Sunday, May 17, 2015

మారదు లోకం

భానుడే పశ్చిమాన ఉదయించినా మారదు లోకం
రాముడే మరోసారి జన్మించినా మారదు లోకం  

ట్రాఫిక్కు చిక్కులే, ఏ రోడ్డైనా శవాల గుట్టలె    
వాసుదేవుడే రధం నడిపించినా మారదు లోకం 

కాలుష్యాల కోరలలో కరడు గట్టినా హృదయాలు   
శివుడే ఈ గరళాలు కబళించినా మారదు లోకం      

నేరమూ ఘోరమూ దినచర్యలు ఈ పుణ్య భూమిలో    
బ్రహ్మ దేవుడే మరల సృష్టించినా మారదు లోకం 

చౌకబారు చదువులతో తరిగిపోయె ఘన విజ్ఞానం 
మన వేదాలను తిరగ రాయించినా మారదు లోకం 

ఈడూరికి బాగా తెలుసునండి యిది పాడు ప్రపంచం   
ముక్కోటి దేవతలూ కరుణించినా మారదు లోకం 

No comments:

Post a Comment