Wednesday, April 29, 2015

ఆవకాయ

మండుటెండలో మంచు వానరా తెలుగు వారికి ఆవకాయ 
ఎడారి బాటలొ నీటి ఊటరా ఇంటి నారికి ఆవకాయ  

ముద్ద పప్పూ మంచి నెయ్యీ వేడి అన్నం కలిపి కొడితివా
ఆగకుండా జారిపోదా మరి కడుపులోనికి ఆవకాయ

చేదు వగరుల మేలు కలయిక తాగుబోతుకి అమృతమ్మేగద  
గొంతు లోకి జారగా స్వర్గమే మందుబాబుకి ఆవకాయ 

బతుకు నడవనీ పూటగడవనీ  బక్కచిక్కిన జనానికీ    
ఉంటే చాలుగ అదే పదివేలు బీదవానికి ఆవకాయ 

వివాహమంటే అది మాటలా మర్యాదలెంతగ చెయ్యాలొ
దొరకలేదంటే కుదరదోయీ పెళ్ళి విందుకి ఆవకాయ 

నేడు ఉండీ రేపు పోయే ఆస్తులదేముంది ఈడూరీ   
చెక్కుచెదరని సొత్తు గదరా మన తెలుగు జాతికి ఆవకాయ

టీవీలు మాకొద్దు

నిజాలన్న్ని నిర్భయంగా చిత్రించని టీవీలు మాకొద్దు 
అన్యాయాన్ని అనునిత్యం ఎదిరించని టీవీలు మాకొద్దు

అత్తాకోడళ్ళంటే ఎపుడూ పిల్లీ ఎలుకల కధేనా?
యిళ్ళల్లోన చిరు ప్రేమలు పూయించని టీవీలు మాకొద్దు 

పాత వంటకాలతో పాట్లు పడే యాంకర్లను చూశారా?
నోరూరే  కొత్త వంటల రుచి పంచని టీవీలు మాకొద్దు
   
వచ్చీరాని తెలుగుతో వంకర్లు తిరిగే యాంకర్ల గోల 
తేనెలూరే  తెలుగు పదం వినిపించని టీవీలు మాకొద్దు

మనిషి మనిషికి మధ్య మంచు గోడలు కట్టుటా పాత్రికేయం?
మానవత్వపు మధురిమలను కురిపించని టీవీలు మాకొద్దు

అందానికి మెరుగులనిచ్చేది మొహానికి పూసే రంగులా?
మనసులోపలి సౌందర్యం చూపించని టీవీలు మాకొద్దు 

యువతీ యువకులనగానే రోజంతా ఆట పాటలేనా?   
సమస్యలపై యువశక్తిని మళ్ళించని టీవీలు మాకొద్దు 

ఊసుపోని ఆటలే గృహలక్ష్మిని మహాలక్ష్మి చేస్తాయా?
మహిళామణుల చైతన్యం రగిలించని టీవీలు మాకొద్దు

వీక్షకునికి వినోదమే ప్రధానం కాదు కదా ఈడూరీ
అంతో ఇంతొ విజ్ఞానం అందించని టీవీలు మాకొద్దు

Saturday, April 25, 2015

కామన్

పేగును తెంచీ ప్రేమను పంచుట తల్లికి కామన్ 
పళ్ళను కాసీ రుచులను పంచుట చెట్లకి కామన్

ఎక్కడ చూడూ లీడరులంతా స్కాముల స్వాములె  
వోట్లను వేసీ పదవులు పంచుట ప్రజలకి కామన్ 

టీచరు బెత్తం దరువులు లేకా విద్యలు రావే
చదువులు నేర్పీ తెలివిని పంచుట గురువుకి కామన్
   
ఒకటికి ఒకటీ ఫ్రీగా వస్తే కొంటారంతా
రేటుని పెంచీ డొస్కౌంట్ పంచుట విపణికి కామన్
   
ఆటోవాడికి అడిగిన ఛార్జీ ఇవ్వక తప్పదు
మీటరులాపీ మోసం పంచుట వాళ్ళకి కామన్  

డబ్బెంతున్నా హీరోయిన్లకి బట్టలు కరువే 
అందం చూపీ ఆశలు పంచుట వీళ్ళకి కామన్  

మధ్యం తాగితె ఇల్లూ ఒళ్ళూ రెండూ గుల్లే 
బుధ్ధిని తుంచీ మత్తుని  పంచుట మందుకి కామన్  

