Wednesday, March 13, 2019

బతుకిట్టాగుండేదా

నుదుటన రాతలు తల్లులు రాస్తే మన బతుకిట్టాగుండేదా
తండ్రులు చూపిన దారిలో నడిస్తే మన బతుకిట్టాగుండేదా


అంతా మంచే వుంటే దేశం యింకో విధంగ ఉండేదే
గురువులు  జెప్పిన నీతులు ఫలిస్తే మనబతుకిట్టాగుండేదా


వారం తిరిగే లోపే జీతం మాయం, ఏమిటి ఖర్మం?
ఒకటో తేదీ రోజూ వస్తే మనబతుకిట్టాగుండేదా


రేపుంటామో లేదో తెలీదు ఎందుకులెద్దూ ఆరాటం
చావుపుట్టుకల వివరం తెలిస్తే మనబతుకిట్టాగుండేదా


పెళ్ళాం చేతికి డబ్బులు దొరికితే మనపని కాస్తా ఖాళీ
చొక్కా జేబుకు పాస్వర్డ్ తగిలిస్తే మనబతుకిట్టాగుండేదా

రంగులమయమే స్వప్నం ఎపుడూ...నిజమది కాదుర ఈడూరి  
కలలో చూసిన కన్యే వరిస్తే మనబతుకిట్టాగుండేదా


డబ్బును చూస్తే తోకలు వూపుట నేతలకెపుడూ అలవాటేలే
ప్రజలే వోటుకు విలువను యిస్తే మన బతుకిట్టాగుండేదా

No comments:

Post a Comment