Thursday, March 7, 2019

అనుకున్నా!

పదునాలుగు లోకాలూ దిగివచ్చావనుకున్నా
నాకోసం స్వర్గాన్నే వదిలొచ్చావనుకున్నా


సోయగాల రారాణివి, సాటిలేరు నీకెవరూ
ఐశ్వర్యకు అందాన్నే అరువిచ్చావనుకున్నా


మత్తెక్కిన కళ్ళతోటి నావైపుకు నువు చూస్తే
శతాబ్దాల క్రితంనాటి మధువిచ్చావనుకున్నా


వెన్నెల్లో శిల్పంలా నా ఎదురుగ నుంచుంటే
కలలలోన తేలేందుకు కదిలొచ్చావనుకున్నా


నువురాసిన ప్రేమలేఖ అందిందోయ్ ఈడూరికి
రాబోయే జన్మలనూ రాసిచ్చావనుకున్నా

1 comment:

  1. మీ ప్రేమలేఖ మీ శ్రీమతికి చూపిస్తా,
    అపుడు పిడకతో ఈడూరికి పెళ్ళే !

    ReplyDelete