ఉన్మాది గాడికి ప్రేయసి దొరుకుట ఎపుడు సులువే 
ప్రేమలు నటించి యాసిడ్ పంచుట వాడికి కామన్
   
అందరిలాగే నువ్వూ రాస్తె చాలదు ఈడూరి    
మంచిని చెప్పీ హాస్యం పంచుట గజలుకి కామన్ 

బాధెందుకు?

వెన్నెల లేదేమని బాధెందుకు? నీ నవ్వుల జల్లుండగా
భానుడు రాలేదని బాధెందుకు? నీ ప్రేమల వెలుగుండగా 

వేసవిలోన చల్లగాలి ఆశించుట కూడా తప్పేనా?
మల్లెల వాసన లేదని బాధెందుకు? నీ ఊహల తావుండగా

ఆకాశంలో పక్షిలా ఎగరడమదెంత కష్టం నాకూ  
మేఘాల జాడేదని బాధెందుకు? నీ ఊహల తోడుండగా

ఏడారిలో దాహాలకు లోటంటూ ఏముందిలే ప్రియా 
ఒయాసిస్సు లేదని బాధెందుకు? నీ అధరామృతముండగా   

ఏడేడు జన్మాల బంధాలు నిజమో కాదో తెలియదు మరి
ఎడబాటు తలచి బాధెందుకు? నా చేతిలొ నీ చేయుండగా

Thursday, April 23, 2015

సిని-మాయే

చిటికెలు వేస్తే సుమోలు లేస్తే అది సినిమాయే 
ఒకటే గుండుకి నలుగురు ఛస్తే అది సినిమాయే 

రౌడీ గాడిని హీరో గారూ ఒకటే దెబ్బతొ     
పాతాళంలోనికి పాతేస్తే అది సినిమాయే 

బాల్యంలోనే ఎపుడొ తిరునాళ్ళలొ తప్పిపోయిన
అన్న తమ్ముడు మళ్ళీ కలిస్తే అది సినిమాయే 

పూటకు గడవని కూలీ నాలీ చేయని వాడిని
డబ్బున్నోళ్ళ పిల్ల ప్రేమిస్తే అది సినిమాయే

అమలాపురములో అమ్మాయి గారు ఉన్నట్టుండి    
అమెరికాలోన డ్యాన్సే చేస్తే  అది సినిమాయే

విదేశాలలో పెరిగిన హీరో ఇండియాకొచ్చి
ఎకరాలెకరాలుగ పండిస్తే  అది సినిమాయే   

ఈడూరీ ఇక లాభంలేదూ నువ్వూ నేనూ
తోచిందేదో తీసిపారేస్తే అది సినిమాయే

Thursday, April 16, 2015

నువ్వే గుర్తొచ్చావు

ఆ పాపాయ్ నవ్వు చూస్తే నువ్వే గుర్తొచ్చావు
ఓ కెరటం ఎగిరి లేస్తే నువ్వే గుర్తొచ్చావు  

నిన్నో మొన్నో చిగురులు తొడిగిన నునులేత మొక్క 
ఈ ఉదయం మొగ్గ వేస్తే నువ్వే గుర్తొచ్చావు

పున్నమి రేయి ప్రకృతి అందం విడిగా చెప్పాలా 
మది నిండ వెన్నెల కురిస్తె నువ్వే గుర్తొచ్చావు

గాలి ఈల వేసింది ఏదేదొ గోల చేసింది
ఊహలకే ఊపిరులొస్తె నువ్వే గుర్తొచ్చావు 

వసంతమొస్తే వలపులు చిగురులు తొడుగుట సహజం  
కొమ్మల్లో కోయిల కూస్తె నువ్వే గుర్తొచ్చావు
   
