవులకై పందికోక్కులాడుకునే నాటకం
లోక కంటకం          ||ఎన్నికలు||

ఏది గెలుపు ఏది బలుపు
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు ప్రజాస్వామ్య లోగిలి
అలసిన ఓటరుపై కనికరం ఎవ్వరికి.....ఎవ్వరికి
వాడు కాలుతున్నా, మసిమాడుతున్నా
గెలుపే కావాలి పార్టీలకి, అన్ని పార్టీలకి     ||ఎన్నికలు||

ఎమ్మెల్యే నీకూ ఒకడున్నాడు
వాడు నిధులను ఏనాడో దోచుకున్నాడు
ఐదేళ్ళలో ఏనాడూ ఇటు రాలేదు
మళ్ళీ గెలిస్తే వస్తాడను ఆశ లేదు
ఎవరయ్యా వినేది నీ అత్మఘోషను
ఏనాడూ గెలిపించకు ఈ లీడర్లను
ఈ లీడర్లను    ||| ఎన్నికలు||

ఐదేళ్ళ పాలనకై కలవరించు మూఢునికి
ఓటరన్న గుండెకోత తెలిసేనా ఎన్నడైనా
లాలుబత్తి వెలుగులకై
పరితపించు లీడర్లకి
ఆకలిదప్పుల రోదన వినిపించేనా      ||ఎన్నికలు||





Thursday, February 13, 2014

ప్రేమికుల రోజు


జీతం దొరకంగనే రెండొందలు
చేతిల బెడతడు, నీకు నచ్చింది
కొనుక్కోవే అంటడు
సందేటాల పూటుగ తాగి
ఇంటికొస్తడు, ఈరంగం జేస్తడు
కూరల కారమెక్కువైన్దనో
నచ్చిన కూర జెయ్యలేదనో
ఈవంక ఆవంక అని లేకుంట
నన్ను ఇరగ తంతడు
పొద్దుగాల లేచినంక
రాతిరి జేసిన లొల్లి
యాదుకొచ్చి
సిగ్గుతోని వంకర్లు
తిరుక్కుంట
నాకెల్లి జూసి నవ్వుతడు
అదిగో ఆ నవ్వు చాలు నాకు
ఆనిమీద మల్లి ప్రేమ పుట్టనీకి
ఆడున్నంత కాలం ప్రతి దినం

నాకు ప్రేమికుల దినమే 

Wednesday, January 22, 2014

In fond memory of ANR

(అక్కినేని ఇలా ఆనందంగా పాడుకుంటూ స్వర్గ ద్వారాలు చేరుకొని ఉంటారు అన్న నా ఊహకి అక్షర రూపం)

స్వర్గం పోదాం సందడి చేదాం చలో చలో 
స్వర్గం పోదాం సందడి చేదాం చలో చలో 
అల్లరి చేదాం చలో చలో

ప్రొద్దుపొడిచే ముందుగానే ముంగిట వాలేమూ
స్వర్గం పోదాం సందడి చేదాం చలో చలో 
అల్లరి చేదాం చలో చలో

అన్న ఎంటీయారు నను చూసి ఎంత మురిసేనో 
గుమ్మడినీ అల్లూనీ 
రేలంగినీ కనులార చూదమూ 
స్వర్గం పోదాం సందడి చేదాం చలో చలో 
అల్లరి చేదాం చలో చలో

నన్నూ చూడగానే సావిత్రి చనువు చూపేనో
భానుమతే దూకునో
మంజులయే మిగులునో ఏమౌనో చూదమూ 
స్వర్గం పోదాం సందడి చేదాం చలో చలో 
అల్లరి చేదాం చలో చలో

ఎస్వీయారు ముంగిటనే ముందుగ వాలేమూ 
స్వర్గం పోదాం సందడి చేదాం చలో చలో