Thursday, September 29, 2011

ఆడపిల్ల అలిగింది


మగాడి పశుప్రవర్తనో
వయ్యారి కాలు జారెనో
ఏ చీకటి ఆట ఫలితమో
ఏ జన్మలోని పాపమో

కరకు గుండె తల్లయింది
చిట్టితల్లి బరువయింది
చెత్తకుప్ప ఇల్లయింది
దిక్కులేని బతుకయింది

కుక్క లాక్కుపోవునో
పంది నమిలి మింగునో
నాకెలా గతి పట్టింది?
ఇందుకేనా నేను పుట్టింది?

దేవుడా నువు నిజంగా వున్నావా?
వుంటే ఒక అవకాశం ఇస్తావా?
నా ప్రాణం నువు కాపాడు
నా అండగా  సదా నిలబడు

మగ పురుగుల మదమణుస్తాను
అబల చేతికి అధికారమిస్తాను
భ్రూణ హత్యలు ఆపిస్తాను
వీరంగం స్రుష్టిస్తాను

ఆదిశక్తిగ అవతరిస్తాను
ఆడదేంటో తెలియజేస్తాను
మొండికేస్తే అంతుచూస్తాను
మోకరిల్లితే మోక్షమిస్తాను




Tuesday, September 27, 2011

నే తాగితే తప్పేంటి..........?




ఇచ్చిన ప్రతి ఆర్డర్ క్షణంలో నా ముందుకి వచ్చేస్తుంటే 
సినిమా హీరోయినో ఊహల్లో కలిసి చిందేస్తుంటే
చికెన్ పకోడి అమ్మే చిన్నది ఓరకంట నన్నే చూస్తుంటే  
తలకెక్కిన కిక్కు రోజంతా కార్చిన చెమటను తుడుస్తుంటే 
నే తాగితే తప్పేంటి..........?

నా చుట్టూ స్వర్గం ఆవరిస్తూంటే
నా బాధలు సకలం ఆవిరౌతుంటే
నా పెళ్ళం రంభలా అనిపిస్తుంటే
నా పిల్లలు దేవదూతల్లా కనిపిస్తుంటే
నే తాగితే తప్పేంటి..........?

కష్టాల కడలిని ఇష్టాల ఊయలగా మారుస్తుంటే
అంతుచిక్కని వేదనని ఆనందం కప్పేస్తుంటే
భారీగా మారిన బతుకును ఈజీగా మరిపిస్తుంటే
వురేసుకున్నా దొరకని చావును నా ముంగిట నిలబెడుతుంటే
నే తాగితే తప్పేంటి....అవును నే తాగితే తప్పేంటి..........?




Saturday, September 24, 2011

కొత్త కవి


ఏంటోయ్ కొత్త కవీ
రాస్తున్నావ్ అవీ ఇవీ
నీ రాతలు ప్రవహించాలి
యువరక్తం వుడికించాలి

శ్రీశ్రీని బట్టీ పట్టినా
సినారేని చుట్టుముట్టినా
అక్షరం అందలమెక్కదు
నీ లక్ష్యం నెరవేరదు

బూతు బొమ్మకు చొంగ కార్చే
యూతు నడక మార్చాలి 
పబ్బుల్లో పడి తాగిన
పది బీర్లూ కక్కించాలి

హాబీగా ప్రేమించే
బేబీలను మార్చాలి
బాయిఫ్రెండు కల్చరెంత
బ్యాడు ట్రెండో తెలపాలి

అడ్డంగా దండుకున్న
ఉద్దండుల తల వంచాలి
గలీజు గనుల గజనీలను
వురికంబం ఎక్కించాలి

నీ కలం నినదించాలి
వ్యవస్తను ఎదిరించాలి
యువతను రగిలించాలి
భవితను బతికించాలి

Sunday, September 11, 2011

అంకురం



గాఢాంధకారంలో జగత్తు
గాఢ నిద్రలో నేను
ఇంతలో ఏదో అలజడి
ఒక స్త్రీ మూర్తి రోదన
నేను ఏదో ద్రవంలో
తేలుతున్న భావన 
నెమ్మదిగా కిందికి జారుతున్నా
అలా మొద్లైంది
నా తొలి ప్రయాణం 
అంతలోనే ఏదొ అడ్డంకి
స్త్రీ మూర్తి ఊపిరి బిగించింది
నన్ను ఏదో శక్తి బయటికి నెట్టింది
నాకు భయంతో ఏడుపొచ్చింది
అక్కడున్న అందరికీ నవ్వొచ్చింది
మగ బిడ్డ అన్న మాట వినిపించింది
సరిగ్గా అప్పుడే....
పురుషాహంకారం అంకురించింది