Tuesday, October 18, 2011

నాన్నగారు


 అనుక్షణం కుటుంబం కోసం కష్టపడుతూ తమ జీవితంలో ముఖ్యమైన సమయమంతా చేజార్చుకుని, తీరా పిల్లలు పెద్దవాళ్ళై తన కలలు సాకారమయ్యే క్షణంలో ఒంటరిగా దేవుడిలో కలిసిపోయే ఎందరో నాన్నలకు ఈ ఘజల్ అంకితం.....

కడుపు నిండ తానెపుడూ తిని ఎరుగరు నాన్నగారు 
కంటి నిండ ఏరాత్రీ నిదురెరుగరు నాన్నగారు

పరివారము బరువంతా తానొకరే లాగుతూ 
మనసారా ఏనాడూ నవ్వెరుగరు నాన్నగారు 

ఆకాశం బద్దలయ్యే అల్లరెంత చేస్తున్నా
విసుగు చెంది పరుషంగా కసిరెరుగరు నాన్నగారు 

పెరుగుతున్న ధరలు, చెదురుతున్న కలలు, భారమైన
బతుకు, అలుపన్నది తాను అసలెరుగరు నాన్నగారు   

బక్కచిక్కి మంచానికి అతుక్కున్న మనిషి నేడు 
జీవితాన ఏనాడూ సుఖమెరుగరు నాన్నగారు   

సాకారం అయిన కలలు తనకు కళ్ళెదుటే ఉన్నా 
మసక కనుల మాటున అవి చూసెరుగరు నాన్నగారు  

తరలి రాని లోకాలకు తనుమాత్రం వెళ్ళిపోయె 
బతికుండగ తనవారిని వదిలెరుగరు నాన్నగారు  

No comments:

Post a Comment