Monday, February 21, 2011

చాలదా?

ప్రేమకు ఎవరైతే ఏమిటి మనసుంటే చాలదా?
దేవుడు ఎవరైతే ఏమిటి గురి వుంటే చాలదా?


నేనెక్కువ నువు తక్కువ అన్నదెవరు నేస్తమా
ప్రాంతాలు ఏవైతే ఏమిటి కలిసుంటే చాలదా?


మానవ జన్మన్నది  దేవుడిచ్చిన వరమేగా
కులమేదైతే ఏమిటి మనిషిగ వుంటే చాలదా?


పుస్తకాలు తిరగేస్తే ఆత్మ శుద్ధి అవుతుందా  
చదువేదైతే ఏమిటి విజ్ఞత వుంటే చాలదా?

సేవే గమ్యమైతే అధికారం మార్గమా
పదవేదైతే ఏమిటి పాటవముంటే చాలదా?


అలుపెరుగక అనుకున్నది రాసెయ్ ఈడూరీ
అవార్డు రాకుంటే ఏమిటి చప్పట్లుంటే చాలదా?


  

Thursday, February 17, 2011

అడుగు

నిదుర ఎంత మధురమో కునుకులేని కంటి నడుగు
సుఖమంటే ఏమిటో శ్రమించే ఒంటి నడుగు

గమ్యం లేని జీవితం చుక్కాని లేని నావేగా?
లక్ష్యమెంత ముఖ్యమో గురితప్పిన వింటి నడుగు

నలభీమ పాకం కవుల కల్పనేమో
వంట రేపు  మంట మగవాడి వంటింటి నడుగు 

బిడ్డ కెవ్వు మనగానే గుండె తిరిగి ఆడదా
వేదనెంత సౌఖ్యమో  పురిటింటి నడుగు

రైతు నడ్డి విరిగితే మనిషికేది మనుగడ?
పచ్చదనం పస ఏమిటో వర్షించని మింటి నడుగు

ముగింపే లేకుంటే మార్పెక్కడ ఈడూరీ?
విలయమెంత మోదమో ముక్కంటి నడుగు
 

Tuesday, February 15, 2011

వలపు

నీ వలపు మది తాకిన సమీరం లాగుంది
ఆ తలపు నను వీడని భ్రమరం లాగుంది


నీ చూపు తాకగానె శిలనైన నాకు
కన్ను కన్ను కలపడమే సమరం లాగుంది


ప్రేమ అనే పదానికి ఇంత పటిమ ఎక్కడిదో
ఆ ఊహే వేసవిలో శిశిరం లాగుంది


ఎంత కాదన్నా నీ వెంటే నడుస్తున్నా
నీ తీరే అసమ్మతి శిబిరం లాగుంది


ఇన్ని నెలల నిరీక్షణ ముగిసేనా తొందరలో
నీ వాలుచూపు ప్రేమాలయ శిఖరం లాగుంది


చెరిగిపోని ప్రణయాలు చరిత్రలో ఎన్నున్నా
ఈడూరీ, నీ కధ అమరం లాగుంది