కొండల్లో పారే నది నీ నడుమె అనిపించింది 
గంగమ్మకు హరతులిస్తే నువ్వే గుర్తొచ్చావు 

ఈడూరికి ఎంత ఇష్టమో ఆ లేత కిరణాలు 
గదిలోకి వెలుగుని తెస్తే నువ్వే గుర్తొచ్చావు

Tuesday, April 14, 2015

చూడాలని ఉంది

వేల నెమళ్ళు నాట్యం చేస్తే చూడాలని ఉంది
కోయిల గుంపులు రాగం తీస్తె చూడాలని ఉంది

అనంత విశ్వపు అందాలన్నీ దేవుడి సృష్టే   
అంతటి దైవం ఎదురుగ వస్తె చూడాలని ఉంది

వేషం భాష వేరైనా మానవ జాతి ఒకటే 
మనిషీ మనిషి కలిసి నడిస్తే చూడాలని ఉంది

మనిషితనమే కరువైన ఈ కాలపు రోజుల్లో    
మంచితనం వానై కురిస్తే చూడాలని ఉంది

ఉన్మాదమే ప్రేమగ భావించె పాషాణాలకి 
మనసులే మల్లెలుగా పూస్తే చూడాలని ఉంది  

కల్తీ లేనిది ఏదీలేని ప్రస్థుత తరుణంలొ  
అమ్మ ప్రేమను ఇల్లాలిస్తే చూడాలని ఉంది  

అందరు మెచ్చే పని అద్భుతమేగా ఈడూరీ      
ఇలాటి జన్మ మళ్ళీ వస్తే చూడాలని ఉంది    

Saturday, April 11, 2015

అంతా మాయే

 నేతలు నీతులు చెబుతామంటే అంతా మాయే
దొంగలు మంచిగ అవుతామంటే అంతా మాయే 
రోజుకి చెంచా కన్నీరొదలని మహిళలు గలరా 
వనితలు టీవీ చూడము అంటే అంతా మాయే
పొరుగున ఇంట్లో కూరని తింటే రుచియే కాదా 
భర్తలు భార్యని పొగుడుతు ఉంటే అంతా మాయే  
చదువులు వదిలి ఛాటింగు చేయుట ఫ్యాషను నేడూ 
పిల్లలు నెట్టుకి దూరము అంటే అంతా మాయే 
మతాలు అన్నీ మనిషిని మనిషిగ మార్చుటకేగా 
ముష్కర మూకలు జీహాదంటే అంతా మాయే 
టీవీ తారకి ఏవీ రావని తెలిసిందేగా
చక్కని తెలుగూ వచ్చని అంటే అంతా మాయే 
కామెడి అంటే వెకిలి చేష్టలూ వెటకారాలూ 
బూతులు వదిలీ బుధ్ధిగ ఉంటే అంతా మాయే  
తేరగ వచ్చే డబ్బుని చూస్తే ఆశే మనకూ 
వరుడే కట్నం వద్దని అంటే అంతా మాయే      
నోటికి వచ్చిందేదో రాసి పారేస్తే యెలా
ఈడూరి రాయడమొచ్చని అంటే అంతా మాయే   

Sunday, April 5, 2015

సరదా గజల్

కొవ్వు కరగకున్నా పర్లేదు పెరగకపోతే చాలు
రోగం కుదరకున్నా పర్లేదు ముదరకపోతె చాలు

రాత్రి సినిమాకి వెళ్ళి వస్తూంటే మా వీధిలొ కుక్క
నన్ను చూసి మొరిగినా పర్లేదు కరవకపోతె చాలు
  
సర్కారీ కొలువుల్లో నెలవైన జీతగాళ్ళు పనులు 
చేయకున్న పర్లేదు లంచం మరగకపోతే చాలు  
   
చట్టసభల కుర్చీల్లో పదిలంగా సెటిలైన వారు 
కుర్చి దిగకున్న పర్లేదు డబ్బు తినకపోతే చాలు 

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తుంటరి బాబాలు 
బోధించకున్న పర్లేదు, బాధించకపోతే చాలు 

శ్రమ పడి రాసిన ప్రేమలేఖకి ఫలితం లేదేలనో  
పిల్ల కాదన్నా పర్లేదు చెప్పుతీయకపోతె చాలు