Wednesday, January 18, 2017

నీ తలపు

ఉదయం తాగిన కాఫీ రుచిలా హాయిగ వుందే నీ తలపు
మల్లెల వాసన తాకిన మదిలా మత్తుగ వుందే నీ తలపు

ఘడియే యుగముగ గడిపెను చూడూ విరహం వీడని నా మనసు   
తొలకరి జల్లుల చిరువాసనలా చిక్కగ వుందే నీ తలపు

ఎపుడూ చూడని ఏవో రంగులు విరిసెను నాలో ఈనాడు 
నింగిలొ మెరిసిన తారక లాగా తళుకుగ వుందే నీ తలపు

అందాలన్నీ ఒకటై చేసే అల్లరి నాట్యం నీ నడక 
అపుడే విరిసిన తామరలాగా సొంపుగ వుందే నీ తలపు

నీవే ఎపుడూ పక్కన వుంటే చిరంజీవి కద ఈడూరి   
చేదే తగలని వైద్యంలాగా తీయగ వుందే నీ తలపు

No comments:

Post a Comment